న్యూఢిల్లీ : ప్రముఖ హిందీ కవి వినోద్ కుమార్ శుక్లాను ప్రతిష్టాత్మక 59వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు వరించింది. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ అవార్డును గెలుచుకున్న తొలి కవిగా 88 ఏళ్ల వినోద్ కుమార్ శుక్లా రికార్డులకెక్కారు. ఈ అవార్డును అందుకుంటున్న 12వ హిందీ కవిగా నిలిచారు. ఈ అవార్డు కింద రూ.11 లక్షల నగదు, సరస్వతి దేవీ కాంస్య విగ్రహం, ఒక ప్రశంసా పత్రం అందజేస్తారు. ప్రముఖ కథకురాలు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభా రే నేతృత్వంలో జరిగిన అవార్డు ఎంపిక కమిటీ సమావేశంలో వినోద్ కుమార్ శుక్లా పేరును ఖరారు చేశారు. ‘ఛత్తీస్‌గఢ్ నుండి ఈ అవార్డును అందుకున్న మొదటి రచయిత వినోద్ కుమార్ శుక్లా. హిందీ సాహిత్యం, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలికి శుక్లా చేసిన అద్భుతమైన కృషికి గాను ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు’ అని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతీ థి’ పుస్తకానికి 1999లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును శుక్లా అందుకున్నారు. ‘నౌకర్ కి కమీజ్’ (1979), ‘సబ్ కుచ్ హోనా బచా రహేగా’ (1992) వంటి రచనలు గుర్తింపు తెచ్చాయి. తనకు ఇలాంటి గుర్తింపు లభిస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటూ శుక్లా ఆనందం వ్యక్తం చేశారు.
