సమకాలీన తెలుగు కథ – సామాజికత

Mar 17,2025 05:20 #book review, #Literature

కథ, కథానిక పదాలను పర్యాయ పదాలుగా వాడుతున్నాం. సమగ్రమైన కథానిక లక్షణాలను పుణికిపుచ్చుకున్న కథానిక దిద్దుబాటు. గురజాడ 1910లో ఈ కథను రాశారు. ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలను కళాత్మకంగా చిత్రీకరించేది కథానికవుతుంది. క్లుప్తత, గాఢత ప్రధానంగా ఉంటాయి. సమాజంలోని వ్యక్తులను సరిదిద్దే ప్రయత్నంతోనే కథానిక అడుగులు మొదలయ్యాయి. ఆధునిక కాలంలో కథలు సామాజిక సంఘటనలను, మార్పులను పరిణామాలను, మన జీవితాల్లో క్రమంగా వచ్చే చర్యను మన ముందు ఉంచుతుంది. ఒక సమాజానికి కథలు కీలకమైన సాక్ష్యంగా నిలుస్తాయి. సామాజిక పరిణామాలను ప్రతిఫలనాలను సాహిత్యం రికార్డు చేస్తుంది. సమాజంలో వివిధ కోణాలను కథలు చర్చిస్తాయి.
2024లో వచ్చిన కథలను చదవడం ద్వారా 2034లో 2024 నాటి సామాజిక చలనాలను, సందర్భాలను, ఉద్వేగాలను తెలుసుకోగలం. అందువల్ల కథల్లో కాలం కనబడాలి. కాలాన్ని నమోదు చేసి చరిత్రకు పరికరంగా ఇవ్వాలి. వాస్తవ ప్రపంచాన్ని, అందులోని నిజానిజాలను చెప్పాలి. వర్తమాన తెలుగు కథ ఆ పనిని సమర్థవంతంగానే చేస్తుంది.
వర్తమాన తెలుగు కథలో సామాజికతను పరిశీలిస్తే అన్నం పెట్టే రైతు బాధలు, స్త్రీల కన్నీళ్లు, మానవ సంబంధాల్లో ఖాళీల మధ్య మొలుస్తున్న మైలురాళ్లు, గ్రామీణ విధ్వంసం, ప్రాంతీయ అసమానతలు, అణచివేతలు, అధికార దర్పాలు; ఫాసిస్టు రాజకీయాలు … ఇవన్నీ తెలుగు కథలో ఉన్నాయి. అట్లాగే ఈ దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని సంగతి, ప్రపంచ అతిపెద్ద విపత్తు కరోనా కష్టకాలం వీటన్నింటినీ వర్తమాన తెలుగు కథ గమనించింది. ఆయా సమస్యలను పాఠకుల ముందు ఉంచింది.
కరోనా సమయంలో దేశంలో ఒక్కసారిగా ఊర్లు కంచెలు వేసుకున్నాయి. వేలాది మంది వలస కార్మికులు కాలినడకన వేల మైళ్ళు దూరం నడవాల్సి వచ్చింది. ఇట్లాంటి సందర్భం ఒకటి వస్తుందని మానవాళి ఊహించి ఉండదు. సైకిల్‌ మీద, రైల్వే ట్రాక్ల మీద ఊళ్లకు ఊళ్లు దాటారు. ఆకలిని, దాహాన్ని, భౌతిక దూరాన్ని భరించాల్సి వచ్చింది. ప్రతి మనిషి ఎదుటి వ్యక్తికి శత్రువు గానే కనిపించే కాలం. ఇట్లాంటి కాలంలోనూ కొంతమంది రోడ్లపై వాళ్లకు నీళ్లు ఇచ్చారు. ఒక ముద్ద అన్నం పెట్టారు. అదేపల్లి ప్రభు ‘ఊరికే పోవాలి’ కథలో ఆ కాలాన్ని చూపారు. ధర్మరాజు వెంట శునకం వలె మన వెనుక మరణము విడవకుండా వస్తున్నది అనే మాటతో కథ ప్రారంభం అవుతుంది. అఫ్సర్‌ రాసిన ‘చూపుడువేలు’ కథ మర్కజ్‌ వార్తల నేపథ్యంలో ఈ విపత్తుకు కారణం ఒక మతం అంటూ ఆ మతం వైపు చూపిన చూపుడు వేళ్ళను ప్రశ్నించింది. పాపినేని శివశంకర్‌ రచించిన ‘గబ్బిలం’ కథ ఒంటరితనంలోని జీవన భీతిని చిత్రీకరించింది. మహమ్మద్‌ ఖదీర్‌ బాబు ‘వాసన’ కథ కరోనా నేపథ్యంలోంచి వచ్చిన కథ.
