అజో – విభొ – కందాళం ఫౌండేషన్ (అప్పాజోస్యుల – విష్ణుభొట్ల) వారి 32వ వార్షిక సాహితీ సాంస్క ృతిక కార్యక్రమాలు జనవరి 2 – 5 తేదీల్లో విజయవాడలో… జాషువా సాంస్కృతిక వేదికతో కలిసి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా, విజయవంతంగా నిర్వహించారు. విశిష్ట పురస్కారాలు, సాహితీ సాంస్కతిక సదస్సులు, వివిధ గ్రంథాల ఆవిష్కరణలు, తెలుగు రాష్ట్రాల స్థాయిలో కథా నాటికల పోటీలు ఆద్యంతం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. కళాకారులు, సాహితీవేత్తలకు, కార్యకర్తలకు ఈ నాలుగు రోజులూ పండగే. అధిక సంఖ్యలో హాజరయ్యారు. ‘అప్పాజోస్యుల…’ పరిషత్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఓ విశిష్ట స్థానం ఉంది. కథ ఆధారంగా రాసిన నాటికలను మాత్రమే ప్రదర్శింపజేసే ఏకైక పరిషత్ ఇది. ఈ ఫౌండేషన్ నాటిక ప్రదర్శనలతో పాటు సాహితీ రంగాన్నీ సమాంతరంగా ఆదరిస్తోంది. వివిధ సాహిత్య విభాగాల్లో విశేష కృషి చేస్తున్న నిష్ణాతుల్ని ఘనంగా సత్కరిస్తోంది. వారి సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలతో అపురూపమైన జ్ఞాపికలను ప్రచురిస్తోంది. సమీకరించిన నిధులతో కాక పూర్తిగా సొంత నిధులతోనే మొత్తం కార్యక్రమాలు నిర్వహించటం ఈ ఫౌండేషన్ ప్రత్యేకత. కార్యక్రమాలను నిర్దేశిత సమయానికి కచ్చితంగా ప్రారంభించడం వీరి ఆనవాయితీ.
ఈ పరిషత్ నిర్వహించే నాటికల పోటీకి ముందుగా నిష్ణాతుల టీమ్ స్క్రూటినీ నిర్వహిస్తుంది. ఈసారి మొత్తం 18 నాటికలను చూసి ఎనిమిదింటిని ఎంపిక చేశారు. వర్తమాన సమాజంలోని వివిధ సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొని అల్లిన ఈ కథానాటికలు ప్రేక్షకులను అలరించాయి. రైతులపై దోపిడీ, స్త్రీ స్వేచ్ఛ, కుటుంబ సంబంధాల భూమిక, సైకాలజీ సబ్జెక్ట్, మానసిక రుగ్మతలు తదితర భిన్న ఇతివృత్తాల నాటికలను ప్రదర్శింపజేశారు.
అన్నదాత : పాలకవర్గాల విధానాలతో కుదేలవుతున్న రైతు- వ్యాపారులు, దళారీల దోపిడీ తోడై పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతూ.. అజ్ఞానంతో ‘ప్రత్యామ్నాయ సాగు’ (?) ఎరకు చిక్కి ఏకంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఉదంతాల్ని ‘అన్నదాత’ నాటికలో కళాంజలి, హైదరాబాద్ కళాకారులు హృద్యంగా ప్రేక్షకుల కళ్లకు కట్టారు. మూలకథ, నాటకీకరణ వల్లూరు శివప్రసాద్, దర్శకత్వం కొల్లా రాధాకృష్ణ. రైతు బాధలు, కష్టాల రీత్యా- కోర్టులో ఆయన వాదన సానుభూతి కలిగించొచ్చు గానీ.. చట్ట ప్రకారం ఆ తీరు వాదన చెల్లదేమోననే సందేహానికి ఆస్కారం లేదనలేం. గంజాయి సాగు విషయంలోనూ సాధ్యాసాధ్యాల ప్రశ్న ఉదయించొచ్చు. నటనాపరంగా ప్రదర్శకుల స్థాయి ఇంకొంచెం పెరిగితే మరింతగా ఆకట్టుకునేది.
వేదాంతం : తన మూలంగా ‘ఆమెకు’ జరిగిన కష్టం, నష్టం నుంచి బయటపడేసి మళ్లీ ‘ఆమె’ జీవితాన్ని చిగురింపజేయాలనే ప్రయత్నంలో ఆ ఆకాశ ప్రేమికుడి తపనే ‘వేదాంతం’. శ్రీ షిర్డీ సాయి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్, అనకాపల్లి వారు ప్రదర్శించారు. మూలకథ గుడిపాటి వెంకటాచలం, నాటకీకరణ మార్గశీర్ష, దర్శకత్వం ముత్యాలరావు పొన్నాడ. కళాకారులు పాత్రోచితంగా నటించారు. ‘పాతివ్రత్యం వల్ల వచ్చే సుఖ వ్యాధుల గురించి బాగా చెబుతుంది ఈ పుస్తకం.. చదువుతున్నంత సేపూ మీరే గుర్తొస్తున్నారు….’ ”లా’ కప్పులో ఇమడదని చెప్పండి’ వంటి డైలాగులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపినా… మొత్తంగా చూసినప్పుడు కంటెంట్‌లో క్లారిటీ పెరగాలి అనిపించింది.
