ఐక్యబలాన్ని చాటే గంగజాతర

మూలాలను నిత్యం స్మరించుకుంటూ, మాట, పిలుపు, పలుకు, తిండి, బట్ట, కష్టం, సుఖం, పండగ, జాతర, ఊరేగింపు, పుట్టుక, చావు వంటి అనేక విషయాల్లో నిండైన జీవితం ఉట్టిపడేలా మాదిగపల్లి మనుషులను, జీవితాలను నిండుగా చూపిస్తూ ‘గంగజాతర| నవలికను రాశారు కవి, రచయిత దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి. ఇది కేవలం మాదిగపల్లి చరిత్ర మాత్రమే కాదు ‘పాలేటి కింద ఉన్న పద్నాలుగు గ్రామాలను’ కబళిస్తున్న ఫ్లోరైడ్‌ భూతాన్ని అంతమొందించడానికి సాగిన పోరు- తాగునీటి పోరాటం! కులాలకతీతంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల, పశువుల నీటి వెతలు, ఆత్మఘోష ఈ నవలిక.
తక్కువ పేజీలతో చెప్పాలనుకున్నదాన్ని అతి తక్కువ మాటలలో చెప్పడం రచయిత ప్రత్యేకత. ఈ రచయిత … కవి కూడా అవడం చేత కొన్ని వర్ణనలు చాలా స్ట్రైకింగ్‌గా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని :
”సూర్యుడు ఆశీర్వాదాన్ని చేయి పట్టుకు తీసుకుపోతున్నాడా అన్నట్టు అస్తమించాడు. ఆశీర్వాదం కన్ను మూసాడు.”
”వాహనభేరి ఊరు దాటిపోయింది. వర్షం కురిసి వెలసినట్టుంది.”
”రెండు ఆంబోతుల కొట్లాటలో లేగదూడ నలిగిపోయినట్టు మన మాదిగ పల్లెను నిలిపేశారు పెత్తందార్లు”
”ఎండలు కాసినంత సమృద్ధిగా వాన కురవచ్చుగా! ఆకాశమం మీద మబ్బులేనట్లు కల్లెపు చల్లిపోద్దేందిరా.”
ముందుగా చెప్పుకున్నట్టుగా, ఇది మాదిగపల్లితో మొదలై మాదిగపల్లితో ముగిసే కథ మాత్రమే కాదు. మాదిగ ఉపకులాలు కూడా సమాన స్థాయిలో ఆదరణ పొందాలని ఆశించే నవల. ఆయా ప్రాంతాల నుంచి పనుల కోసమంటూ మాస్టీన్‌, ఆసాది, బైండ్ల, చిందు మాదిగ ఉప కులాలు చింతల తోపులో నాలుగు మూలలా డేరాలు ఏసుకుంటారు. ”మాదిగ పల్లె కంటే చింతలతోపుకు కళొచ్చింది” అని మాదిగ, దాని ఉపకులాలు కలిసి వుండడంలోని అందాన్ని, ఆనందాన్ని తెలియజేస్తాడు. ”రండి… రండోరు ఉన్నదాంట్లోనే అందరం కలో గంజో తాగుదాం,” అని ఆహ్వానిస్తాడు మాదిగ పెద్ద ఎంకటరత్నం. ఆ ఉపకులాలు మరోచోట పని వెతుక్కుంటూ వెళ్లిపోతే వెలితిగా ఫీల్‌ అవుతాడు.
కథలో అభ్యుదయ భావాలు కలిగిన టీచర్‌, ఉద్యమకారుడు అయిన సంజీవ్‌ హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీకి ఉన్నత చదువుకు వెళ్ళినప్పుడు వాళ్ళ బిడ్డకు జాగ్రత్తలు చెప్తూ అమ్మ రాసిన ఉత్తరానికి జవాబుగా ”సంజీవి! నువ్వు చిందు, నేను మాదిగ, కోటి మాల. తారతమ్యాలు లేకుండా ఓ చదువుల సాహిత్య కుటుంబం ఇక్కడ ఉందని అమ్మకు ఉత్తరం రాయరా తండ్రీ,” అంటాడు నాగప్పగారి సుందర్రాజు. దళిత కులాలైన మాల-మాదిగ, వాటి ఉప కులాల మధ్య ఉండాల్సిన సోదర భావం, సోదర ప్రేమను తెలియజేస్తుందీ ఉదంతం. మనందరం ఒకే జాతి, ఒకే వర్గం. కష్టాలు కలిసి పంచుకోవాలిరా అంటాడు.
