మౌఖిక సాహిత్యంగా తెలుగు ప్రజల్లో విస్తృత ప్రచారం పొందిన వైశ్య కుల దేవత కన్యకా పరమేశ్వరి కథ గురజాడ కన్యకకి మూలమని ప్రచారంలో ఉన్నా, రెండు కథలకీ సారూప్యం చాలా తక్కువ. వైశ్య కులానికి చెందిన బాలిక కన్యక పాత్రని ఆధారంగా చేసుకుని సామాజిక నీతిని ఆవిష్కరించడం గురజాడ చేసిన ప్రయత్నం; ఆ ప్రయత్నం బలీయమైనది కాబట్టే ‘కన్యక’కి 112 సంవత్సరాల వయసు వచ్చినా స్త్రీ చైతన్య ప్రతీక అయిన ఒక కథా కావ్యంగా నిలుస్తోంది. కథలో కన్యక వయసు గురజాడ చెప్పకపోయినా కథాకాలం నాటి పరిస్థితుల దష్ట్యా, ఆ రోజుల్లో యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు చెలికత్తెలతో కలిసి బయటకు వచ్చేవారు కాదు కాబట్టి, ఆమె బాలిక అని అనుకోవచ్చు.
కన్యక కథ స్థూలంగా పరికిస్తే – ఒక రోజు కన్యక చెలికత్తెలతో కలిసి గుడికి వెడుతో ఉంటుంది. అటుగా వస్తున్న ఆ పట్టణాన్ని ఏలే రాజు కన్యకని చూసి, ఆమె సౌందర్యానికి ముగ్ధుడై మోహించి తనతో వచ్చిన మంత్రులతో కలిసి ఆమెని చుట్టుముట్టి చెరపట్టే ప్రయత్నం చేస్తాడు. నిస్సహాయ స్థితి స్పృహకొచ్చి, సమయస్ఫూర్తితో ‘కోవెలకి వెళ్ళి దేవకార్యం తీర్చి వస్తాను; వైశ్య కన్యను, నిన్ను తప్పించుకుని ఎక్కడకి పోతాను’ అని అంటుంది కన్యక. ఆ తరవాత కన్యక తండ్రి రాజుతో మాట్లాడుతూ- తన కూతురు రాజు సొత్తే కదా అని పలికి రాజుని శాంతింపచేసే ప్రయత్నం చేస్తూ, కులధర్మం ప్రకారం అగ్ని సాక్షిగా కన్యకని పొంది తమ వాళ్ళని ఆదరించమని అభ్యర్థిస్తాడు. దానికి రాజు తాను చెప్పినదే ధర్మం అని, తాను తలచుకుంటే గాంధర్వ చేసుకోగలను కదా అని బదులిస్తాడు. ఈ రోజు, రేపు అని గడువు పెట్టకుండా పిల్లని ఇస్తే ఇయ్యి, లేకుంటే పో అని గదమాయిస్తాడు రాజు. ‘ముందు దైవ కార్యం, తరవాత కదా రాచకార్యం, మా ఇంటి కులదైవం అయిన వీరభద్రుడి గుడికి ఇప్పుడే వెళ్ళి దైవకార్యం నిర్వహించి వస్తాను’ అని అంటాడు కన్యక తండ్రి. ”సరే, నేను కూడా వస్తాను, గుడిలోనే అగ్నిసాక్షిగా కన్యకను స్వీకరిస్తాను” అని రాజు కన్యక కుటుంబంతో సహా గుడికి వెడతాడు. అక్కడ కన్యక తన కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నో ఉపదేశాలు, ఉద్బోధలూ చేస్తుంది. ఆ తరవాత ”నువ్వే కనక రాజువైతే నన్ను పట్టుకో” అంటూ సవాలు విసిరి మంటల్లోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది.
