యునెస్కో గుర్తింపు కల వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సంస్థ ఏటా నిర్వహించే వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయెట్స్ ప్రతిష్టాత్మక సదస్సు ఈ నవంబర్ 20 – 25 తేదీల మధ్య తమిళనాడులోని మదురైలో జరిగింది. రిథం ఆఫ్ హార్మోనీ అనేది ఈ ఏడాది సదస్సు కాన్సెప్టు. జ్యోతి ప్రజ్వలన చేసి 43వ ప్రపంచ కవుల సదస్సును ప్రారంభించారు. ముఖ్య అతిథి కుంద్రకూడి పొన్నంబాల అడిగలర్, ప్రత్యేక అతిథిగా హాజరైన విద్యావేత్త, 2019 భువనేశ్వర్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆచార్య అచ్యుత సమంతకు జీవన సాఫల్య పురస్కారం, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. మెక్సికన్ కవయిత్రికి ప్రత్యేక గుర్తింపు అవార్డు, మెడల్ బహుకరించారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్యత ప్రతిబింబించే కళారూపాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సదస్సు కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా డాక్టర్ పెరుగు రామకృష్ణ హాజరయ్యారు. వరల్డ్ తమిళ సంగం వేదికపై ప్రారంభ వేడుకలో విశ్వ అతిధుల సరసన పాల్గొన్నారు.
స్పానిష్, ఆంగ్లం మిశ్రమంగా జరిగిన తొలి కవితా సదస్సులో డా.రామకృష్ణ తన తెలుగు కవితను వినిపించారు. నేపథ్య అంశం మీద ఆంగ్ల కవితాగానం చేశారు. ఆంగ్ల కవిసమ్మేళనం, తమిళ కవి సమ్మేళనం సమాంతరంగా జరిగాయి. కవులందరూ సమకాలీన ప్రపంచ స్థితిగతులను ప్రస్తావించారు. యుద్ధ వ్యతిరేక కవితలు వినిపించారు. పర్యావరణ పరిరక్షణ, విశ్వ సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కవులు విశ్వ సాహిత్యానికి చేస్తున్న కృషిని గుర్తించి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయెట్స్ అధ్యక్షులు, సుప్రసిద్ధ మెక్సికన్ కవయిత్రి మారియా యుజీనియా సొబెరిన్స్, ప్రధాన కార్యదర్శి మెక్సికన్ రచయిత్రి పాట్రీసియా గర్జా, ఇండియా సదస్సు అధ్యక్షులు డాక్టర్ సేతు కుమనన్ అందరికీ జ్ఞాపిక, ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. ఇజ్రాయిల్, మెక్సికో, హంగేరి, జపాన్, ఈక్వాడర్, దక్షిణ ఆఫ్రికా, అమెరికా, రొమేనియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి, వివిధ భారతీయ భాషల నుంచి కవులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రిథం ఆఫ్ హార్మోని పేర బృహత్ విశ్వ కవితా సంకలనం వెలువరించారు. అనంతరం రామేశ్వరం, అబ్దుల్ కలాం స్మారక మందిరం, ధనుష్కోడిలలో ప్రకృతిలో పలు కవిత పఠనాలు చేయించారు. తమిళ కవి రవి సుబ్రహ్మణ్యన్ మంచి గీతాలను గానం చేసి అలరించారు. అన్ని దేశాల కవులు తమ మాతృభాషలను కవిత్వంలో పరిచయం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆంగ్ల కవితల పోటీలో సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల కవి గోపాల్ లాహిరి మొదటి బహుమతి 250 అమెరికన్ డాలర్లు గెలుచుకున్నారు. కారైకుడి సేతు భాస్కర అగ్రి కాలేజ్ రిసెర్చ్ ఫౌండేషన్ ప్రాంగణంలో ‘పోయెట్స్ ఫారెస్ట్’ పేర విచ్చేసిన కవులందరూ మొక్కలు నాటారు. మొక్కల పక్కన కవి పేరు, దేశం శాశ్వత ఫలకంగా చిత్రించడం కవులకు గొప్ప ఆనందం కలిగించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 21-25 తేదీల్లో మెక్సికోలో 44వ కాంగ్రెస్ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
– డాక్టర్ పెరుగు రామకృష్ణ
WAAC జీవిత సభ్యులు,
98492 30443