2019లో శ్రీ రమణ రచించిన ‘నాలుగో ఎకరం’ కథ ‘దుక్కిటెద్దు కలలోకి రావడంతో…’ అనే వాక్యంతో మొదలవుతుంది. మన పునాదులు ఏంటో పొలానికి ఉన్న ప్రాణం పోసే లక్షణాన్ని తీసేసి అదొక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సరుగ్గా మారడం, ఆ తర్వాత పరిణామాలు గురించి రాసిన కథ. ఈ కథలో ఇప్పటి యువతరానికి వ్యవసాయం గురించి ఏమీ తెలియని అనేక విషయాలు చర్చకు వస్తాయి. రచయిత వాడిన పదజాలం మూలాలను గుర్తు చేస్తుంది. అంతర్లీనంగా భూమి రాజకీయం రావడం వ్యాపారం కావడం గురించి ఈ కథలో గుర్తించదగిన అంశం. 2019లో అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ రాజధాని విషయంలో యూటర్న్‌ తీసుకుంది. అంతకు ముందున్న నాయకుడు ఒక ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాడు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాక అక్కడ ఉన్న మానవ సమూహాల్లో, ఆ మానవ సంబంధాల్లో అనుబంధాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఎప్పుడూ దగ్గర కాని వాళ్ళు దగ్గరయ్యారు, దగ్గరగా ఉన్నవాళ్లు దూరం అయ్యారు. మరో నాయకుడు వచ్చాడు.. రాజధాని మూడు చోట్ల ఉంటుందన్నాడు. మళ్లీ చకచక మార్పులు ప్రారంభమయ్యాయి. రాజధాని ప్రాంతం ఎదుర్కొన్న ఆ పరిస్థితిని అత్యంత సమర్థవంతంగా ఎంవి రామి రెడ్డి ‘త్రిశంకు నగరం’ కథలో చెప్పారు. పాపినేని శివశంకర్‌ ఈ నేపథ్యంలోనే ‘కొండచిలువ’ కథ రాశారు.
అట్టాడ అప్పలనాయుడు రాసిన ‘చిటికెన వేలు’ కథ విప్లవోద్యమ నేపథ్యంతో ఉంటుంది. అభివృద్ధి పేరు మీద వ్యాపారం, రాజకీయం ఆసరాతో అడవిలోకి ఎలా ప్రవేశిస్తుందో అడవి, అడవి బిడ్డల ఉనికి ఎలా ప్రశ్నార్ధకమవుతుందో చెప్తూ … అక్కడే ఉద్యమం నడిపిన ఒక తరం ఎట్లా స్పందిస్తుందో ఈ కథ చెబుతుంది. ముగింపులో గిరిజన నాయకుడు చిటికెన వేలు కోసి, అధికారి టేబుల్‌ మీద పెట్టడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం అవుతుంది. రచయిత చిటికెన వేలును ప్రతీకగా వాడుకున్నారు. ఈ రచయితే రాసిన మరో కథ ‘శ్రేయోభిలాషి’. శత్రువు శ్రేయోభిలాషులను పోల్చుకోలేని సంక్లిష్ట సామాజిక సందర్భంలో ప్రజల్ని ఎవరు నడిపిస్తున్నారు? మార్కెట్‌ నడిపిస్తుందా? సంస్క ృతి నడిపిస్తుందా? రాజకీయాలా? ఇవన్నీ కలిపిన మిశ్రమమా? అంటూ శ్రేయోభిలాషి రూపంలోని శత్రువును చూపడానికి ఈ కథ రాసినట్టుగా అప్పలనాయుడు పేర్కొన్నారు. జి.వెంకటకష్ణ రచించిన ‘వేదవతి’ కథలో కర్ణాటకలో పుట్టి రాయలసీమలో ప్రవేశించి తుంగభద్రలో కలిసే వేదవతిని నిలుపుకోగలిగితే సీమకు నీళ్లు అందుతాయని చెప్తూ, ఫ్లాష్‌ బ్యాక్‌లో జరిగిన ఒక ప్రేమ కథను అందులో దాగి ఉన్న మత, కుల వైషమ్యాలను చర్చిస్తాడు. వేదవతి రాయలసీమలోకి వస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో పాఠకులకే వదిలేస్తాడు. కార్పొరేట్‌ కళాశాలలు కేవలం ర్యాంకులను పండించే కార్ఖానాలుగా మారిపోయాయి. డబ్బు సంపాదనే విద్యా లక్ష్యం అనే మార్గంలో అక్కడ విద్యార్థులు తర్ఫీదు చేయబడుతున్నారు. దీనిని నిరసిస్తూ ఎం.