బడిపిల్లల కవితలు .. ఒక పఠనానుభవం

Sep 30,2024 05:45 #aksharam, #book, #editpage, #sahityam

బడి వయసులో నేను రాసిన చిట్టి పొట్టి కవితలను బడి పిల్లల కవితల పుస్తకం ‘దేవగన్నేరు’ గుర్తు చేసింది. పుస్తకాన్నయితే తమ్ముడు తగుళ్ల గోపాల్‌కు చెప్పి ప్రేమగా తెప్పించుకున్నాను కానీ దాన్ని అందుకున్న దగ్గర్నుంచి నాలో ‘నా చిన్నప్పటి కవితల’ కోసం ఒకటే ఆరాటం. ఇళ్లంతా వెతికినా కనిపించడం లేదు. ప్రతి మనిషి తన జీవిత ప్రయాణంలో ఎన్నెన్ని చోట్లకో ఇల్లు మారాల్సి వస్తుంది. అలా మారడంలో ఇవి ఎక్కడికెళ్లిపోయాయో తెలియలేదు. సొరుగులన్నీ శోధించి, చివరికి చిరాకొచ్చి కాసేపు బ్రేక్‌ ఇచ్చాను.
మళ్లీ ఒకసారి దేవగన్నేరు పుస్తకం దగ్గరికొచ్చి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాను కదా. ఒక్కో కవితా చదువుతుంటే కళ్లలో తడి. నా బాల్యం నా కళ్ల ముందుకొచ్చి దర్జాగా నిలబడింది.
”ఏంటో చెప్పు?” అన్నట్టుగా చూసి నవ్వింది.
నేనూ నవ్వాను. నేనూ, బాల్యం, పుస్తకం … ముగ్గురం కలిసి పేజీ పేజీ ప్రయాణం చేశాము.
చిన్నప్పుడు నా కవితా వస్తువులు అమ్మ, రైతు, బడి, ప్రకృతి, ఇల్లు … అంతే! ఆ వయసులో పిల్లలు అవిగాక ఏం రాస్తారు? అది కూడా వాళ్లను స్వేచ్ఛగా తిరగనిస్తే, ప్రశాంతంగా పరిశీలన చేయనిస్తే. హాయిగా కూర్చుని రాయనిస్తే! నాలుగు గోడల మధ్య బంధించి ముఖమ్మీదికి పుస్తకాలు, సెల్‌ ఫోన్లు, ట్యాబులూ విసిరిస్తే ఆ మాత్రం ఆలోచన కూడా ఉండదు కదా.
తగుళ్ల గోపాల్‌ ప్రకృతి ఆరాధకుడు అనుకుంటాను. అతనికి దేన్నయినా స్వేచ్ఛగా వదిలేయడం తెలుసు. మట్టిలో కూడా అతను విత్తనాన్ని, కవిత్వాన్ని బలవంతంగా నాటడు. వాటినలా స్వేచ్ఛగా విసిరేస్తాడు. విసిరేసి అవి వృక్షంగా మారే రహస్యాన్ని శాంతంగా కూర్చుని పరిశీలిస్తాడు. అలా వదిలేసిన, విసిరేసిన పిల్లల మెదళ్ల నుంచి పుట్టిన సహజసిద్ధ కవితల పుస్తకం ఇది అని నాకు అర్థమైంది.
కొందరు పెద్దలు కవిత్వాన్ని తామే రాసి పిల్లల పేర్లు పెట్టి అబ్బురంగా చెబుతుంటారు. వాటిల్లో బాల్యం ఉండదు సరి కదా… అతి తెలివి ముందుకొచ్చి వెక్కిరిస్తుంది. బాల్యమంటే నిజాయితీ కదా. నిజాయితే కవిత్వం కదా. అది లేని పుస్తకం ఎందుకు? వృథా. ఈ పుస్తకం రాసిన పిల్లల్లో అందరూ నాలుగు నుంచి ఏడవ తరగతి మధ్య చదువుతున్నవాళ్లే. వీళ్ల నిజాయితీ పుస్తకం నిండా పరుచుకుని, దాపరికం లేని స్వచ్చత మనల్ని కమ్మేస్తుంది.
