ఆరుద్ర బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన విలక్షణమైన రచనలతో ప్రసిద్ధులయ్యారు. తెలుగులో ఇంచుమించు అన్ని ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆయనిది చాలా పాపులర్ రచనా శైలి. ఏది రాసినా ఆసక్తికరంగా రాస్తారు. చమత్కారం, వ్యంగం, హాస్యం కలగలసిపోయి ఉండే ఆరుద్ర రచనాశైలి ఒక విచిత్రమైన అనుభూతిని పాఠకుడికి కలిగిస్తుంది. ఇది ఆరుద్ర శతజయంతి సంవత్సరం. ఆధునిక తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ రచయితలలో ఆరుద్ర ఒకరు. కవిత్వం, సినిమా పాటలు, పద్యాలు, శుద్ధ మధ్యక్కరలు లాంటి ప్రక్రియలతో పాటు కూనలమ్మ పదాల వరకూ ఆరుద్ర తనదైన ముద్ర వేశారు. అన్నింటికీ మించి తెలుగు సాహిత్య చరిత్రను ఒంటిచేత్తో పరిశోధించి ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ 13 సంపుటాల రచనతో సంచలనం కలిగించారు. ఈ సంపుటాలు తెలుగు సాహిత్య విద్యార్థులకు కరదీపికగా మారాయి. సరళమైన భాషతో, ఆసక్తికరమైన రచనా శైలితో సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర ఆరుద్రకు ఎంతో కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చాయి. సాహితీస్రవంతి ఆరుద్ర శతజయంతి సందర్భంగా వివిధ పట్టణాల్లో ఉత్సవాలను నిర్వహించ తలపెట్టింది. ఆరుద్ర విలువైన రచనల నుంచి కొన్నింటిని చిరు పుస్తకాలుగా ప్రచురించి తెలుగు పాఠకులకు అందించాలని నిర్ణయించింది.
అందులో భాగంగా తొలిగా ‘కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు’ పేరిట ఆరుద్ర రాసిన చిన్న వ్యాసాన్ని చిరు పుస్తకంగా జాషువా సాంస్కృతిక వేదిక, విజయవాడ పాక్షిక ఆర్థిక సహకారంతో సాహితీస్రవంతి ప్రచురించింది. కథలు రాయాలనే ఆసక్తి గల ఔత్సాహిక రచయితల నుద్దేశించి విలువైన సూచనలతో చమత్కారంగా ఈ వ్యాసం ఆరుద్ర రాశారు. కథలు రాయడంపై ఆసక్తి కలిగించే ఈ వ్యాసాన్ని అందమైన బాపు బొమ్మలతో ‘రచన’లో తొలిసారిగా ప్రచురితమైంది. ప్రసిద్ధ చిత్రకారుడు బాపు అంటే ఆరుద్రకు చాలా ఇష్టం.
‘కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మ’ అని బాపుపై ఆరుద్ర రాసిన వాక్యాలు ‘బాపు’ పై ఆరుద్ర అభిమానాన్ని చాటుతాయి. ఆరుద్ర, బాపు ఇద్దరూ కలిసి కథల రాయడం గురించి పాఠాలు చెబుతున్నట్లు ఉంటుంది ఈ పుస్తకం. ఆరుద్ర రాత, బాపు గీతల మేలుకలయిక ఈ చిరు పుస్తకానికి ఎంతో విలువను చేకూర్చింది. ఈ పుస్తకంలోని కథల చిట్కాలు పాఠకులలో కథారచన పట్ల ఆసక్తిని కలిగించడమే కాదు, కథా నిర్మాణం పట్ల అవగాహనను కూడా పెంచుతాయి. ముఖ్యంగా కొత్తగా రాసేవారికి చాలా విలువైన చిట్కాలు అందించారు ఆరుద్ర ఈ పుస్తకంలో. ”కథ రాయాలంటే ఏం కావాలి? కథే కావాలి. చెప్పడానికేం లేకపోతే చెప్పేం ప్రయోజనం. కొంత మంది గొప్ప కథకులు ఏం లేకపోయినా గొప్ప గొప్పగా చెప్పేస్తారు. వాళ్ళు ఏమిటి వ్రాశారని కాదు. ఎలా వ్రాశారని మనం చదువుతాం. వాళ్ళలాగా చెయ్యి తిరిగాక అలా మీరూ రాయొచ్చుగాని ప్రస్తుతం కథ ఉన్న కథలే రాయండి” అంటారు ఆరుద్ర.
