తెలంగాణ : ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ (76) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వడ్డేపల్లి కృష్ణ కవి, సినీ గేయ రచయిత, లతితగీతాల రచయితగా రాణించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నివాళులర్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కవులు, కళాకారులు, రచయితలు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఆణిముత్యాల్లాంటి పాటలు…
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన వడ్డేపల్లి కృష్ణ.. కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగారు. హైదరాబాద్ నాగోల్ లో స్థిరపడ్డారు. పోస్టుమెన్ ఉద్యోగం చేశారు. పిల్ల జమీందార్ చిత్రంలో ‘నీ చూపులోన విరజాజి వాన’, భైరవ ద్వీపం చిత్రంలో అంబా శాంభవి లాంటి ఆణిముత్యాల లాంటి పాటలు రచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించగా అన్ని వేదికలపైనా ఆ నృత్య రూపకం మార్మోగింది.
సినారె ఇష్టపడిన రచయిత…
రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం వడ్డేపల్లి కృష్ణను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సినారె ఇష్టపడిన రచయిత వడ్డేపల్లి కృష్ణ. పది వేల లలిత గీతాలను పరిశీలించి వడ్డేపల్లి పీహెచ్‌డీ పూర్తి చేశారు. వందలాది లలిత గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. 40కి పైగా నృత్య రూపకాలు రాశారు. ఎన్నో పుస్తకాలను కూడా ప్రచురించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర…
తెలంగాణ ఉద్యమంలో వడ్డేపల్లి కృష్ణ కీలక పాత్ర పోషించారు. రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎక్కడికి వెళ్తుందో మనసు’ చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించారు. సంచలనం సృష్టించిన బలగం సినిమాలో ఆయనే స్వయంగా నటించారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆటా, తానా వేడుకల్లో ప్రతి ఏటా, సాహిత్య చర్చల్లోను పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించి నిర్మించిన గోభాగ్యం లఘు చిత్రానికి అంతర్జాతీయంగా పలు పురస్కారాలు లభించాయి. బతుకమ్మ, రామప్ప రామణీయం లాంటి అనేక లఘు చిత్రాలకు నంది పురస్కారాలు వచ్చాయి.