విస్మయపరిచే ‘ఇవీ, మన మూలాలు!’

Feb 12,2024 09:01 #sahityam

                మానవ ప్రస్థానం గురించీ, మరీ ముఖ్యంగా ‘మన’ మూలాల గురించీ తెలుగులో ఒక సాధికారిక గ్రంథంగా ఇటీవల విడుదలైంది కల్లూరి భాస్కరం రచన ‘ఇవీ మన మూలాలు’. ఈ పుస్తకం గురించి ఇప్పుడు విస్తారమైన చర్చ జరుగుతోంది. ఈ పుస్తకం ఎందుకు చదవాలో చెప్పేముందు వారి మాటలు వినండి.

”మన విశ్వాసాలూ, ఇష్టా ఇష్టాలూ, రాజకీయ అవసరాలదీ కాకుండా, శాస్త్ర పరిశోధనల్లో జ్ఞానానిది పైచేయి అయినంతవరకూ, ఆ పరిశోధన క్రమంలో ఎలాంటి ఫలితాలు వచ్చినా, వాటిని తెరచిన బుద్ధితో ఆహ్వానించడమే మనం చేయగలిగిందీ, చేయవలసిందీ.”

”ఒక్క మనదేశానికి మాత్రమే పరిమితమై చెప్పుకుంటే, జన్యు పరిశోధనలు భారత్‌లోకి ఆర్య ఇండో- యూరోపియన్‌ జనాల వలసను స్పష్టీకరించిన దరిమిలా, జనం సెంటిమెంటును వాడుకునే రాజకీయానికీ, జ్ఞానరంగానికీ మధ్య ఒక అసమ యుద్ధం ముమ్మరమైంది. ధర్మ పోరాటంలో తాను ఓడిపోతున్న పరిస్థితుల్లో రాజకీయం తమకు కలిసివచ్చే మేధావులూ, మీడియా సాయంతో అసత్యాలూ, అర్థసత్యాలూ వక్రీకరణలే ఆయుధాలుగా అధర్మ పోరాటానికి దిగింది. అంతకన్నా కూడా అసలా చర్చ మీదే తెరదించేసి వ్యూహాత్మక మౌనం పాటించడమే మంచిదని కూడా క్రమంగా భావించినట్లు కనిపిస్తోంది.

”నిజానికి కల్లూరి భాస్కరం గారి ఈ వాక్యాలే ఈ పుస్తకానికి ఆలంబన. నా ఈ సమీక్షకు పురికొల్పిన మాటలు కూడా ఇవే! ఇవీ ‘మన’ మూలాలు అనగానే మనకు తట్టేది ఒక గర్వాతిశయం. మన పూర్వీకుల గురించి గర్వంతో ఉప్పొంగిపోవాలన్న ఆసక్తి! ప్రతి మానవుడికీ ఇది సహజమేమో! మన జననం, మన జనం, మన ఊరు, మన దేశం, మన తాత ముత్తాతలు, మన వంశవృక్షం … అబ్బా, ఈ ‘మన’లో ఎంత ఆకర్షణ వుంది! ఈ అవ్యాజమైన అనురాగాన్ని ఏ జన్యువు పెంచి పోషించిందో తెలీదు కానీ, మన మూలాల గురించి తెలుసుకోవాలన్న తపన మనని నిరంతరం ఉత్సాహంతో నింపేస్తుంది. ఈ సందర్భంలో అలెగ్స్‌ హేలీ రాసిన ‘ది రూట్స్‌’ మనని అమితంగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి.

ప్రాణికోటి ప్రస్థానం అంతా కలగాపులగం. అదేమీ అధ్యాయాలకు అధ్యాయాలు ఏదో మెథడలాజికల్‌గా పద్ధతిగా అల్లుకుపోయిన కథేమీ కాదు. నిజానికి అదొక పేజీలు చిరిగిన పుస్తకం. అన్నీ అతుకుల బొంతలు. తదుపరి పేజీలో క్లూ దొరుకుతుందన్న ఉత్సాహంతో పేజీ తిప్పితే అక్కడ ఆ పేజీనే గల్లంతై ఉంటుంది.