1
”మా అమ్మ కన్ను బంగారం మీద
మా నాన్న కన్ను సినిమాల మీద
నా చెల్లి కన్ను ఆటల మీద
నా కన్ను చదువుల మీద”
2
”నాన్నా ఒక పుస్తకం కొనియ్యవా.. అన్నాను
డబ్బులు లేవని కసురుకుండు
సాయంత్రం చూస్తే మందు దుకాణంలో”
3
”నాన్న అమ్మను కొట్టినప్పుడు
ఆమె ఏడుస్తుంది
ఒక కన్నీటి చుక్క
నేల రాలుతుంది
ఇలా ప్రతి ఇంట్లో
ఎన్ని కన్నీటి చుక్కలు రాలుతున్నవో”
మనమంతా చిన్నప్పుడు ఎలాంటి బేషజాలు లేకుండా అమాయకంగా ఈ తలకిందుల సమాజాన్ని నిలబెట్టి ప్రశ్నలు వేస్తుంటామే.. అది కూడా కవిత్వమే కదా! అసలు కవిత్వ స్వరూపమే ప్రశ్న కదా. మరి ప్రశ్న మరిచిన కవిత్వం, కవుల గురించి కూడా ఈ బాల కవితల పుస్తకం ఎరుక చేస్తుంది.
4
”అమ్మ ఆడపిల్లను కంటే నాన్న కొడతాడు
మరి నాన్నకు దెబ్బ తగిలితే
‘అమ్మా’ అని ఎందుకు అంటాడో?”,
5
”మనసు లేని అద్దంతో
మాటిమాటికి మాట్లాడతాం కానీ
మనసున్న అమ్మతో
అరక్షణం కూడా ఎందుకు మాట్లాడం?”
6
”చీకట్లో వెళ్తుంటే
వెలుగులా ముందుకొచ్చాడు నాన్న
అందరూ దేవుణ్ని పూజిస్తారు కానీ
నాన్నను పూజించరు ఎందుకో?”
7
”ప్రపంచాన్ని
గుడ్డివాళ్లు చూడలేకపోతే
ఆ ప్రపంచమే
గుడ్డివాళ్లను చూడాలి కదా?”
ఈ ప్రశ్నల్లో మనుషుల్లోని ద్వంద్వ వైఖరిపై నిలదీత లేదా? బాల్యం అంటే పరిశీలన కూడా. కాకి, గద్ద, పిల్లి, పాము, కుక్క, పొలం, గింజ అన్నీ పిల్లలకు అబ్బురాలే. అందుకే మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అన్నీ తమ కోసమే అని సంతోషిస్తారు పిల్లలు అన్నాడు శ్రీశ్రీ.
8
”చెట్టు
తాతయ్య చేతిలో ఊతకర్ర
అమ్మ చేతిలో వంటకర్ర
నాన్న చేతిలో గొడ్డలి
పాప చేతిలో చెక్క బొమ్మ”,
9
”అన్నం పడెయ్యడానికి నిమిషం చాలు
పండించడానికి ఆరునెల్లు కావాలి”,
10
”రొట్టె మీద
అమ్మ నీళ్లు చిలకరిస్తుంటే
ఆమె చేతిలో నుంచి
వాన కురిసినట్టు ఉంటుంది”,
11
”కృష్ణుడి మురళీగానం గొప్పదే కానీ
ఆ మురళీని చేసిన వేళ్లు ఇంకా గొప్పవి”,
12
”బంతి పువ్వును చూస్తుంటే
అమ్మా నాన్న
నా గుండెలో పూసినట్టు ఉంటుంది”,
13
”తెల్లవారగానే సూర్యుడు ఉదయిస్తాడు
ఊరు మొత్తం వెలుగుతో నిండుతుంది
అయితే ఆ వెలుగులో
మా అమ్మ ఇంకా మెరుస్తుంది”
బాల్యమంటే సహానుభూతి కూడా. కులమతాలు, అంతస్తుల తేడా లేకుండా అందర్నీ అక్కున చేర్చుకోవడం పిల్లల దగ్గరి నుంచి కాకుండా ఎవరి దగ్గరి నుంచి నేర్చుకోగలం?
