కర్మభూమిలో జన్మించిన కర్షకుడు..!!

Feb 4,2025 03:23 #edit page, #kavithalu

పుడమికి పచ్చని రంగేస్తున్నాడు
పుట్టెడు ధాన్యం పండిస్తూ
ధాన్యలక్ష్మిని దర్జాగా బండిలో తిప్పుతూ
కాళ్లకు బురదను పారాణిలా సింగారించుకొని…

ధాన్యపు గింజలు ముత్యాల్లా పోసుకుంటూ
గృహలక్ష్మిని బంగారంతో సింగారిస్తూ
చెమట బిందువుల వర్షం పొలములో కురిపిస్తూ
నేల తల్లికి రుణపడి జీవనం సాగిస్తున్నాడు.

రైతు అడుగు పెట్టిన చోటు సస్యశ్యామలం
కూడుకి లోటు లేని అక్షయపాత్ర అతను
విశ్వ జనావళికి మూలపు కలిమి
పిడికెడు మెతుకులతో తృప్తి చెందెను..

కర్మభూమిలో జన్మించిన కర్షకుడు
సమస్త ప్రజలకు అన్నం పెట్టే అన్నదాత
పక్క వాడిని పీక్కు తినే గుణం లేనివాడు
ఈర్ష్యా ద్వేషం తెలియని అమాయకుడతడు..

పొలం చుట్టూ కంచె వేసిన అతను
మనసులో కంచెలు దాటి జీవిస్తున్నాడు
కులమతాలు ఎరుగని సేద్యం
సాయం చేయడం లోనే నిమగమైన జీవితం..

అతని జీవితమంతా సర్కార్‌ ముళ్ల కంచెలు
ఎదగనీయకుండా ఎండగడుతున్నాయి
అన్నపూర్ణ పుత్రుడైనా అవిటివాడుగా తిరిగే
అతనొక వికలుడై బ్రతుకుతున్నాడు నేడు..

అతనికొచ్చే స్వప్నములో పశువుల ఏడుపు
పెద్ద కొడుకు లాంటి ఎద్దుల రోదనలు
ఇంటి ఆవరణములో రాబందుల అరుపులు
తియ్యటి కలలు ఏనాడు పలకరించలేదు..

మట్టి మనిషికి త్రిశంకుని స్వర్గమే
ప్రకృతిలో అతివృష్టి అనావృష్టి పలకరింపులే
కరువు కాటకాలు జోడు గుర్రాల్లా వెంబడిస్తుంటే
అదే మట్టిని అమ్మి తనువుపై చల్లుకుంటున్నాడు..

– కొప్పుల ప్రసాద్‌, నంద్యాల, 9885066235.

➡️