భూటాన్ భూమి మీద కాలు మోపిన క్షణమే
పర్వత రాగం ఏదో పాదాన్ని తాకి
పైకి పాకి గుండెల్ని చుట్టుకుంది
సెలయేటిలో స్నానమాడిన
ఆకాశం పక్షి
కోటి రెక్కలతో వాటేసుకుంది
——————–
అక్కడ అడవులన్నీ ఆరామాలే
కొండలన్నీ విగ్రహాలే
లోయలన్నీ మందిరాలే
అంతటా బోధి వృక్షాల భిక్షు సంచారం
అదంతా బౌద్ధ పర్యావరణం
——————–
భూటాన్ భూతల స్వర్గం
అన్నారంటే నిజమే
బుద్ధుడున్నాడు కదా మరి!
——————–
వీధుల్లో చెత్త లేదు
మనుషుల్లో మురికి లేదు
భూటాన్ని తిరగేస్తే పచ్చదనం
బోర్లేస్తే మనిషి తనం
అది ఆకాశం పెదవి రాల్చిన
కాంతి పూల శాంతివనం!
——————–
జలపాతం ఉయ్యాల మీద కూర్చుని
కొండల్లో రంగులరాట్నం తిరిగాను
కలల్లో కూర్చుని
జీవితంలో తిరిగినట్టు …
——————–
జలపాతాలు
రాత్రిపూట
నక్షత్రాలు ఆడుకునే
జారుడుబండలు
——————-
లోకం పసిపాప కోసం
ఆకాశం మీద కొత్త బొమ్మలు గీయడానికి
కుంచెలుగా మొలిచిన
మునీశ్వరులు ఈ వృక్షాలు
——————–
రోజూ కొండలెక్కి వీళ్ళు
తమ ఉన్ని తువ్వాళ్లతో
ఆకాశాన్ని తుడిచి వస్తారు
దేవతలు దీవిస్తారేమో
ముసలి వాళ్లలో కూడా యవ్వనం
తన ముఖాన్ని చూసుకుంటోంది!
———————
అంత ఎత్తు ఎక్కే కొద్దీ
నా ఎత్తు తగ్గుతూ వచ్చింది
ఆ స్థూపం ముందు నా రూపం
ఆకంత దీపంలా రెపరెపలాడింది
———————-
కొండలు చెక్కి దారులు వేసి
ఏ కష్టజీవి ఏ చెట్టుగా మారిపోయాడో..
ఆకాశం తరచుగా ఇలా
మంచు బొట్లు రాల్చి
వారికి అభిషేకం చేస్తుంది
——————-
ఈ మబ్బులు అదే పనిగా
కొండల తలలు దువ్వుతున్నాయి
జలపాతాల జడలు వేస్తున్నాయి
వృక్షాల వొళ్ళు తుడుస్తున్నాయి
నీటి నీడల బట్టలు విప్పేసి
లోయల కౌగిలింతల్లో
పరవశాల పద్యాలల్లుతున్నాయి
———-
కొండ మనుషులు
చెట్లతో పళ్ళు తోమి
మబ్బులతో మొహం తుడుచి
కొండ ఏటి కింద స్నానాలు చేసి
ఆకాశాన్ని దులిపి కిందపరిచి
దానిమీద
జీవితాలను ఆరబెట్టుకుంటారు
అప్పుడు వారి ఆత్మలు
ఆకాశం ఖాళీ చేసిన
శూన్యంలో ఆడుకుంటాయి
—————
ఇక్కడ ప్రతి వ్యక్తీ
ఒక పర్వతారోహకుడే
కండలు కరిగించి కొండలు ఎక్కితే తప్ప
జీవితానికి ఆకలి తీరదు
ఆకలికి జీవితం దొరకదు
—————
కొండ రైతు
కొండను పెన్సిల్లా చెక్కి
పంట పొలాన్ని
చిత్రపటంలా తీర్చాడు
———-
బుద్ధుణ్ణి ఈ ప్రాంతం
ఎంతగా ప్రేమించిందో..
అందుకే ఆ తథాగతుని బొమ్మను
ఆకాశమంత అద్దంలా మలచుకుంది
———-
ఆ కొండల్లో తిరిగింది కొన్ని రోజులే
తిరిగి వచ్చాక కొండలు
రోజూ నాలో తిరుగుతున్నాయి
నిజమే భూమి గుండ్రంగానే ఉంది!
– ప్రసాదమూర్తి
84998 66699