14
”మేము చిన్న చేపలం
ఖాసీం తాత పెద్ద చాప
ఆ చేప మాకు రోజూ మధ్యాహ్నం
అన్నం పెడుతుంది”,
15
”నల్లగా ఉంటారని వెక్కిరించకూడదు
మనం అక్షరాలు రాసేది కూడా
నల్లటి బోర్డు మీదే కదా”,
16
”రోడ్డు మీద పిల్లలు ఆడుతున్నప్పుడు
మా అన్న ఆడలేకపోతున్నాడని
బాధ పడ్తాను
ఇంట్లో గిన్నెల చప్పుడైతే
నడవడం రాక
ఎక్కడ పడ్డాడో అని గిలగిల్లాడతాను”,
17
”మానాన్న మోటార్లు కడుతూ
రైతుల కన్నీరు తుడుస్తాడు”
… ఇలా పుస్తకం తిరగేసేకొద్దీ నాకు నా బాల్య కవితలు మళ్లీ మళ్లీ గుర్తురావడం మొదలుపెట్టాయి. ఇక కుదర్దని లేచి వెళ్లి ఈసారి కాస్త ఎక్కువ సేపు, ఇంకాస్త ఎక్కువ శ్రద్ధతో వెతికాను. వెతగ్గా వెతగ్గా రాత్రి పదకొండు గంటల సమయంలో కంప్యూటర్‌ టేబుల్‌కి ఉన్న రెండో డెస్కులోనే భద్రంగా చెదలు పట్టకుండా ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిపెట్టిన పాతనోటు బుక్కు ఒకటి కనబడింది. ఈ నోటుబుక్కులోనే నేను నా కవితలను జాగ్రత్తగా అతికించి దాచుకున్నాను. ఆ బుక్కు తెరిచి చూద్దును కదా.. దేవగన్నేరు పూలు గలగలా రాలాయి. అన్నీ ఒకసారి చదువుకున్నాను. ఎప్పుడో 1999లో అనుకుంటాను.. నేను రాసిన ‘పంజరానికి విన్నపం’ అనే ఈ బాల కవితను మాత్రం మళ్లీమళ్లీ చదువుకుని స్వేచ్ఛను కళ్లలోకి నింపుకున్నాను.
”ఓ పంజరమా
అన్యాయాన్ని బంధించు
అక్రమాన్ని బంధించు
అధర్మాన్ని బంధించు
దుర్మార్గాన్ని బంధించు
అవినీతిని బంధించు
మోసాన్ని బంధించు
అంతేకానీ అవేవీ తెలీని
నోరు లేని పక్షిని మాత్రం బంధించకు”
బాల్య స్మృతులను తడుముకోవడం అయ్యాక మళ్లీ దేవగన్నేరు దగ్గరికొచ్చాను. అందులో ముందుమాటలో తగుళ్ల గోపాల్‌ ఇలా అన్నాడు : ”ఓ ఇరవై ఏళ్ల తర్వాత ఈ పుస్తకంలో కవితలు రాసిన పిల్లలు వచ్చి మా సార్‌ మాతోని కవిత్వం రాయించిండు. దేవగన్నేరులో నా కవిత ఉందని మురిసిపోతారు. వాళ్ల కడుపున పుట్టినోళ్లకు కూడా చూపించుకుంటారు. ఇంతకన్నా నాకేం కావాలి..?”
అదే మాట నేనూ అంటున్నాను. ఇదే పిల్లలు ఇదే ఇరవై ఏళ్ల తర్వాత వచ్చి చిన్నప్పుడు మేము రాసిన కవిత్వం మీద షరీఫ్‌ సారూ ఒక పరామర్శ రాశారు అని అనరా? అలా అంటే అంతకన్నా ఇంకేం కావాలి? కానీ నేను పరామర్శ రాయలేదే.. పఠనం ఒక అనుభవం కాబట్టి నా అనుభవాన్ని పంచుకున్నానంతే. సారీ పిల్లలూ!

(ధర 150, పేజీలు 100, సంప్రదించాల్సిన ఫోన్‌ : 83098 37260)

– వేంపల్లి షరీఫ్‌

➡️