కేవలం కథ పరంగా చూస్తే పెద్దగా సంచలనం ఏమీ కనపడదు. సమాజంలో బలవంతుడైన ఒక దుష్టుడు చెరపడుతూంటే తలొగ్గలేక ఒక ఆడపిల్ల అగ్నికి ఆహుతి అవుతుంది. అది కథ సారం, ముగింపు. గురజాడ రాసిన కన్యక ఖండిక పైకి కనిపించే కథని మించిన సందేశాన్ని తెలుపుతుంది. రాజుకి, కన్యకకి మధ్య జరిగిన తొలి సంభాషణ తరవాత కథాగమనంలో కొంచె అస్పష్టత ఉంది. రాజుకి, కన్యకకి మధ్య జరిగిన సంభాషణకి సంబంధించిన వాక్యాల తరవాత వెంటనే అర్ధాంతరంగా కన్యక తండ్రికి, రాజుకి మధ్య సంభాషణ మొదలవుతుంది. ఇది గురజాడ కథాగమనంలో ప్రదర్శించిన శైలిలో భాగమా లేక, ఆయన రాసిన కవిత మూలంలో మనకి లభ్యం కాని చరణాలు ఉన్నాయా అన్నది పరిశోధించాలి. చెలామణీలో ఉన్న ప్రతి ప్రకారం చూస్తే కథ వేర్వేరు రోజుల్లో జరిగిందని అనుకోవాలి. ఈ కవితలో రాజు పేరుగానీ, కన్యక తండ్రి పేరుగానీ ప్రస్తావించడు గురజాడ. కథ కన్యక ప్రధానంగానే నడుస్తుంది, ముగుస్తుంది. మెటిల్డా లాంటి కథలో కూడా అన్ని పాత్రలకీ పేరు పెట్టకుండా కథని రసవత్తరంగా నడిపిస్తాడు గురజాడ. అది గురజాడ కథకి, కథనానికి, కాలానికి ఉన్న బలం.
కన్యక – పూర్ణమ్మ : సారూప్యత
బాలికల జీవితం ఆధారంగా గురజాడ రాసిన పూర్ణమ్మ, కన్యక ఖండికల్లో పెక్కు సారూప్యతలు కనిపిస్తాయి. రెండు కవితల్లోనూ బలవంతపు వివాహం నచ్చని ఆత్మగౌరవం గల బాలికలు నిరసనతో తనువు చాలిస్తారు. ఇద్దరు నాయికలూ తమ కాలానికి అతీతమైన తెగువ, సమయస్ఫూర్తి, వివేకం, పరిణతి కలిగి ఉంటారు. యువతుల్లో ఈ గుణాలు ఉండాలన్న ఆకాంక్షవల్ల కావచ్చు కన్యక, పూర్ణమ్మ పాత్రలను సృష్టించాడు గురజాడ.
కథ జరిగిన ప్రాంతాలకి, కవితల్లోని వర్ణనలకి కూడా రెండు కథలలోనూ పోలిక కనిపిస్తుంది. ఇద్దరు నాయికలూ కొలిచే దేవత దుర్గగానూ, వారు దర్శించే కోవెల ప్రాంగణంలో ఉండే కొలను, అందులోని కలువలు రెండు కవితల్లోనూ పోలిక కలిగి ఉంటాయి. ఈ రెండు కవితల్లోనూ ప్రస్తావించిన దుర్గ, శక్తి, స్త్రీ శక్తికి ప్రతీకాత్మక రూపాలుగా గురజాడ సృష్టించాడని అనుకోవచ్చు. తాను సందర్శించిన ప్రాంతాల్లో తాను సందర్శించిన దేవాలయాలను ఈ కవితల్లో చిత్రించే ప్రయత్నం చేశాడా గురజాడీ పరిశోధకులు తేల్చవలసిన అంశం ఇది.
కథా పరంగా చూస్తే, పూర్ణమ్మ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. వెనక్కి తిరిగి రాదు. పూర్ణమ్మ దుర్గను చేరిందని రాయడంద్వారా, ధ్వనిప్రాయంగా ఆమె ఆత్మాహుతి చేసుకుందని చదువరులు ఊహించేలా చెబుతాడు. బలవంతంగా పెళ్లి చేసుకోవాలన్న రాజు కోరికని తీర్చలేక అగ్నికి ఆహుతి అయిందని కథలో నేరుగా చెబుతాడు గురజాడ. రాజుని నేరుగా ఎదుర్కునేటప్పుడు పారిపోయే అవకాశం లేదు కాబట్టి గుళ్ళో జరుగుతున్న తంతులో అగ్నికి ఆహుతి అవడమే శరణ్యం కన్యకకి. అంతేగాక, ”నువ్వొక రాజువైతే, నన్నిపుడు పట్టుకో” అని సవాలు విసిరి అగ్నిలో దూకుతుంది కన్యక. ఎంత రాజయినా, కామంతో దహించుకుపోతున్నా, కన్య అగ్నిలో దూకుతోంటే ఆమెని కాపాడే ధైర్యం లేని అసమర్ధుడిగా చిత్రించడానికి అవసరమైన సన్నివేశం కల్పించి కవిగానే కాకుండా, ఒక దర్శకుడిలా ఆలోచించాడు గురజాడ.
