దళిత సాహిత్య యోధుడు జాలా రంగస్వామి

భారతదేశంలో ఆదిహిందూ, ఆది ఆంధ్ర ఉద్యమాలు సరికొత్త సామాజిక చైతన్యానికి బాటలు వేశాయి. నైజామాంధ్ర, బ్రిటీషాంధ్ర ప్రాంతాల అణగారిన ప్రజల్లో ఆత్మగౌరవ స్ఫూర్తిని కలిగించాయి. ఈవిధమైన ప్రత్యామ్నాయ కార్యాచరణకు భాగ్యరెడ్డి వర్మ మార్గదర్శిగా నిలిచాడు. జాతీయోద్యమంతో పాటు ఆది ఆంధ్ర ఉద్యమానికి కూడా రాజమహేంద్రవరం కేంద్ర బిందువుగా నిలిచింది. జాతీయోద్యమ సాహిత్యానికి ప్రేరణ నిచ్చిన ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ పద్యం, ఆది ఆంధ్ర పోరాటానికి ప్రేరణ నిచ్చిన ‘మాకొద్దీ నల్లదొరతనం’ పాట ఈ నేల పైనే పల్లవించాయి. ఈ నదీ తీరంలో ఆది ఆంధ్రకవి, నాయకులు తమ బతుకు వెతలను వేదనతో భాషించారు. ఆది కర్తృత్వం వెల్లివిరిసిన ఇక్కడ ఆది ఆంధ్ర ఉద్యమ సాహిత్యం వర్ధిల్లిన ముచ్చట చరిత్ర పెద్దగా పట్టించుకోలేదు. 1917లో మరో మలుపు తిరిగిన ఆది ఆంధ్ర పోరాటం బెజవాడ నుంచి విజయనగరం వరకూ ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో నలుమూలలకు విస్తరించింది. వేముల కూర్మయ్య, నరాలశెట్టి దేవేంద్రుడు, సుండ్రు వెంకయ్య, కుసుమ వెంకట రామయ్య, ఉండ్రు తాతయ్య, బి.యస్‌ మూర్తి, దిడ్ల పుల్లయ్య, బొజ్జ అప్పలస్వామి తదితర నాయకులు సమర్ధవంతంగా ఈ ఉద్యమాన్ని నడిపించారు. విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం ప్రధాన లక్ష్యాలుగా ఆది ఆంధ్ర ఉద్యమం రాజమండ్రి ప్రాంతంలో ఉధృతంగా సాగింది. ఈ పట్టణాన్ని సందర్శించిన మహాత్మా గాంధీ, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ లాంటి ఎంతో మంది జాతీయ నాయకులు ఆది ఆంధ్ర నేతలను కలుసుకొని వారి కష్టనష్టాలను విచారించారు. మహాత్ములను సైతం మాల మాదిగ పల్లెలకు రప్పించిన ఆ గొప్ప నాయకులు కుసుమ ధర్మన్న, జాలా రంగాస్వామి. సివి మూలంగా ధర్మన్న చేసిన ప్రత్యామ్నాయ కృషి వెలుగులోకి వచ్చింది. దళిత వైతాళికుడైన కుసుమ ధర్మన్న సాహిత్య వ్యక్తిత్వంపై ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ విలువైన పుస్తకాలను ప్రచురించింది. ధర్మన్న లాగానే సామాజిక, సాంస్క ృతిక, సాహిత్య రంగాల్లో బహుముఖీనమైన కృషి చేసిన ఆది ఆంధ్ర ఉద్యమ సారథి, సాహితీవేత్త జాలా రంగస్వామి గురించి ఇంతవరకూ చర్చ జరగలేదు. పేరును ప్రస్తావించారు గానీ రంగస్వామి సాహిత్య తీరు తెన్నులపై సరైన విశ్లేషణ చేయలేదు. బి.ఎస్‌.మూర్తి అన్నట్లు ‘దళిత జనోద్ధరణకు తన జీవితాన్ని కైంకర్యం చేసిన మహానుభావుడు రంగస్వామి’. ప్రౌఢబంధురమైన పద్యం రాసే సృజనశక్తి ఉన్నప్పటికీ ఆ ధోరణకి భిన్నంగా రంగస్వామి తన జాతి జనుల అవగాహనను అనుసరించి వచన ప్రక్రియల వైపు ఎక్కువగా దృష్టి సారించి చైతన్యభరితమైన దళిత సాహిత్యాన్ని సృష్టించాడు.
