డాక్టర్‌ మీగడ రామలింగ స్వామికి గురజాడ విశిష్ట పురస్కారం

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఈ సంవత్సరం గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, దర్శకుడు, 28 నంది బహుమతులు గెలుచుకున్న డాక్టర్‌ మీగడ రామలింగస్వామి కి నవంబర్‌ 30 న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు గురజాడ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌ ప్రకటించారు. సోమవారం విజయనగరం కోటలోని గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురజాడ సాహితీ చైతన్యోత్సవ ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన అనంతరం…. గురజాడ సంస్కృతిక  సమాఖ్య సభ్యులు మాట్లాడుతూ … మహాకవి గురజాడ కు సమున్నత రీతిలో నివాళులు అర్పిద్దామన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌ 30 వ తేది గురజాడ వర్థంతిని పురస్కరించుకుని నిర్వహించే గురజాడ సాహితి చైతన్యోత్సవం ఆరోజు ఉదయం 9 గంటలకు గురజాడ స్వగఅహం లో జ్యోతి ప్రదీపన తో ప్రారంభమై, గురజాడ వాడిన వస్తువులతో పాదయాత్ర గా వెళ్లి గురజాడ విగ్రహానికి పూలమాలలతో అలంకరించడంతో ఉత్సవం ప్రారంభం అవుతుందని తెలిపారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆనంద గజపతి కళా క్షేత్రంలో పురస్కార ప్రదానోత్సవం ఉంటుందన్నారు. గురజాడ విశిష్ట పురస్కారంతోపాటు జాతీయ స్థాయి లో నిర్వహించిన కవితల పోటీలో ఎంపిక చేయబడిన ఏడుగురికి గురజాడ ఉత్తమ కవితా పురస్కారం తో సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ పురస్కారాలు మానాపురం రాజా చంద్ర శేఖర్‌, విజయనగరం, ఇందిరా వెల్ది, హైదరాబాద్‌, జి.ఎల్‌.ఎం. శాస్త్రి అనకాపల్లి, సత్యముని నవీన్‌, గద్వాల్‌ , మీసాల చిన గౌరు నాయుడు, బొబ్బిలి, కే.పద్మజా శంకర్‌, గంట్యాడ, డా.ఎన్‌. నరేంద్ర బాబు బెంగుళూరు స్వీకరిస్తారని, వీరితో పాటు నవసాహితి చెన్నై గురజాడ ఉత్తమ కవితా పురస్కారాలు డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి, విశాఖపట్నం, కూసుమంచి శ్రీదేవి సురేష్‌ లకు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తో పాటు, విశిష్ట అతిధిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, గౌరవ అతిధులుగా. ఎం.ఎల్‌.ఎ అదితి విజయలక్ష్మి గజపతి రాజు, కలెక్టర్‌ డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌ పాల్గొంటారని వివరించారు. పురస్కార ప్రదాత గా సాయి ఫౌండేషన్‌ తరపున డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, ప్రియ అతిధులు గా రోటరీ గవర్నర్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, సీనియర్‌ పాత్రికేయులు నవసాహితి ఇంటర్నేషనల్‌ చెన్నై వ్యవస్థాపకులు సూర్య ప్రకాష్‌, ఎన్సిఎస్‌ రామనారాయణం నారాయణం శ్రీనివాస్‌, సన్‌ స్కూల్‌ అధినేత మామిడిపాక అనిల్‌ కుమార్‌ జ్ఞాపికల ప్రదాత గా మేకా కాశి విశ్వేశ్వరుడు పాల్గొంటారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వకృత్వం, వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం కూడా ఉంటుందని తెలిపారు.

➡️