ఈ చిరు పుస్తకంలో ఆరుద్ర పాఠకుడితో సంభాషిస్తున్నట్లే ఉంటుంది. కథ ఎలా రాయాలో వివరిస్తూనే పాఠకుడి కళ్ళముందే చక్కటి కథను అల్లేసి అబ్బురపరుస్తారు. అంతేగాక వివరిస్తున్న కథను పూర్తిచేయకుండా ‘నాకు ముగింపు నచ్చలేదు. ఈ వ్యాసం ముగిసేలోపు మీరు మంచి ముగింపును ఆలోచించి నాకు చెప్పండి’ అని చమత్కారంగా పాఠకుడికి పని పెడుతూ ఆ కథలో భాగస్వామిని చేస్తారు. ఈ వ్యాసం చదివిన పాఠకుడికి కథ రాయడం ఇంత తేలికా అనిపిస్తుంది. కానీ మంచి కథలు రాయడం అంత తేలిక కాదు అనే హెచ్చరిక కూడా ఆరుద్ర చేస్తారు. అయితే మీకు బాగా రాయడం వచ్చాక అప్పుడు గొప్పకథలు రాద్దురు గాని ప్రస్తుతం మాత్రం ఇలాంటి కథలు రాసేయండని భుజం తడతారు ఆరుద్ర.
సాహితీస్రవంతి 2013లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘కథనశాల’ పేరుతో కథల వర్క్‌షాప్ నిర్వహించింది. అప్పుడు తొలిసారిగా ఈ పుస్తకాన్ని ఆ వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి కానుకగా అందజేసింది. ఆ ‘కథనశాల’ విశేషాలతో సాహిత్య ప్రస్థానం మాసపత్రిక ‘కథనశాల’ పేరుతో ప్రత్యేక సంచిక వెలువరించింది. కొత్త కథకులకు, ఔత్సాహికులకు ఆ ప్రత్యేక సంచిక కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ‘కథనశాల’కు ఈ వ్యాసం, ‘బాపు’ బొమ్మలతో సహా అనుబంధంగా చేర్చడం జరిగింది. ఆరుద్ర గారి ఈ చిరుపుస్తకంలో చివర ప్రసిద్ధ కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్యం, చలం, చాసో, కొకు, బుచ్చిబాబు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, పాలగుమ్మి పద్మరాజు వంటి ప్రసిద్ధ కథకులు ‘కథ’ల గురించి చెప్పిన కొన్ని విలువైన అభిప్రాయాలు కూడా అనుబంధంగా ఉన్నాయి.
‘కథానిక అంటే మళ్లీ మళ్లీ చదివించే వచన ఖండకావ్యం. వెనక నుంచి సముద్రం హోరు వినిపిస్తూ చూడ్డానికి మాత్రం కెరటంలా కన్పించేది’ – బుచ్చిబాబు
ఈ పుస్తకానికి అనుబంధంగా ఇచ్చిన ఇటువంటి కథా నిర్మాణ సూత్రాలు కొత్తగా కథలు రాయాలనుకునే వారికి కథాజ్ఞానాన్ని అందిస్తాయి. కొత్తగా కథలు రాయాలనుకునే వారికి ఈ చిరుపుస్తకం ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజాశక్తి బుకహేౌస్ షాపుల్లో ఈ చిరుపుస్తకం లభిస్తుంది.
– వొరప్రసాద్
94900 99059