యుద్ధం మొదలుపెట్టిన చోటే
తిరిగి ప్రారంభమైంది
అక్కడ.. క్షణాలు దిగులుగా
నిట్టూర్పులు రోదనలుగా మారి
విషాదం కళ్ళ లోంచి
భయ ప్రకంపనల్ని పుట్టిస్తున్నాయి
ఇప్పుడక్కడ ఎవరు చెవిపెట్టి ఆనించినా
అలసిన గుండెల్లో ప్రతిధ్వనించేవి
భీకర వైమానిక దాడులే!
చూపును కదిపి చూస్తే
కాలం కూడా యుద్ధం చేస్తోంది
పేలుతున్న క్షణాల మధ్య
పాలస్తీనా ఇప్పుడు ఓ మండుతున్న అగ్నిగోళం
ఓటమికి తల వొంచి
ఉప్పొంగుతున్న రక్తపు మడుగుల్లో
చరిత్ర పాత కథనే తిరగ రాస్తోంది!
ప్రాంతం ఎవరిదైనా
దురాక్రమణ మాత్రం దౌర్జన్యంగా మారింది
నెపం ఎవరి మీదకు నెట్టాలో తెలీడం లేదు
క్షతగాత్రుల సమూహాలూ
కంపు కొడుతున్న మృతకళేబరాలూ
దాడి పేరుతో రోజుకొక విధ్వంసాన్ని సృష్టిస్తుంటే,
చీకటి బతుకుల మీద విధి
సరికొత్త తలరాతల్ని రాస్తోంది!
మనిషి ప్రాణానికి మానానికి
విలువలేని ఈ లోకంలో
మరణానికి గుర్తింపు ఎక్కడుంది?
పసికందులైనా మహిళలైనా
హత్యలైనా అత్యాచారాలైనా
యాంత్రిక దృశ్యంలోంచి
అక్కడ ఓ నిత్యకృత్యమైపోయింది
మాదక ద్రవ్యాల నిషాలో తూలి తేలుతున్న యువత
మత్తుకు బానిసల్ని చేస్తూ ఛిద్రమౌతున్న భవిత
మనసు కరిగి నీరై వరదై
కంటి తుడుపుగా మారిపోయింది
గాజా
పాలస్తీనాలో ఓ అంతర్భాగం
సజీవ నెత్తుటి ప్రతిబింబం
నాటో అమెరికాలతో
శవ రాజకీయం చేస్తున్న మూల శక్తుల్ని అడగాలి
పాలస్తీనా లెబనాన్ జోర్డాన్ సిరియా
దేశమేదైతేనేం?
అప్పటికీ ఇప్పటికీ చరిత్ర ముఖచిత్రం ఒకటే!
నేలపై ఆధిపత్యం భూ స్థావరాల్ని
భస్మీపటలం చేస్తుంటే,
వర్తమానంలోంచి చరిత్ర వలసపోతోంది
స్వేచ్ఛలేని పీడ కలల మధ్య
భవిష్యత్తు ముఖచిత్రం
క్షణక్షణానికీ మారిపోతుంటే,
విస్తుపోయి చూస్తున్న లోకం
భయం భయంగా కాలాన్ని వెళ్ళదీస్తోంది
రెప్పల ఊటలోంచి
నెత్తుటి తడి ఆరని దృశ్యం
దిష్టిబొమ్మలా చోద్యం చూస్తూ
ప్రత్యక్ష మౌనసాక్షిగా
నిలిచిపోయింది కాలం!
– మానాపురం రాజా చంద్రశేఖర్
77940 39813