నిలదీయకపోతే మాట్లాడనిస్తారా?

Apr 1,2024 08:24

‘భూమిని మాట్లాడనివ్వండి’ అంటున్నాడు కవి. ‘మాట్లాడనివ్వండి అని ప్రాధేయపడుతున్నాడా? ప్రాధేయపడటం కవి చెయ్యాల్సిన పని కాదని స్పష్టంగా తెలిసిన కవి రాసిన కవిత్వమిది. భూమి తరుపున రాజ్యాన్ని నిలదీస్తున్నాడీ కవి. కొంచెం నిదానంగా ఆలోచిస్తే ‘భూమిని’ నేను, నన్ను ‘మాట్లాడ నివ్వండి’ అన్నట్టు లేదూ? ఎస్‌.. నాకూ అదే అనిపిస్తుంది. ”పాలకులారా.. నా పెదాలు కుట్టీ నా గొంతు మీద ఉక్కుపాదం మోపి నన్నెంతకాలం ఇలా మాడ్లాడనివ్వకుండా చేస్తారు? నన్ను మాట్లాడ నివ్వండి” అని భూమి నిలదీస్తున్న దృశ్యం కనిపిస్తుంది పాఠకులకు. నిలదీస్తున్నది భూమి కావొచ్చు, లేదా కవి కావొచ్చు… చూడాల్సింది సందర్భం.
ఈ మాటలు రాస్తున్న సమయానికి ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన వార్త, ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం గురించిన వార్త వ్యాఖ్యలు నడుస్తున్న సందర్భం. ఒక ప్రధాన ప్రత్యర్థి రాజకీయ పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసి వారి ఎన్నికల ప్రచార కార్యకలాపాలు సజావుగా సాగకుండా చేసి తాము అధికార పీఠాన్ని కైవసం చేసుకునే కుట్రలు చేస్తూ భూమిని మాట్లాడనీయకుండా రాజ్యం కుట్రలు చేస్తున్న దుర్మార్గపు సందర్భం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రజా సమూహాలు నిలదీస్తున్న అత్యంత కీలకమైన సందర్భం.
భూమి అంటే ప్రజలని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భూమిని మాట్లాడనివ్వాలని కవి నిలదీస్తున్నాడంటే ప్రజా సమూహాల గోడు వినమని. ఈ దేశాన్ని వెనకటి కాలంలోకి మళ్ళించడం కాదు ముందుకు తీసుకెళ్ళమని, ప్రశ్నించే గొంతుల్ని అణచివేయడం కాదు, భూమిని మాట్లాడనివ్వమని. ఈ పుస్తకంలోని ప్రతి పదమూ ఒక నిప్పురవ్వ. ప్రతి వాక్యమూ జ్వలించి నిలదీసే ప్రశ్న.
ఈ కవి వర్మ ముఖంలో ఎంత ప్రశాంతత గోచరిస్తుందో పుస్తకమూ అలాగే కనిపిస్తాది కానీ …పేజీలు తిప్పితే కల్లోలభరితమైన ఆయన అంతరంగంలా లోపలి కవిత్వం గుండెను మండిస్తుంది. కుదురుగా ఉండనివ్వక ఆలోచనలో పడేలా చేస్తుంది. కవిత్వం చెయ్యాల్సిన పని ఇదే కదా!
లోపల్లోపల అంత మథనపడే ఆ మనిషి వదనంలో ఆ ప్రశాంతమైన చిరునవ్వు ఎలా సాధ్యం? నాకు మా నాగావళి గుర్తుకొచ్చింది. నది ఒడ్డున నిలబడి చూస్తే అసలు నీరు కదలనట్టు, ప్రశాంతంగా నిశ్చలంగా వెలుగు పడి తళతళా మెరుస్తూ కనిపించే ‘తెమ్మ’ జ్ఞాపకానికొచ్చింది. ఎదలో సుడిగుండాల్ని దాచుకోవడమెంత కష్డమో కదా.. అలా సుడిరేగిన అలలజడి ఈ పుస్తకంలోని కవితలని నాకు అవగత మయ్యింది. వర్మ లో మా నాగావళి నదిని చూసేను.