(అ)సత్యం: ఈ నాటిక ఉత్తమ ప్రదర్శన నిలిచింది. కంటికి కనిపించేదంతా సత్యం కాకపోవొచ్చు.. అలానే- కనిపించనంత మాత్రాన అది అసత్యమైపోదు. సత్యమే అయినా దుష్ఫలితానికి దారితీసేదైతే అది అసత్యమేనని; అబద్ధమైనా శుభానికి దోహద పడితే అది సత్యమేనని సూత్రీకరించారు ‘(అ)సత్యం’ రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు (మూలకథ : శ్రీసుధ మోదుగు). చైతన్య కళాస్రవంతి, ఉక్కునగరం (విశాఖపట్నం) కళాకారులు పి.బాలాజీ నాయక్ దర్శకత్వంలో ఈ నాటికను ప్రదర్శించారు. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్‌లతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించకుండా వెంటవెంటనే కర్టెన్స్ మార్పుతో ప్రదర్శనను జరిపారు.
దేవరాగం : రెండో ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన నాటిక ఇది. తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో కంటి రెప్పలా కాపాడుకుంటే.. ఆ వృద్ధాప్యమే తల్లిదండ్రులకు మధురమైన మలిదశ బాల్యమవు తుందంటారు ‘దేవరాగం’ రచయిత. పెద్ద జీతం, అమెరికా ఉద్యోగం కంటే వృద్ధ తల్లిదండ్రులను సేవించడమే మిన్న అని భావించారు. మూలకథ సలీమ్. రచయిత కేకేఎల్ స్వామి దర్శకత్వంలో శ్రీ సౌజన్య కళా స్రవంతి, ఉత్తరాంధ్ర బందం అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు.
అనశ్వరం : లోకంలో మనం చాలామందిని ఇష్టపడొచ్చు.. కానీ మనల్ని ఇష్టపడే వ్యక్తి ఒకరున్నా అదృష్టమే అన్నది ‘అనశ్వరం’ నాటిక సారాంశం. బర్రె సత్యనారాయణ రచన, డి.వి.చంద్రశేఖర్ దర్శకత్వంలో శ్రీ కృష్ణా ఆర్ట్ థియేటర్ ఆర్ట్స్, విజయవాడ వారు ఈడిగ్గా ప్రదర్శించారు. ప్రేక్షకులకు ఈ సైకాలజీ ఇతివృత్తం అంతగా పట్టలేదనిపించింది. బ్రహ్మ స్వరూపం : చాలా హాయిగా, ఉల్లాసంగా సాగిపోతున్న కుటుంబంలో అనుకోకుండా ఘోర విపత్తు జరిగితే..? సాక్షాత్తూ బ్రహ్మస్వరూపమే ఆవహించి- ధర్మాన్ని చెప్పడం నాటిక ఇతివృత్తం. ఆద్యంతం ప్రదర్శన ఆకట్టుకుంది. అయితే.. అత్యంత ఘోర విపత్తు జరిగిన విషయం తెలిసిన సందర్భంలో నటన ఇంకా పండాలి అనిపించింది.
వర్క్ ఫ్రం హౌం : కాఫీ కూడా కలపడం రాని భార్యతో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కష్టాల్ని ఆద్యంతం హాస్యభరితంగా రంజింపజేశారు పి.ముత్యాలరావు దర్శకత్వంలో సహృదయ, ద్రోణాదుల కళాకారులు. మూలకథ కేకే భాగ్యశ్రీ, నాటకీకరణ అద్దేపల్లి భరత్ కుమార్. విడాకులు కావాలి : భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో పనులు చక్కబెట్టుకోవడం.. పంతాలూ పట్టింపులకూ పోకుండా సర్దుబాటు ధోరణితో సంసారాన్ని పండించుకోవాలనే సందేశాన్ని అరవింద ఆర్ట్స్, తాడేపల్లి కళాకారులు హాస్యంతో మిళితంజేసి అందించారు. మూలకథ : ఆలూరి విజయలక్ష్మి, రచన : వల్లూరు శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి. తొలి సీన్లలో.. హాస్యం పండించే క్రమంలో (ప్రధాన జంట) సంభాషణల సౌండ్‌తో పాటు వేగంగా చెప్పడంతో క్లారిటీ తగ్గి, గందరగోళం అనిపించింది.
స్క్రూటినీ దశలో ఆకుల మల్లేశ్వరరావు, చిట్టి వెంకటరావు; తుది ప్రదర్శనలకు డా.ఎం.సి.దాస్, కె.శాంతారావు, ఎస్. నరసరాజు స్థాననిర్ణేతలుగా వ్యవహరించారు. విజయవాడ పుస్తక మహోత్సవం కూడా ఇదే రోజుల్లో జరుగుతున్నందున వివిధ జిల్లాల నుంచి రచయితలు, కళాకారులు నగరానికి విచ్చేసి, ఈ ప్రదర్శనలను తిలకించారు. ఆఖరి ప్రదర్శన వరకూ కూడా పెద్ద సంఖ్యలోనే ప్రేక్షకులు ఉండడం విశేషం. జాషువా సాంస్క ృతిక వేదిక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించటంతో పాటు అతిథులకు, ఆహ్వానితులకు చక్కని ఆతిథ్యం అందించింది.
– జి.వి.రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్