అనుకున్న దేది జరగలేదు
అన్నం ముద్ద ఇంకా దూరంగానే ఉంది
పాల ప్యాకెట్ ఆకాశం నుంచి కిందికి రానంది
‘పింఛను’ పదం చుట్టూ
కమలం ఎన్ని కలల్ని చుడుతుందో!
బడ్జెట్ ప్రవేశించింది
ఆదాయపు పన్ను తగ్గింది
ఆదాయం లేని అర్భకుల సంగతి ఏమిటో?
గాయాల్ని మోసే కాయానికి అరవై వచ్చి
అన్ని భ్రమల నుంచి దూరమై,
వెయ్యి నుంచి ఏటో వెళ్ళిపోతుందనుకున్న బతుకు
ఎక్కడ వేసిన గొంగళి చందాన ఉన్నది!
ప్రతిసారీ అదే నాటకం
నేపధ్యం మారుతోంది
అంకెల రంకెలయ్యాక అచ్చేదిన్ వచ్చేసాక
వాళ్ళు వెళ్ళిపోయారు
మళ్లీ మళ్లీ మోసపోయాక
చిరుగుల తెరతో చరమాంకం ప్రారంభమైంది!
– వీరేశ్వరరావు మూల