వాళ్ళు మనుష్యులేనా?

Aug 19,2024 03:06 #aksharam, #kavithalu, #sahityam
నూతనంగా నిర్మించిన కార్తికేయ

వాళ్ళు మనుషుల రూపంలో
తిరుగుతున్న మృగరాక్షసులు
వాళ్లకి అమ్మ ఉంటే తెలిసేది
అమ్మతనం అంటే ఏమిటో ..!
సాటి మానవిపై ఎందుకిలా
మరణవాంగ్మూలాలు రాస్తున్నారు?

నీవు మరో ‘నిర్భయ’ కావు అంటూ
ఎన్ని చట్టాలు చేసినా మార్పు లేదు
తన పర బేధాలు లేని చట్టం రావాలి
మృగంగా మారే మనోవైకల్యాలకు
గుండెల్లో భయం పుట్టాలి!

అందరినీ కాపాడే అమ్మవు నీవు
నీపై అఘాయిత్యం మానవజాతికి చెరగని మచ్చ
మా నిస్సహాయతకు సిగ్గుపడుతున్నాం
‘ఈ దేశాన్ని రామరాజ్యం చేసేస్తాం
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలుగుతుంది
ఒక్క చరవాణి సందేశం చాలు చమడాలు ఒలిచేస్తాం’
ఆవన్నీ ఒట్టి మాటలే తల్లీ !
నిన్నెవ్వరూ ఈ భూమ్మీద రక్షించరు
రక్షిస్తున్నామని చెప్పుకొని తిరుగుతుంటారు అంతే!
నిన్ను నువ్వే రక్షించుకోవాలి!
రాక్షసుల్లాంటి మనుషులున్న ఎడారిలో ఉన్నావు
ఈ నేలలో పుట్టినందుకు సిగ్గుతో తలదించుకోకు
ఇప్పుడు నువ్వొక అగ్నిశిఖవు కావాలి
మహంకాళివై, భద్రకాళివై
నీ విశ్వరూపాన్ని అవసరమైన
ప్రతిచోటా చూపించాల్సిందే!
– చిత్రాడ కిషోర్‌ కుమార్‌, 9866912906
బహుశా …
బహుశా
ఆ కామాంధుడు నన్ను చూడకపోయివుంటే
ఆ కఠినాత్ముడు నన్ను ఆశించకపోయివుంటే
ఆ దుర్మార్గుడు నాపై గురి పెట్టకుండా వుంటే
బహుశా
ఆ నీచునికి తల్లిదండ్రులు మంచీ చెడు చెప్పివుంటే
ఆ హీనుడు గురువుల ద్వారా సంస్కారం నేర్చి వుంటే
ఆ క్రూరుడికి తల్లీ చెల్లెళ్ళు గుర్తుకొచ్చివుంటే
బహుశా
ఆ రోజు నేను అక్కడికి వెళ్ళకుండావుంటే
బహుశా
ఇప్పుడు కూడా నేను జీవించివుండేదానిని
ఇప్పుడు కూడా నేను తలెత్తి తిరుగుతూ ఉండేదానిని
ఇప్పుడు కూడా మీకు సేవ చేస్తుండేదానిని
ఇప్పుడు కూడా మీకు స్ఫూర్తి అయ్యేదానిని
బహుశా బహుశా
అయినా నా మరణంలో
మీరు కులాన్ని, మతాన్ని గుర్తుచేసుకోనందుకు
మీరు ఇంకా మానవత్వం ఉన్నవారే అని
మనసులో ఏదో ఒక సన్నని ఆశ మెదులుతోంది
కుట్టిన దోమని, కరచిన పాముని కొట్టి చంపే మీరు
ఆ అమానుష మృగాన్ని ఏం చేస్తారో …
బహుశా బహుశా ….

– గోళ్ల నారాయణ రావు

➡️