వి.రామిరెడ్డి రాసిన కథ ‘కంకాళశాల’. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో రచయితలో కలిగిన ఒక కుదుపుకి ఈ కథ నిదర్శనం. అత్యంత విషాదకరమైన ఈ స్థితిని వ్యంగ్యంతో కథకుడు సమర్థంగా నడిపాడు.
నగర జీవితాన్ని ఆవిష్కరించిన కథలు ఈ మధ్యకాలంలో దేశరాజు విస్తృతంగా రాశారు. ఆయన ‘షేమ్‌ షేమ్‌’ పేరుతో రాసిన కథా సంపుటిలో ఇవి కనిపిస్తాయి. ‘షేమ్‌ షేమ్‌ పప్పీ సేమ్‌’ కథ ఒక దిగ్భ్రాంతికరమైన ముగింపుతో ముగుస్తుంది. విద్యాలయాల్లో ఆడపిల్లలకు మరుగుదొడ్లు సరిగ్గా లేని దుస్థితి గురించి చెప్తూనే అందులో ఒక యువతి తన వయసున్న యువతులంతా సామూహికంగా ఒక పెద్ద ఉద్యమంగా నగరంలో ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో తమ నిరసనని తిరుగులేని విధంగా తెలుపుతారు. అందుకు వారు మగవారి వలె గోడల మీద ఒకటికి వెళ్లడం కథలోని ఈ ముగింపు ఒక ఊహించని పరిణామం. కుప్పిలి పద్మ రచించిన ‘మెట్రో కావాలా’ కథలో వలస వెళ్లిన మంగా రమేష్‌ లాంటి గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వలస వెళ్లినప్పుడు ఎదురయ్యే పరిస్థితులను సరికొత్తగా ఆవిష్కరించారు. స్త్రీలు ఎంతటి పోరాట పటిమ కలిగినవారో, వాళ్లు అనుకుంటే ఎంతటి కష్టతరమైన పనైనా చేయగలరని నిరూపించే రెండు కథలు ఈ కాలంలో వచ్చాయి. అవి కత్తి పద్మ ‘పులస’, ముని సురేష్‌ పిళ్లై ‘గేణమ్మ’ కథలు. భూమి మీద హక్కు ఆడవాళ్ళకి కూడా ఉండాలి అనే బలమైన లక్ష్యంతో ఒక మహిళ చేసిన వీరోచిత పోరాటం పులస. ఉత్తరాంధ్ర మాండలికంలో సాగిన ఈ కథ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. ‘గేణమ్మ’ కథలో ఆమె భర్త తాగుబోతు. వచ్చిన పెన్షన్‌ మొత్తాన్ని గ్లాసులో కలుపుకొని తాగేస్తాడు. ఆమె ఇంటిని ఈదాలి. అయితే ఇద్దరూ ముసలివాళ్లే. తనకి కూడా పెన్షన్‌ కావాలని సర్పంచిని కలుస్తుంది. ఒక రేషన్‌ కార్డుకి ఒకటే పెన్షన్‌ అని సర్పంచ్‌ చెబుతాడు. మంత్రిని కూడా కలుస్తుంది. ఆయన కూడా బిర్యాని తినేసి పొమ్మని, కావాలంటే ఆరోగ్యశ్రీ ఇద్దరికి ఇస్తామని, పెన్షన్‌ అలా కుదరదని చెప్తాడు. విలవిలలాడిపోయిన గేణమ్మ ఒక వకీలు సహాయంతో యెట్లా గట్టు ఎక్కిందో చెప్పడం ఇందులోని కథ. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల అమలులో తీసుకునే నిర్ణయాలు బడుగు బలహీన వర్గాల జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేస్తాయో ఈ కథలో రచయిత చర్చించాడు.