తొలి మానవ ఆనవాళ్లు మొదలయ్యాక వాటి వలసలన్నీ అయోమయంగా ఊహకు అందనంతగా, ఎటువంటి ఆధారాల్లేకుండా పోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. మనం భూగోళంగా భావించే ఈ మట్టి (నీటి) ముద్ద ఒకప్పుడెలా ఉందో ఆ తర్వాత అది పెళ్ళలుగా విడిపోయి ఖండాలుగా అవతరించినప్పుడూ, మంచు యుగాలు కొనసాగినప్పుడూ, జల ఖండాలు విడదీసినప్పుడూ, అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడూ ఎలా రూపురేఖలు మార్చుకుందో నిరాధారం. మానవ మనుగడ మొదలయ్యే అనేక దశల్లో ఆ ఖండ భాగాలు చెల్లాచెదురై, గుంపులు గుంపులుగా కలిపి వుంచిన తొలి మానవ ప్రాణుల మధ్య అగాధాలు సృష్టించినా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్లి మరొక గుంపుతో సంపర్కాలు జరిపి, తమ జన్యువుల్లో అన్ని గుంపుల తాలూకూ లక్షణాలను ఎలా మోసుకుంటూ తిరిగారో అంతా అనూహ్యం. అయినప్పటికీ, ఒకచోట స్థిరపడే వరకూ కొనసాగిన ఆ మానవ మహాప్రస్థానాన్ని, గల్లంతయిన పేజీలను జాగ్రత్తగా పేర్చుకుంటూ, సరిచేసుకుంటూ, నిర్మించుకురావడం చాలా ఆసక్తికరం. ఈ ఆసక్తికర కథనాన్ని ఈ పుస్తకం నిష్పక్షపాతంగా మన ముందుంచే ప్రయత్నం చేసింది.

వారి అధ్యయన సామగ్రి అంతా అత్యంత ఆధునిక పరిశోధనల్లో వెలికి వచ్చిన సమాచారంతో పాటూ, ఇతిహాస హౌదా గల మహాభారత కథనాన్ని అంతర్వాహినిగా జోడిస్తూ, వ్యాఖ్యానిస్తూ సాగిన సత్యాన్వేషణ ఇది. గ్రీకు ఇలియడ్‌, అడిసీ ఎపిక్స్‌ యాంత్రోపాలజిస్టుకు యే దృక్కోణంలో ఉపయోగపడ్డాయో ఇంచుమించు అదే రీతిలో మహాభారతాన్ని ఒక మానవ శాస్త్ర పరిశోధకుడిలా అధ్యయనం చేసిన రచయిత ఆయా గాధల్లోని మార్మికతలను తరచి చూస్తూ ఈ పుస్తకాన్ని కొనసాగిస్తారు.

చాల్స్‌ డార్విన్‌, టోనీ జోసెఫ్‌, డేవిడ్‌ రైక్‌, రూధర్‌ ఫర్డ్‌, డేవిడ్‌ అంతోనీ వంటి వారి అద్భుత పరిశోధనా ఫలితాలను ఉటంకిస్తూ సాగిన ఈ రచన బీజాంకుర దశ నుంచి, అంటే ఎక్స్‌, వై క్రోమోజోముల నుంచి మొదలై, హద్దుల్లేని భూగోళమంతా చుట్టి, ఆర్యావర్తం వరకూ వచ్చి అంతమవుతుంది. స్థల కాలాల సరిహద్దుల ఊహా జగతి ఒక్కసారిగా విస్తృతమై, దిగంతాలు దాటి వెతుక్కుంటూ వెళ్లి, అన్వేషణ పూర్తయ్యాక మన హృదయాలు కుంచించుకుపోవడానికి బదులు విప్పారుతాయి. కుల, వర్ణ, వర్గ, జాతి స్ప ృహలు లేని ఒక మహౌన్నత సమాజంలో విశ్వ మానవ ప్రాణిగా వికసించాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం మన హృదయంలో నాటుతుంది. ఈ పుస్తకం పూర్తయ్యాక, మానవ సమాజం పట్ల ఒక గొప్ప గ్రంథానికి వుండాల్సిన బాధ్యత ఇంతకంటే వేరే ఏదో ఉంటుందనుకోవడం పొరపాటనిపిస్తుంది.

