‘మాతృత్వం ఒక అందమైన వరం’, ‘అమ్మంటే దేవుడితో సమానం’ … ఇలా తల్లి గురించి, మాతృత్వం గురించి జీవితంలో ఒకసారైనా రాయని రచయితలు, కవులు లేరు, మాట్లాడని వారూ లేరు. అమ్మతనం అనే మధురమైన భావన వెనుక ఎన్నో కోణాలుంటాయి. ఎంత తల్లైనా ఆమెకూ కొన్ని పరిమితులు, ఆలోచనలు ఉంటాయి. అలాగే ఆమె పిల్లల పట్ల కోపంగానో, మరో విధంగానో ప్రవర్తిస్తే ‘ఆమె అసలు తల్లేనా?’ అంటూ రకరకాలుగా మాట్లాడేవాళ్ళూ ఉంటారు. అమ్మ కావడం ఆడదాని జీవితంలో ఒక భాగమై పోతుంది. పెళ్ళైన స్త్రీ అమ్మ కాలేకపోతే సమాజం బతకనివ్వదు, గొడ్రాలంటూ దుయ్యపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చర్చించవచ్చు. తల్లులకూ భావోద్వేగాలుంటాయి. తమదైన కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. అమ్మలకూ జీవితముంటుంది కానీ అమ్మతనం కొన్ని చట్రాల్లో బంధింపబడుతుంది. అమ్మంటే ఒక నిర్వచనం ఉంటుంది. అమ్మ ఇలాగే ఉండాలి కానీ మరోలా ఉండకూడదనే పరిమితులను సమాజం బలవంతంగా రుద్దుతుంది.
భండారు విజయ మాతృత్వం అనే సబ్జెక్ట్‌పై ఎంతో మందితో చర్చించి, ‘మాతృత్వం : భిన్న వ్యక్తీకరణలు’ అనే విషయంపై 53 కథలతో ఒక సంకలనం తీసుకొచ్చారు. ఆ పుస్తకానికి ‘యోధ’ అని నామకరణం చేసి హైదరాబాద్‌లో ఆవిష్కరణ సభ చేశారు. ఈ సంకలనంలోని ప్రతి కథా అమ్మ చుట్టూ, అమ్మతనం చుట్టూ తిరుగుతుంటాయి. రత్నసుమతి గారి ‘తిరిగి రాని వసంతం’ కథలో … భర్త పెట్టే బాధలు భరించలేక అతడి నుంచి విడిపోయిన కవిత, ఇద్దరు పిల్లలను పెంచడంలో అలసిపోతుంటుంది. ఆ ఒత్తిడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటుంది. స్నేహితురాలి సలహాతో మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఉన్నా అమ్మతనం వల్ల, పిల్లల పట్ల ఉన్న ప్రేమ బాధ్యతల వల్ల ముందుకు అడుగు వేయలేకపోతుంది. చిన్న కథలో చెప్పాల్సిన విషయాన్ని చక్కగా చెప్పారు రచయిత్రి. కె.వరలక్ష్మి ‘శత్రువు’ కథలో ఒక తల్లి కోడలు తనను ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఒక రకంగా మానసికంగా హింసిస్తున్నా కొడుకుపై ప్రేమను చంపుకోలేక అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కథ చివరలో ‘నాకేం భయం? నేను ఆడపిల్లల తల్లిని’ అని కోడలు అనుకోవడం చదవగానే ఒళ్ళు ఝల్లుమంటుంది. ఎండపల్లి భారతి ‘తలపండిన గొడ్రాలు’లో పిల్లలు పుట్టని ఒక స్త్రీని అందరూ గొడ్రాలు అంటూ ఎలా నోటికి వచ్చినట్టు మాట్లాడతారో తనదైన శైలిలో కథగా చెబుతారు. ఎవరైనా బయటకు వెడుతుంటే ‘గొడ్డుది ఎదురైంది’ అంటూ చులకన చేస్తారు అని కథలోని పాత్ర వాపోతుంది. గిరిజ పైడిమర్రి … బిడ్డల పెంపకంలో తల్లి మాత్రమే కాదు; తండ్రి కూడా బాధ్యత వహించాలని ‘ఫాదర్ హుడ్’ కథలో చెబుతారు. పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్న స్త్రీలు సంసారం, పిల్లల బాధ్యత అనే చట్రంలో ఇరుక్కుని దానికే పరిమతమై, బయటపడాలన్నా పడలేక, తమ వంతు బాధ్యతగా ఏదైనా చెయ్యాలన్నా చెయ్యలేక కనబడని ఉక్కుకౌగిలిలో ఎలా నలిగిపోతారో చెప్పే కథ పద్మకుమారి ‘పొద్దు వాలని మనుషులు’. సులోచన, ప్రమీల చిన్నప్పటి నుంచీ స్నేహితులు. ప్రమీల పోరాటబాట పట్టి ముందుకు వెడితే, సులోచన పెళ్ళి చేసుకుని ప్రమీలను అనుసరించాలన్నా అనుసరించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. చివరకు స్నేహితురాలికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి తన దగ్గరకు బయలుదేరుతుంది. కథ మొత్తం చక్కగా నడిపించారు రచయిత్రి. కల్పన రెంటాల ‘నో రిగ్రెట్స్’ కథ ఇప్పటి సమాజంలోని యువత మనస్తత్వాలను అద్దం పడుతుంది. పిల్లలు వద్దనుకున్న శ్రీజను తల్లిదండ్రులు, అత్తమామలు వత్తిడి చేస్తారు. దానికి ఆమె చెప్పిన సమాధానం ‘వీశ్‌ీష్ట్రవతీష్ట్రశీశీస ఱర అశ్‌ీ ఎy షబజూ శీట ్‌వa. భర్త కూడా ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తాడు. పెళ్ళై కొన్నాళ్ళు కాగానే వారిపై పిల్లలను కనడం గురించి ప్రశ్నల వర్షం కురవడం మొదలవుతుంది. ముందు ఇంట్లో వాళ్ళే అడగడం మొదలుపెడతారు. ఇది నిత్యం మన చుట్టూ జరిగే తంతు. ఇక నల్లూరి రుక్మిణి ‘అజమాయిషీ’ కథలోకి వెడితే ఆశ్చర్యమనిపిస్తుంది. అమ్మలు ఇలా కూడా ఉంటారా? అని ఆలోచించి మనకు మింగుడుపడదు. తల్లి అంటే ఇలాగే ఉండాలని మన బుర్రలలో ఎన్నో ఏళ్ళుగా ఒక విషయం నాటుకుపోయి ఉంటుంది. ఈ కథలో తల్లి పుట్టింటి సంబంధం కోసం చదువు మానిపించి మరీ పెళ్ళి చేస్తుంది. పెళ్ళైన కొన్నేళ్ళకే కూతురి భర్త చనిపోతే ఇంకా ముప్పైల వయసులో ఉన్న కూతురిపై ఆజమాయిషీ చేస్తుంది కానీ ఆమెకు మళ్ళీ పెళ్ళి చేద్దామని ఆలోచించదు సరి కదా, కనీసం కూతురి మనసులో ఏముందో తెలుసుకోవడానికి సైతం ప్రయత్నించదు.
ఇలా ఈ 53 కథల్లో మనకు తల్లులు రకరకాల రంగులలో కనబడతారు. శారీరక శ్రమ చేసే తల్లులు, మనసును జోకొట్టుకుంటూ ముందుకు సాగే తల్లులు … ఇలా పలు రకాల అమ్మలను మనం చూస్తాం అయితే తల్లులను, మదర్ హుడ్‌ను గ్లోరిఫై చెయ్యకుండా వారి జీవితాల్లోని సమస్త వెలుగు చీకట్లను ఈ కథల ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి విజయ ఎత్తుకున్న బాధ్యతే ఈ ‘యోధ’. ‘యోధ’ను చదవాలనుకుంటే 88019 10908 నంబరులో సంప్రదించండి.
– పద్మావతి రాంభక్త
99663 07777