పలమనేరు బాలాజీ రచించిన ‘ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు…’ కథ సంపుటిలోని కథలన్నీ ఆమె చుట్టూ తిరుగుతాయి. ఇంటి చాకిరీలో ఉండే మూలాలను, శ్రమ జీవితం తాలూకు కనిపించని కోణాలను చిత్రీకరించాడు. ఇటీవల ఈ రచయితే వెలువరించిన ‘ఏకలవ్య కాలనీ ఎరుకల గాధలు’ ఎరుకల వారి జీవితాలను మన ముందుకి తెచ్చాడు. తెలంగాణ ప్రాంతం నుంచి రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ ‘ఢావ్లో’ కథాసంపుటిలో లంబాడి వారి జీవితాన్ని చిత్రించాడు. కొట్టం రామకృష్ణారెడ్డి రచించిన తాతిల్‌, ఇగురం గల్లోడు, చల్లని మొహం లాంటి కథల్లో మానవ సంబంధాల గురించి ఆరాటం కనిపిస్తుంది. స్ఫూర్తి కంది వనం ‘ముసురు’ కథ కల్లుగీత కార్మికుల తరాల మధ్య వ్యధని చెప్తుంది. పి.చిన్నయ్య ‘ముత్తమ్మ మరియమ్మ సమాధి’ క్రైస్తవ మతంలో కూడా తక్కువ కులస్తులకు జరిగే అవమానాల గురించి చెప్పిన కథ. దేశరాజు రచించిన ‘ఆలీబాబా అనేక దొంగలు’ కథలో దేశంలో మత విద్వేషాలను అధికారంలో ఉన్న నాయకత్వాలు పురిగొల్పడాన్ని గుర్తించాలని అంటాడు. ఆలీబాబా ఎవరో మనల్ని కనుక్కోమని ఒక పజిల్‌ మనం ముందు ఉంచుతాడు. అలాగే వేంపల్లి షరీఫ్‌ చారల పిల్లి, సైకిల్‌ చక్రాలు, బాబయ్య స్వామి దర్గా మతసామరస్యంపై వచ్చిన మంచి కథలు.
వ్యాసం నిడివి దృష్ట్యా కొన్ని కథలను మాత్రమే ఉదహరించడం జరిగింది. ఇంకా అనేకమంది కథకులు రాసిన కథలు ఈ కాలాన్ని చరిత్రకు అందించాయి. ఇట్లా వర్తమాన తెలుగు కథ అనేక అంశాలను, సమాజంలోని భిన్న కోణాలను ఆవిష్కరిస్తున్నప్పటికీ ఇంకా కథకులు సమాజంలో చూడాల్సిన అంశాలు ఉన్నాయి. విద్యా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వ్యాపారం ప్రవేశించింది. చిత్ర విచిత్రమైన మార్పులు సమాజంలో మానవ మనస్తత్వాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. మత రాజ్య ప్రస్తావన వినిపిస్తూ ఉంది. తెలుగు కథకుడు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన కాలంగా మనం దీన్ని గుర్తించాలి.

– డాక్టర్‌ సుంకర గోపాలయ్య
94926 38547

➡️