జాలా రంగాస్వామి 1904లో పేరమ్మ, కుప్పుస్వామి దంపతులకు రాజమండ్రి పట్టణం కంబాల పేటలో జన్మించాడు. ఉపాధ్యాయుడిగా ఒకవైపు పాఠాలు బోధిస్తూనే మరొక వైపు ఆది ఆంధ్ర ఉద్యమ నాయకుడిగా, అంటరాని చీకటిలో మగ్గుతున్న అణగారిన ప్రజల్లో నూతన సంస్కరణ జ్యోతులు వెలిగించాడు. సామాజిక కార్యకర్తగా, దళిత నేతగా మాల మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో మహాత్మాగాంధి స్థాపించిన ఆనంద నికేతన్‌ ఆశ్రమంలో ఉపాధ్యాయుడిగా ఆయన విశేష సేవలందించాడు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించిన దేశభక్తుడు జాలా రంగస్వామి. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా, దళితుల్లో జ్ఞాన ఎరుకను పెంపొందింపజేసిన సంస్కరణ శీలి. మాల మాదిగల విద్యార్థుల కోసం ఉచితంగా వసతి గృహాలు స్థాపించాడు. ఇందుకోసం భిక్షాటన చేశాడు. ఆది ఆంధ్ర ఉద్యమకారుడిగా, రచయితగా జాలా రంగస్వామి చారిత్రాత్మకమైన కృషి చేశాడు. జైభీమ్‌, వీర భారతి వంటి పత్రికలను ప్రారంభించి తద్వారా ఉద్యమ భావజాల ప్రచారం సాగించాడు. గేయం, పద్యం, నవల, నాటకం, జీవిత చరిత్ర తదితర ప్రక్రియల్లో ఇరవై గ్రంథాలు రచించినప్పటికీ జాలా రంగాస్వామికి తెలుగు సాహిత్యం చరిత్రలో సముచిత స్థానం దక్కకపోవటం విచారకరం. ‘అంటరాని వారెవరు?’, ‘మాల శుద్ధి’, ‘మేలుకొలుపు’ లాంటి గేయాలతో ఆయన దళిత జాతిని మేలుకొల్పాడు. అరుంధతి, అహింసా, అస్పృశ్యత, కడుపు మంట, నిరుద్యోగి లాంటి ఎన్నో ప్రయోజనవంతమైన రచనలు చేశాడు. జంగం చిన్నయ్య ‘భారతదేశ నిర్మాణంలో దళితులు’, యాగాటి చిన్నారావు ‘ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర’ వంటి పరిశోధకుల గ్రంథాల్లో జాలా రంగ స్వామి సేవలను కొనియాడారు. ఎల్లే విజయానందరాజు తన సిద్ధాంత గ్రంథంలో రంగస్వామి రాసిన కొన్ని రచనలను సమీక్షించాడు.