‘ఒక జీవితకాలపు నెత్తురూ చెమటతో కట్టుకున్న కలల గూడును కూల్చే’ కర్కశ పాదాలను ఖండించే కత్తులుగా వాక్యాలను నిర్మించగలగడం మిత్రుడు వర్మ ప్రత్యేకత. ‘దేశాల మధ్య అయినా, ఇరు మనసుల మధ్య అయినా యుద్ధం దేనినీ మిగల్చదని’ తెలిసిన వాడు కాబట్టే యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నిజమే… ఈ కవి అంటున్నట్టు ‘ఊరంతా పికాసో చిత్రంలా అర్థం కాని ఓ భయానక దృశ్యంగా మారి నిదరనెత్తుకెళ్ళిన రాత్రి’ కదా యుద్ధమంటే ..!
‘కాళ్ళకు సంకెళ్ళు వేయగలవేమో గానీ కలలకు కాదు’ కదా,’, ‘నిరంతరమూ ‘ఖైదులోనూ, జనం మధ్యా ఉండే వారి ‘ఊహలు అనంతం’ .. వారి ‘స్వప్నం మరో ప్రపంచం.’ ‘దాహమంటూ గ్లాసుడు నీళ్ళు తాగితే కొట్టి కొట్టి చంపిన అపర బ్రహ్మలున్న చోట’ కులమొక్కటే, మతమొక్కటే అనీ, ‘ఏక్‌ భారత్‌, శ్రేష్టభారత్‌ అనే మర్మాల మరశబ్దాల నడుమ నీదీ నాదీ కాని దేశం కదా ఇది’ అని అనుకోకుండా ఉండలేం కదా! ‘న్యాయానికి గంతలు కట్టి, న్యాయమూర్తుల గుండెలపై ఉక్కుపాదం మోపి తీర్పులను తిరగరాయించే’ మహానేతలను హెచ్చరిస్తూ ‘చీకటిని తెరిచే ఉషోదయమొకటి వేచివుందని కబీరన్న మాట గుర్తుచేస్తున్నాడీ కవి. ”ప్రశ్నలు జైళ్ళలో బంధించ బడ్డాయి, నదులజాడలు చెరిగిపోతున్నాయి, అడవి ఒంటరి ఆకాశమయింది” అంటూ ఇలాటప్పుడే ‘మరల గోడలు మాటాడాల’ని, ‘నెత్తురంటిన వాక్యం నినాదంగా రాయబడాల’ని ఎలుగెత్తి చాటుతున్న ఈ మిత్రుడ్ని ఎదకు హత్తుకోకుండా ఎలా వుండగలం?
”ఆ తల్లుల దేహ మాన ప్రాణాలను నగంగా ఊరేగించి భయపెట్టజూస్తున్న వాడి” మీద, ”నేల లేని వారి పాదాలు ఎటూ పారిపోలేవని, నిస్సంకోచంగా విరుచుకుపడుతున్న వాడి” మీద అక్షరాల్ని బాంబులు చేసి విసిరక తప్పదనే ఆగ్రహం వ్యక్తం చేస్తన్నాడంటే కవి అత్యంత సున్నిత మనస్కుడు కావడం వల్లనే. అతడు గొంతెత్తి గానం చేస్తుంటే నేలతల్లి పులకించి పోయేది, అరణ్యం నెత్తుటి చిగురులేస్తది, సముద్రం అలలహౌరెత్తేది”, .తన చేతుల పొత్తిళ్ళలో అమరులంతా అరుణతారలైపోయేవారు, నెత్తుటి పుటలంచులనుండి జారి చివరాఖరికి మబ్బుల వెనక దాగి పోయినాడు.. పాట మాత్రం ఇంకా టేప్‌ రికార్డులో తిరుగుతూ పోరు హౌరులో కలగలిసిపోయింది అని ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ స్మ ృతిలో రాసిన కవిత చదువుతుంటే ఆ మాహా గాయకుడి గొంతు చెవుల్లో హోరెత్తుతున్నట్టే ఉంటుంది.