కన్యకలో భాష : గురజాడ సృష్టించిన సాహిత్యానికి ప్రాణం పోసిన మరో ముఖ్య అంశం సంభాషణలు. పాత్రల మధ్య జరిగే సంభాషణలు సహజమైన ఉపమానాలతో, సముచిత, సందర్భోచిత భాషతో, పొందికైన పదాల వాడుకతో, వయ్యారంగా ఒదిగే వాక్య నిర్మాణంతో తన రచనలని దృశ్యకావ్యాలుగా రాయగల ప్రతిభ గురజాడది. కన్యక కవితలో ఈ ప్రతిభ మరీ బలీయంగా కనిపిస్తుంది. ఉదాహరణకి, తరటు (తరటు బంగరు), తొగల (తొగల కాంతులు -), నాల (… నాల నడుమను నట్టి వీధినిు), మట్టి (… మట్టి వచ్చిన దైవగతిుు), దిట్టతనము (- దిట్టతనమును బూని), నెట్ట, (… కన్నియ నెట్ట నిట్టు పలికెన్) లాంటి అంతగా వాడుకలో లేని పదాలను కవితని రసవత్తరంగా నడిపే క్రమంలో వాడడం; ‘పాలు పెరుగులు’, ‘పళ్లు పువ్వులు’, ‘రక్తగంధం’, ‘రక్తమాల్యం’ వంటి పదబంధాల వాడకం, ‘పళ్లెరం సాగించి’ అనే సొగసైన మాండలిక ప్రయోగం, కవితకి వన్నె తెచ్చేలా వాడారు గురజాడ.
గురజాడ సందేశం : కన్యక పాత్ర ద్వారా గురజాడ విస్తృత సమాజానికి గురజాడ ఇచ్చిన సందేశం బలీయమైనది. ”సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే డబ్బు, ఆస్తి ఉంటే చాలదు. చదువు, ధైర్యం, బుద్ధిబలం, అన్యాయాన్ని ఎదిరించడానికి, అవసరమైతే పోరాడడానికి భుజబలం, కలిగి ఉండాలి. అప్పుడే పాలకులకు ధీటుగా ఎదగగలరు” అన్న సామాజిక సత్యాన్ని 112 సంవత్సరాల క్రితం దుర్బల స్థితిలో ఉన్న ఒక బాలిక పాత్రద్వారా చెప్పిస్తాడు దార్శనికుడైన గురజాడ. మన బతుకు దెబ్బతినకుండా సాగాలంటే తలదించుకుని బతకాలనే మనస్తత్వం సమాజ శ్రేయస్సుకు, వ్యక్తి జీవిత గమనానికి అవరోధమని పరోక్షంగానైనా కన్యక పాత్ర ద్వారా బలంగా చెప్పాడు గురజాడ.
కన్యక ఖండిక నడచిన తీరు ఒక ఎత్తైతే, ప్రతీకాత్మకంగా రాసిన ఉపసంహారం మరో ఎత్తు. ప్రజలని నియమ, నిబద్ధతలతో ఏలవలసిన రాజు ప్రజాకంటకుడిగా మారితే ఏమవుతుందో కన్యక కవితకి ఉపసంహారం ద్వారా చెప్పాడు గురజాడ. ”రాజు గర్వం మట్టిగలిసింది; రాజు పతనానికి ప్రతీకగా కోట, పేటలు కూలి రాజ్యం నక్కలపాలయింది. ఎక్కడైతే కన్యక మానం కాపాడుకోవడం కోసం మంట కలిసిందో అక్కడ ఎత్తైన భవనం ఆవిర్భవించింది” అని చెప్పడం ద్వారా పాలకులు, రాజ్యాలు శాశ్వతం కాదని, వారు చేసే పని వల్ల మాత్రమే వారికి చరిత్రలో స్థానం ఉంటుందని, ఏనాటి పాలకులకైనా వర్తించేలా బోధనాత్మక సందేశం ఇచ్చాడు గురజాడ. కవులు, రచయితలు సమాజంలో జరిగే అమానుషాలని, అకృత్యాలని తమ రచనల ద్వారా ఎత్తిచూపాలని ధ్వనిప్రాయంగా చెప్పాడు.
(నవంబరు 30 : గురజాడ వర్థంతి)
– డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