పాట, వచన గేయం, నాటకం లాంటి ప్రక్రియల ద్వారా అత్యధిక శాతం నిరక్షరాస్యులైన దళితులను చైతన్యవంతం చేయవచ్చునని జాలా రంగా స్వామి భావించాడు. ‘అంటరానివారెవరు? అనే దీర్ఘ గేయం దళిత సాహిత్యానికి గొప్ప స్ఫూర్తినిచ్చింది. ‘ప్రస్తుత మాల మాదిగల స్థితి’, ‘కవి జీవించినకాలం’, ‘పూర్వోన్నత స్థితి’, ‘విచారణ’ మూడు భాగాలుగా రంగస్వామి ఈ గేయాన్ని రచించాడు. ఆనాటి మాల మాదిగల దీనావస్థలను, అంతకముందు రాజులుగా, నాయకులుగా రాజ్యాలను పాలించిన దళితుల ఉన్నత స్థితి గతులను రంగస్వామి చారిత్రిక దృష్టితో ఈ గేయంలో చిత్రించాడు. ‘కుక్కల కన్నా తక్కువంచు మము ఎక్కిరించుతారే / చక్కని పంటలు పండిస్తేను చల్లగా తింటారే/ వీటన్నిటిని ముట్టిన వారికి వెగటే లేదండీ/ మమ్ముల ముట్టగా మాత్రము వారికి వెగటు బుట్టెనండి’ అని ఆధిపత్య వాదుల గుండెలదిరేలా గర్జించాడు. కుల వ్యవస్థలోని అవకాశవాద వైఖరిని, ద్వంద్వ ప్రవృత్తిని రంగాస్వామి పదునైన వాదనా పటిమతో ఎత్తి చూపాడు. ‘ఆది ఆంధ్రుల రక్తమునంతా ఆరగించినా మీకు దాహము తీరలేదా? మా యొక్క కష్టమ్మును దింటూ మమ్ము జంపుతారే’ అని తీవ్రంగా ప్రశ్నించాడు. అంటరాని తనం పేరుతో కోట్లాది ప్రజలను విడదీసి మాట్లాడితే హిందూ జాతికి బలం లేదని తేల్చి చెప్పాడు. ‘ఆర్యుల కంటే ముందటి వారు అనార్యులేనండి/ చరిత్రలెల్ల చెప్పుచున్నవి చక్కగా వినరండి / పూర్వము రాజ్యాలేలిన వీర పురుషులు మావారు’ మూల వాసులైన మాలమాదిగలే ఒకప్పుడు భారతదేశాన్ని పాలించారని, వారిపై ఆర్యులు దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమించారని రంగాస్వామి ఈ గేయంలో విశ్లేషించాడు. ఆర్య వలస వాదుల, దోపిడీదారుల అసలు రహస్యాలను కుసుమ ధర్మన్నలాగా రంగస్వామి తేటతెల్లం చేశాడు. సవర్ణుల చేత ఆరాధించబడే పురాణ పురుషులు వాల్మీకి, వేదవ్యాసుడు, కన్నమనీడు, రోహిదాసుడు, చొకామేలుడు లాటి భక్తులందరూ శూద్రులేనని గుర్తుజేశాడు. ‘మీ తల్లికి మీరెట్లు పుట్టిరో మేము అట్లేనయ్య’, ‘సోదరత్వము జూపుటలోనే సుఖమున్నాదండి’ అని ప్రాబల్య వర్గాల వారికి హితవు చెప్పాడు. అంటరానితనం రూపు మాపకుండా ‘సర్వేజనా స్సుఖినోభవన్తు’ అనే నినాదానికి అర్థం లేదని కవి పరోక్షంగా విమర్శించాడు. ‘అమానుషమైన భేదభావాలతో ఈ ధర్మ రాజ్యాన్ని పాడుచేయకండి’ అని హెచ్చరించాడు. స్వరాజ్య సాధనతో పాటు సాంఘిక సమానత్వ సాధన కూడా ముఖ్యమని’ ‘అంటరాని వారెవరు?’ గేయంలో కవి దార్శనిక దృష్టితో ప్రస్తావించాడు.
జీవ కారుణ్య భావనను, జంతు సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ జాల రంగాస్వామి ‘అహింస’ పాటల సంపుటి వెలువరించాడు. పశువుల మొర, మేకల మొర, గొర్రెల మొర, కోళ్ళ మొర, చేపల మొర వంటి శీర్షికలతో అందరికీ అర్థమయ్యే శైలిలో రంగ స్వామి రాసిన ఈ పాటల సంపుటి పశువులను ఎంత ప్రేమగా ఆదరించాలో తెలియజేస్తుంది. 