ప్రజలకు గుండెను చీల్చి
వీలునామాగ రాసిచ్చినవాడు
భయంభయంగా వున్న బాధితుల పక్షంగా
సడలని పిడికిలై భరోసానిచ్చినవాడు
చిక్కులు చుట్టుముడతాయనీ తెలిసినా
హక్కుల గర్జన చేసినవాడు
రెండుకాళ్లూ లేవు
ఏం చేయగలడన్న అహంకారం ముందు
సంకెళ్లను ధిక్కరించాడు
కటకటాల చీకటిలోకి నెట్టినా
అతడిలో ఉద్యమసూర్యుడు అస్తమించలేదు
నియంతల కుర్చీలకు
చరిత్రలో తావుంటదో లేదో
నీ చక్రాల కుర్చీ ఇపుడొక
చెరపలేని చారిత్రక గ్రంథం!
కోర్టులెందుకు… చట్టాలెందుకు…
దేశం నుదుటన డెమోక్రసీ లేబులెందుకు!?
ప్రశ్నలే విజ్ఞానమన్న మట్టి మీద
ప్రశ్నలు వేసిన గొంతుకీ ఆటంకాలెందుకు!?
దొంగచాటు యుద్ధమే ఓటమి
ప్రశ్నకు దీటుగ సమాధానమీయటమే గెలుపు
అవతల గొంతు పెగలనపుడే
దివ్యాంగుడు దివ్య పురుషుడైనాడు!
అతడు మరణించలేదు
విప్లవగాలిలో పరివ్యాప్తమయ్యాడు
అన్యాయ నిరసనగా
నిలబడ్డ ఏ రాస్తారోకోలోనైనా
అతడు దిక్సూచీగా సడి చేస్తూనే వుంటాడు
అతడు అడవిలోని వాడు కాదు
ఊరిలో నగరాల్లో హృదయాల్లో
ఏపుగా విస్తరించిన మోదుగు చెట్టు
కాలమైనా కూలిపోతుందేమోగానీ
అతడు కూలిపోడు
అతడికి మరణం లేదు!
– మెట్టా నాగేశ్వరరావు