అక్షరాలు దిద్దించి బతుకుల్ని చక్కదిద్దాల్సిన టీచరమ్మ, కుల, మత, జాతి విద్వేషాలకు దూరంగా విద్యగరపాల్సిన ఒక టీచరమ్మ మతోన్మాదం తలకెక్కి ఒకానొక ముస్లిమ్‌ విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వార్తకు చలించిపోయిన కవి మృదయ స్పందన చూడండి,
”రోజూ హత్తుకుని ఆటలాడుకుంటూ ఒకరికొకరం భుజాలపై చేతులేసుకుని గంతులేసే మా మధ్య గోడలు కట్టే ఈ తృప్తి త్యాగి టీచరమ్మలు మొలుచుకొచ్చి మా దేహానికి మా మనసుల్లోకి రాని మత మృగాన్ని మేల్కలిపి తరగతి గదిలో సరిహద్దు రేఖలు గీస్తూ హుకుం జారీచేస్తున్నారు” అని తీవ్రంగా చలించిపోతాడీ కవి. నాయకత్వానికి జేకొట్టి మెప్పు పొందే పనిలో బహుశా నిమగమై ఉంటుందా టీచరమ్మ. టీచర్లే ఇలావుంటే దేశం తగలబడకుండా వుంటుందా? అనే కవి వేదన మనవేదన కూడా కదా.
ఇందులోని ప్రతి కవితా జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై ప్రకటిస్తున్న యుద్ధనినాదమే! ప్రతి వాక్యమూ ఒక రణన్నినాదమే! సమకాలీన సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకూ స్పందించి కవితగట్టే ఈ కవి హృదయావిష్కరణే ఈ ”భూమిని మాట్లాడనివ్వు” ప్రతి కవితా ఉదహరించదగ్గదే! ఈ పుస్తకం కొని చదివి ఎవరికి వారు అనుభూతి చెందాల్సిందే!
నిజమే… ‘భూమిని మాట్లాడనివ్వమని’ డిమాండ్‌ చేస్తున్న ఈ కవిత్వం, లేదూ ‘భూమి తనని వినమని’ నిలదీస్తున్న ఈ కవిత్వం ఇప్పటి సామాజిక అవసరం. సరైన సమయంలో సరైన ప్రతిస్పందన. వర్మ కవిత్వంలో శ్రావణమాసపు నాగావళి ఉరవడి ఉంది. నాగావళి కెరటాలై ఎదురయ్యే ప్రశ్నలున్నాయి. ఒక్కో సందర్భంలో వరదై ముంచెత్తే ఆగ్రహ ప్రకటనలున్నాయి. ఈ సమయంలో సంయమనంతోనూ, నిగ్రహంతోనూ కూడిన ఇలాటి ఆగ్రహ కవిత్వ ప్రకటనల్లేకపోతే భూమిని మాట్లాడనిస్తారా భూ బకాసురులు?
ఇంత మంచి కవిత్వాన్ని కానుక చేసిన మిత్రుడు వర్మకు అభినందనలు. కవిమిత్రులు ప్రసాదమూర్తి, కుప్పిలి పద్మల ఆలోచింప చేసే ముందు మాటలతో వచ్చిన 107 పేజీల ఈ కవితాసంపుటికి అరుణాంక్‌ లత గారి కవర్‌ డిజైన్‌ అదనపు ఆకర్షణ. రు.120 ల వెలతో ‘అనేక’ (విజయవాడ), ఇతర అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. లేదా కవి మొబైల్‌ నెంబరు 94934 36277లో సంప్రదించి, పొందొచ్చు.
ా గంటేడ గౌరునాయుడు

➡️