క్షమించు తల్లీ! ఈ దేశాన్ని …
సిగ్గుపడుతుంది ఈ ఘోరానికి.
కలుషితమైన రాజకీయం
విషం కక్కే స్వార్దం
పచ్చి అబద్ధమైన నమ్మకం
కుళ్ళిపోయిన వ్యవస్థలు
వీటి మధ్య నలిగిన నీ జీవితం
అక్షరాలా అమలుకాని చట్టాలకు అవమానం!
డబ్బు పిచ్చితో మదమెక్కిన మృగాల మధ్య
విలువల్లేని విష వలయాల మధ్య
బలికాబడిన నీ జీవితం ఈ దేశంపై
సామాన్యులు కోల్పోయిన నమ్మకానికి సాక్ష్యం.
మనిషిని కాపాడే వైద్యశాలలు శ్మశానాలుగా
పౌరులను రక్షించాల్సిన నాయకులు రాక్షసులుగా
వ్యవస్థను కాపు కాయాల్సిన పార్టీలు
కిరాతకంగా మారితే …
ఎలా ఈ దేశంలో చదువులు
ప్రజలకి సేవ చేసేది?
ఎలా ఈ సంఘంలో నీతి, న్యాయం
నిజాలని తోడుగా నిలచేది?
కొనఊపిరితో కొట్టుకుంటుంది కోర్టులపై ఆశ..
బలం, బలగాన్ని కోల్పోతున్న నిజాయితీ
ఒంటరిగా ఓటమితో హత్యతో పాటు
అత్యాచారానికి గురై
బిడ్డల దుస్థితికి దేశం
గుండెలు పగిలేలా ఏడుస్తోంది!
ఇంకా చూస్తారెందుకు?
నిజాలు బహిరంగంగా వీధికెక్కి రోదిస్తూ
సూటిగా గుండెల్లో ప్రశ్నలతో
ఈ నరకాలకు కారకాలని
గుచ్చి గుచ్చి అడుగుతుంటే
ఈ దేశంలో యువతకు,
ఆడబిడ్డలకు, చదువులకు నిద్ర లేదు..
ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారం చేయలేని
బలహీనులమా?
నడివీధిలో ప్రతి తప్పునీ బహిరంగంగా
ఉరి తీయాలి
అప్పుడే నీ ఆత్మకు శాంతి ఆని
ఈ దేశం మొత్తం ఒప్పుకునే నిజం..
ఈ నిజం అమలులో
ఏ దుర్మార్గం తప్పించుకోకూడదు జాగ్రత్త!
– చందలూరి నారాయణరావు
97044 37247