గురువులోని గుణాలన్నిటినీ స్తుతిస్తూ
నీవు నా పాదాలను తడుపుతున్నపుడు
ఆత్మన్యూనత నన్ను ముంచెత్తింది.
బడిలో విగ్రహానికి పూజలు చేయిస్తున్నప్పుడు,
మూడు పదులపాటు నాలోని ఉపాధ్యాయుడు
ఇతరేతర విద్యార్థులు పొందే వ్యధను
అంచనా వేయలేని అజ్ఞాని.
విజ్ఞానం, ఆధ్యాత్మికత వైరిశిబిరాలనే జ్ఞానాన్ని
నీ తరం తలకు ఎక్కించలేని పిరికివాడు.
దైవశక్తికి కోట్లాది దేవుళ్ళ కల్పన స్వార్థపూరితమని,
మతదౌర్జన్యాలూ, యుద్ధాలూ నీచ రాజకీయమేనని
బోధించలేకపోయిన నిస్సహాయుడు!
మతోన్మాద దుమ్ముల గొండి
దేశాన్ని నమిలేస్తుందనే ఎరుకను
మీ మెదళ్ళకు ఎక్కించలేకపోయిన దద్దమ్మ!
పుట్టుకతో దైవాంశ సంభూతులు, అల్పులనే భావన
స్వార్థ నీచగుణమని, మానవులందరి జన్మలూ
ఒకలాంటివే అనే జ్ఞానాన్ని కలిగించలేని వ్యర్థుడు!
ఒకనాటి ఆటవిక బృందమే
విస్తార మానవజాతికి మూలమని,
కుల, మత, ప్రాంతాల ముళ్ళపొదల మధ్య
అన్నదమ్ములు విడిపోవడం బాధాకరమనే అవగాహన
ఏర్పరచలేక పోయిన నిస్సహాయుడు!
నీవిచ్చిన ఘనగౌరవానికి అనర్హుడు
శిష్యా నన్ను మన్నించు!
– గార రంగనాథం
98857 58123