1915లో ‘జీవరక్షా జ్ఞాన ప్రచారక మండలి, దక్కన్‌ హ్యూమానిటేరియన్‌ లీగ్‌ సంస్థల ద్వారా భాగ్యరెడ్డి వర్మ జీవ కారుణ్య తత్త్వాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఈ సంస్థ ‘అహింసా సంగీత రత్నావళి’ పేరుతో పాటల పుస్తకాన్ని ప్రచురించింది. భూత దయాదృష్టిని తెలియజెప్పే అనేక పాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి. జీవరక్షా జ్ఞానప్రచార మండలి విశేష కృషిని ‘అహింస’ గ్రంథం ముందు మాటలో విశ్వనాథ్‌ టేకుమళ్ళ ప్రస్తావించాడు. బౌద్ధ, జైన మతాలు తప్ప మిగతా మతాలు జీవహింసను వ్యతిరేకించడం లేదని ఈ ముందుమాటలో విశ్వనాథ్‌ ఆరోపించాడు. ‘అడవుల్లో పులుల బాధ, జనావాసాల్లో పురజనుల బాధ, మాకు బాధ యెటుల తప్పదయ్య’ జంతువుల మొరను, ఆవేదననను రంగస్వామి తన పాటల్లో ఆర్ద్రంగా అక్షరబద్ధం చేశాడు. ‘జీవహింసయని దలచు వారు, ప్రేమ జూపించు మానవులు మాయమైనారయ్య’ అని రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అన్న దానములెన్నో హాయిగా జరుపేరు/ ధర్మసత్రాలు నిర్మింత్రు చాలా/ పుణ్యక్షేత్రాలు తిరుగుదురేల/ గొప్పలెన్నో జెప్పుచు దిరిగి, గోసి మము తిననేల’ ఇలాంటి ప్రశ్నలతో కవి జంతువుల మొరను పాటల్లో పలికించి మానవజాతికి కనువిప్పు కలిగించాడు. ‘మాలో మాకు కయ్యాలు పెంచేరు/ పందెములు వేసి మమ్ము జంపేరు/ దీనికై డబ్బులు పోసి చెడతారు’ భక్తి పేరుతో సాగే జంతు బలులను, పౌరుషం కొరకు చేసే కోడిపందెములను ఈ పాటల్లో కవి తీవ్రంగా నిరసించాడు.
జాలా రంగస్వామి గొప్ప నాటక కర్త. ఆది ఆంధ్ర, హరిజనోద్యమాల ఆశయాలను ప్రచారం చేస్తూ ఈ రచయిత మంచి నాటకాలు రాశాడు. అయితే ఎక్కువసార్లు ప్రదర్శించక పోవడం వల్ల ఈ నాటకాలకు పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. రాజమండ్రిలో పౌరాణిక నాటకాల హవా కొనసాగుతున్న కాలంలో రంగా స్వామి సాంఘిక నాటకాల ద్వారా సామాజిక చేతన రగిలించాడు. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాల్సిన అవసరాన్ని చాటి చెబుతూ ‘నందనార్‌’ (1937) నాటకం రాశాడు. దళిత స్త్రీలపై భూస్వాములు సాగించే హింసాకాండను, అకృత్యాలను కళ్ళకు కట్టినట్లు ‘అనాథ’, (1947) నాటకంలో చిత్రించాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఉపాధ్యాయుల బాధలను రంగస్వామి ‘బడిపంతులు బ్రతుకు’ (1953) నాటకంలో సజీవంగా దృశ్యమానం చేశాడు. బంజరు భూములను, నివాసయోగ్యమైన స్థలాలను ప్రభుత్వమే దళితులకు పట్టాల రూపంలో పంచిపెట్టాలని, దేశ రాజకీయాల్లో దళితులు పాలు పంచుకోవాలనే సందేశంతో ‘దున్నేవానిదే భూమి’ అనే 15 రంగాల నాటకం రాశాడు. పాము పడగ కింద కప్ప నివసించడం ఎలా ఉంటుందో దళితుల బతుకు కూడా గ్రామాధికారుల పాలన కింద అలాగే ఉందని పుల్లయ్య అనే దళిత నాయకుడి పాత్ర ద్వారా పలికిస్తాడు రచయిత. దళితులు విద్యావంతులై ఎన్నికల్లో పోటీ చేసి మంత్రులై దేశసేవలో ముందుండాలని రంగస్వామి ఈ నాటకం ద్వారా చాటి చెప్పాడు. ‘రంగస్వామి నాటకాల్లో సంభాషణ తీవ్ర గతి నడుస్తుంది. పద్యములలోని భావములు ఆలుచిప్పలోని ఆణిముత్యాల్లా ప్రకాశిస్తాయి’ అని డి.