ఈ గ్రంథం మహా వానరాలైన చింపాంజీలూ, బోనోబోలు, వొరాంగుటాన్లూ, గొరిల్లాలు, హౌమోలు (24 జతల క్రోమోజోములు కలిగిన) నుంచి విడిపోయి, 23 జతల క్రోమోజోములు కలిగిన మనిషి తొలిసారిగా కనబడటం మొదలుపెట్టిన 32 లక్షల సంవత్సరాల క్రితం నుంచీ ప్రారంభించి, 19 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వేరే ప్రాంతాలకు విస్తరించడమూ, 7 లక్షల సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చిన హౌమో సేపియన్స్‌, నియాండర్తల్‌ అనే రెండు మానవ రకాల పరిశీలనతో ప్రారంభమవుతుంది. నియండర్తల్‌ మగ ప్రాణి లక్ష సంవత్సరాల క్రితం ఈ హౌమో సేపియన్స్‌ ఆడ ప్రాణితో జత గూడడమూ, నియాండర్తల్‌ రకం అంతరించిపోయినా ఇప్పటికీ మనలో ‘కెరాటిన్‌’ జన్యు అవశేషాన్ని మోసుకు తిరగడమూ అనే ఒక్క ఉదాహరణతో మన సజాతీయ గుంపుల మధ్య సంపర్కాలు ఖండాలు దాటి ఉన్నాయన్న వాస్తవం గగుర్పాటు కలిగిస్తుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే! ఇలాంటివి అనేకం ఈ పుస్తకం నిండా వున్నాయి. నియాండర్తల్‌ కంటే ముందే సైబీరియాలో మరో మానవ రకమైన డెనిసోవన్‌ జన్యు అవశేషాలు తొమ్మిది వేల కిలోమీటర్ల అవతల ఉన్న న్యూ గినీలో దొరికాయంటే ఈ మానవ వలస ఎంత విస్తారమో అర్థం చేసుకోవచ్చు.మానవ చరిత్రలో తొలి మహత్తర విప్లవం వ్యవసాయమనీ, వ్యవసాయం కోసం ప్రాదేశిక భావన బలపడి రాజ్యావతరణకు ఎలా దారి తీసిందో, ఈ ప్రాదేశిక భావన వెనక అసలు నిజం ఆస్తుల సొంతమూ, వాటిని కాపాడుకోవడం కోసమేననేది సరిహద్దుల గీతలు, కంచెలు, గోడల్లో చూడొచ్చుననే నిజాన్ని బయట పెడుతుంది. ఇలాంటి అద్భుత సూత్రీకరణలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ రైక్‌, హిటైట్‌ లిపి ఛేదించిన ప్రముఖ పురాతత్వ భాషావేత్త బెడ్రిక్‌ హ్రౌజ్నీ నీ ప్రస్తావిస్తూ, వ్యవసాయ విప్లవం పారిశ్రామిక విప్లవంతో పోల్చదగ్గ మహా విప్లవం ఎందుకైదో చెబుతారు.

14 వేల సంవత్సరాల క్రితం మంచుయుగం ముగిసి, భూమి వేడెక్కుతున్న తరుణంలో అప్పటికి వున్న 20 లక్షల మంది హంటర్‌ గేదరర్స్‌ అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ వెళ్లి, స్థిర నివాసాల ఏర్పరచుకోవడమూ, 11, 12 వేల సంవత్సరాల క్రితం ఆగేయ టర్కీలోనూ, ఉత్తర సిరియాలోనూ వీళ్ళే మొక్కలూ, జంతువులూ పెంచడం ద్వారా ఈ విప్లవానికి ఆద్యులవ్వడం ఆ తర్వాత సింధులోయ తీరాలకు వెళ్లడం, అక్కడి నుంచి మన మూలాల్లోకి చొరబడటంతో కథ మలుపు తిరుగుతుంది.

జన్యు ఆధారాలతో చెప్పినప్పుడు వేల సంవత్సరాల క్రితం ఈ వలసలు రూఢిగా జరిగినట్లు తెలుస్తోంది. మెహర్‌ గడ్‌లో క్రీస్తు పూర్వం ఏడు వేల సంవత్సరాల నుంచీ దొరికిన జనావాసాల ఆనవాళ్ళలో తొలి భారతీయులూ, లేదంటే ఇరాన్‌ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళూ అయి ఉండాలన్న టోనీ జోసెఫ్‌ పరిశోధనలను కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు.