తాగు, సాగు నీటికి వెతలు తీరాలంటే అక్కడ ఒక రిజర్వాయర్‌ కట్టాలి. అందుకు దీర్ఘకాలంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దానికి ప్రజలందరి మద్దతు కావాలి. అప్పుడు అంటాడు సంజీవి, ”మాదిగలవైపు నుంచి ఉద్యమం, పోరాటం అంటే మిగతా కులాలు సహకరించరు. వాళ్ళు సహకరించకపోయినా మన పద్నాలుగు మాల మాదిగలు నడుం బిగిస్తే పాలేటి మీద కట్ట శ్రమదానంతో మూడేళ్ళలో నిర్మించుకోగలం,” అని. మాల మాదిగల సమైక్య పోరాట అవసరాన్ని తెలియజేస్తుంది ఈ ఉదంతం. ఈ కథలో వాళ్ళు (మాల-మాదిగలు) సమైక్యంగా పోరాడి సాధించాల్సింది కొద్ధి ప్రాంతపు నీటి అవసరం అయితే, నిజ ప్రపంచంలో వారు సమైక్యంగా పోరాడి సాధించాల్సింది రాజ్యాధికారం అనే వాస్తవానికి రచయిత సంజీవి అనే పాత్ర ద్వారా పలికించిన ఈ మాటలు స్ఫూర్తిగా నిలుస్తాయి.
భర్త చనిపోయినా తండ్రిని ఆశ్రయించకుండా, ప్రలోభాలకు లొంగకుండా నిండైన ఆత్మ గౌరవంతో ముందుకు సాగి పిల్లలను సాకడమే కాకుండా తాను టీచర్‌ ట్రైనింగ్‌ చేయడం, సంజీవితో కలిసి పోరాటంలో భాగం కావడం ద్వారా ‘గంగ’ అనే పాత్ర దళిత ఆదర్శ యువతిగా కనిపిస్తుంది. తాను చదువు చెప్పే పిల్లలే తనకు సొంతపిల్లలు కావాలి అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకున్న ‘సంజీవి’ పాత్ర ద్వారా దళితులకు నిస్వార్థ నాయకుల అవసరాన్ని తెలియజేస్తాడు రచయిత. ఉదాత్త భావాలు కలిగిన ఈ ఇద్దరు చివర్లో దండలు మార్చుకుని ఒకటవతారు. గంగ బిడ్డలు తన బిడ్డలుగా స్వీకరిస్తాడు సంజీవి. మాదిగ పిల్ల గంగ, చిందు కులపు సంజీవి వివాహం మాదిగ దాని ఉపకులాల మధ్య వివాహ బంధాన్ని అవశ్యకాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో మాల మాదిగల మధ్య ‘కంచం పొత్తు, మంచం పొత్తు లేదు’ అనే వాదనను కూడా ఒక సారి గుర్తు చేసుకోవడం అవసరం. ఒక వేళ ఈ మాట మాల మాదిగల మధ్య రిలేషన్‌ను ఆశిస్తూ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే మాటను ఈ రెండు కులాల మధ్య నెర్రెను లోతుగా విశాలంగా మార్చాలనే ప్రయత్నంతో అంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఎందుకంటే నాకు తెలిసే ఎన్నో మాల-మాదిగ జంటలు వివాహ బంధంలో ఒక్కటై పరస్పర గౌరవంతో విజయవంతంగా సంసారాన్ని సాగిస్తున్నాయి. మాల-మాదిగ వాటి ఉపకులాల మనుషులే గాక, ”ఒరే ఎంకటనర్సు… నీ కుతురు గంగమ్మను నా కొడుకు ఎంగల రెడ్డికి ఇస్తావంటరా!” అని అడిగే పిచ్చిరెడ్డి లాంటి కులాల కంపు విదుల్చుకోవాలని ప్రయత్నం చేసే అగ్రకుల వ్యక్తులు కూడా ఈ కథలో కనిపిస్తారు.
ఇది చక్కగా సింగల్‌ సిట్టింగ్‌లో చదివేయగల నవల. మాదిగ సంస్క ృతికి రెఫరెన్స్‌ బుక్‌లా మారగల నవల. ఈ మధ్యే రిటైర్‌ అయ్యి కావాల్సినంత తీరిక పొందిన ఎజ్రాశాస్త్రి అన్న నుంచి మరిన్ని నవలలు ఆశించవచ్చు.

– సురేంద్రబాబు రేగులగడ్డ

➡️