రామయ్య ప్రశంసించాడు. కులాంతర వివాహాల ఆవశ్యకతను తెలియజేస్తూ రంగాస్వామి వెలువరించిన ‘రైతుపిల్ల’ (1938) నవల విశిష్టమైనది. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎండ్లూరి సుధాకర్‌ పర్యవేక్షణలో గూటం లక్ష్మణ రావు ‘రైతు పిల్ల నవల – ఒక పరిశీలన’ అనే అంశంపై ఎంఫిల్‌ చేశాడు. కమ్యూనిస్టు నాయకుడు చిట్టూరి ప్రభాకర చౌదరి కుసుమ ధర్మన్న కుమార్తెను వివాహం చేసుకున్న సందర్భంలో ఈ ఆదర్శ వివాహం ప్రేరణగా రాసిన ఈ నవలను రంగస్వామి ఒక సాంఘిక ఇతిహాసం లాగా తీర్చిదిద్దాడు. ఆనాటి గ్రామీణ ఆర్థిక రాజకీయ పరిస్థితులను, రైతు కూలీల నడుమ సాగే సంఘర్షణను, కాంగ్రెస్‌ పార్టీ విధానాలను నవలలో రచయిత ఆసక్తిదాయకంగా చిత్రించాడు. కల్లు, మద్యపానము లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, శారీరక పరిశుభ్రతను విధిగా పాటించాలని, వేషధారణలో కూడా జాగ్రత్త వహించాలని ‘మాలశుద్ధి’ గేయంలో రంగాస్వామి దళితులకు హితబోధ చేశాడు. కస్టజీవులైన దళితులు కూలి డబ్బులను పొదుపు చేసుకోవాలని, మూఢాచారాలను విడిచి పెట్టాలని దళిత స్త్రీలకు సూచించాడు. ‘మధుపిశాచి’, ‘త్రాగుబోతు మగడు’ లాంటి రచనలతో దళితుల ఆరోగ్య సంరక్షణకు జీవన భద్రతకు అవసరమైన సదావగాహన కల్పించాడు. జాలా రంగస్వామి ఉద్యమ, సాహిత్య ప్రయాణంలో ఆయన సహచరి, రచయిత్రి, ఉత్తమ ఉపాధ్యాయురాలు, నాయకురాలు, జాలా మంగమ్మ పాత్ర మరువలేనిది. ఆది ఆంధ్రుల సంస్కరణలో, భర్త కార్యాచరణలో మంగమ్మ సగభాగమై రంగస్వామిని ముందుకు నడిపించింది. ఆది జన గ్రంథమండలి స్థాపించి రంగస్వామి రచనలకు సంపాదకత్వం వహించి వాటిని ప్రచురించింది. మంగమ్మ మొదటి దళిత సంపాదకురాలని జయధీర్‌ తిరుమలరావు పేర్కొన్నాడు. కుసుమ ధర్మన్న, గుర్రం జాషువ, బోయి భీమన్న తదితర కవుల ప్రభావం జాలా రంగస్వామి సాహిత్యంపై కొంతవరకు కనిపిస్తుంది. వీరందరూ పరస్పరం స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగారు.
మహాత్మాగాంధీ కృషి వల్లనే దళితుల జీవితాల్లో మంచి మార్పులు వచ్చాయని జాలా రంగస్వామి భావించాడు. పరిణామక్రమంలో ఆయన డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలను నిబద్ధతతో అనుసరించాడు. భారతదేశ ప్రగతికి, అణగారిన వర్గాల సర్వతోముఖ విముక్తికి మార్గదర్శకమైన ప్రణాళికను అందించిన అంబేడ్కర్‌ ప్రస్థానాన్ని జాలా రంగస్వామి తన గ్రంథాల్లో తెలియజేశాడు. ‘ఆరని అమర జ్యోతి అంబేడ్కర్‌’, ‘అంబేడ్కర్‌ రాయబార సందేశ జీవితం’ లాంటి గ్రంథాలతో తెలుగులో అంబేడ్కర్‌ సాహిత్యానికి రంగస్వామి అంకురార్పణ చేశాడు. పద్యమైనా, వచనమైనా పూర్తిగా వ్యవహారిక భాషలో రాయడం వల్ల సామాన్యులకు కూడా రంగా స్వామి సాహిత్యం అర్థమవుతుంది. కుసుమ ధర్మన్న లాగా రంగస్వామి కూడా దళిత సాహిత్యయోధుడు. జాలా రంగస్వామి సమగ్ర సాహిత్యంపై పరిశోధనలు జరగవల్సిన అవసరముంది.

– డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు
94404 80274

➡️