నాలుగు భాగాలుగా విస్తరిల్లిన ఈ గ్రంథంలో మొదటి భాగంలో మానవ పూర్వీక జాతులైన నాలుగైదు రకాల మనలాంటి వారి మూలాలను చూపగా, రెండో భాగంలో వాంగ్మయాధారాలూ, యూరప్‌, భారత్‌లో కనపడే సామ్యాలూ, మూడో భాగంలో ఆఫ్రికన్‌ తల్లిలో వెతుక్కున్న జనన రహస్యాలూ, జన్యుమూలాలూ, తర్వాత అక్కడి నుంచి మానవ ప్రస్థాన విస్తృతిలో భాగంగా భరతభూమిగా పేర్కొనే మన సరిహద్దుల లోపల మెహర్‌గడ్‌, హరప్పా, ద్రవిడ సంస్క ృతి మేళవింపులూ, సరిహద్దు దేశాలతో బాంధవ్యమూ, ఆర్యావర్తమూ, వేదవాంగ్మయమూ, రామాయణ మహాభారతాల వెనుక ఉన్న చారిత్రక వెలుగు జిలుగులూ, మధ్య యూరప్‌ నుంచి చైనా వరకూ ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం వ్యాపించిన స్టెప్స్‌ (ఎందుకో మరి రచయిత ఈ పదాన్ని ‘స్టెప్పీలు’ అన్నారు! నిజానికి వీటిని స్టెప్స్‌ అనడం సరైంది!) అనబడే గడ్డి భూములనుంచి (సరిహద్దుల ఎల్లలు అనే స్ప ృహ ఇప్పుడు ఏర్పరచుకున్నది!) మొదలు పెట్టి, మహాభారత గాధల్లోని ఇతిహాసపు ఆనవాళ్లనూ, ఆర్యావర్తంలో అతి సాధారణమైన పశు బలుల గురించీ, యజ్ఞ యాగాదుల గురించీ, వైదిక ప్రమాణాల గురించీ చాలా విస్తృతమైన వివరణలు ఇస్తూ ‘మన’ మూలాల లోపలికి చొచ్చుకు వెళతారు. ఇందులో ప్రతిదీ ఒక ఆసక్తికరమైన అంశమే. మన మూలాల్లోని ఒకటి రెండు సందర్భాల్ని ఇక్కడ ఉటంకించడం ద్వారా అవి మిమ్మల్ని ఎంతగా అప్రతిభుల్ని చేస్తాయో చూడొచ్చు. భారతీయుల రూపురేఖల్లో జన్యు మిశ్రమం వల్ల ఎంత వైవిధ్యం కనబడుతుందో చెబుతూ, నలుపు నుంచి చామనచాయ వరకూ, యూరోపియన్‌ కవళికల నుంచి చైనీయ కవళికల వరకూ ఇక్కడ జనాల్లో కనిపిస్తాయనీ, ఉత్తర భారత పూర్వీకులకు యురేషియా జనాలతో అంటే- యూరప్‌, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కాకసస్‌ లతో జన్యు సంబంధం ఉందనీ, అదే సమయంలో దక్షిణ భారత పూర్వీకులకు, నేటి భారత ఉపఖండానికి బయట ఉన్న ఏ జనాభాతోనూ జన్యు సంబంధం లేదనీ డేవిడ్‌ రైక్‌ ప్రతిపాదించిన సూత్రీకరణలను ప్రస్తావిస్తారు.

భారతీయుల జన్యు చరిత్ర ఇక్కడి వివిధ కులాల నిచ్చెన మెట్ల అమరికకు తూచినట్టు సరిపోవడం కూడా ఒక ఆశ్చర్యమేననీ, స్థూలంగా చెప్పాలంటే ఉన్నత వర్గాలకూ, నిమ్న వర్గాలకు మధ్య జన్యు వారసత్వంలో కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయనీ ఆధారాలు చూపిస్తారు. జన్యుపరంగా చూస్తే భారతదేశంలో మిశ్రమం కాని జనాలు ఎవరూ లేరనీ, జన్యుపరంగా తాము స్వచ్ఛమైన వాళ్ళమని ఏ ఒక్క కులమూ లేదా వర్గమూ చెప్పుకునే అవకాశం ఏమీ లేదనీ, ఒకే ఊళ్లో పక్క పక్కన ఉంటున్నా సరే, భారతీయ జనాల్లో జన్యు వైవిధ్యం ఉత్తర దక్షిణ యూరప్‌లలో కన్నా రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉందనీ, అసలు భారతదేశం అంటే ‘పెద్ద సంఖ్యలో ఉన్న చిన్న చిన్న గుంపులతో నిండినదే’ అనే డేవిడ్‌ రైక్‌ చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహించాల్సిన అవసరం గురించి చెబుతారు.

ఈ విషయ విస్తతి ఒక మహా సముద్రమైతే, ఈ సమీక్ష ఒక నీటి బొట్టు మాత్రమే! ఈ సమీక్ష ఉద్దేశం బాధ్యతగల ఒక చదువరిగా తన జాతి మూలాలను వెతుక్కునే క్రమంలో సరిహద్దులు లేని ఒక నవీన మానవుడి అవతరణ దిశగా మన ప్రస్థానం కొనసాగుతుందని తెలుసుకోవడమే ప్రధాన విషయం. తెలుగువారికి ఒక గొప్ప పరిశోధక గ్రంధాన్ని అందించిన కల్లూరి భాస్కరం గారికి యావత్తూ తెలుగు ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– వి.విజయకుమార్‌ 85558 02596

➡️