మాట్లాడదాం.. రండి!

Aug 19,2024 05:40 #aksharam, #sahityam

కన్నడ భాషలో హడు అంటే పాడమని, మాతాడు అంటే మాట్లాడమని అర్థం. అసలేం పాడాలి? ఏం మాట్లాడాలి? ఇవాల్టి ప్రశ్న. సుప్రసిద్ధ భారతీయ నడుటు ప్రకాశ్‌రాజ్‌ ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటున్న విషయం అందరికీ తెలుసు. సాహిత్యకారులు ఏమడగాలి? ఏమని ప్రశ్నించాలి? అన్నదే ఇటీవల కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో జరగిన పండుగ. నిజానికి ఇది పండుగ కాదు; నిర్వాహకులు సాంస్క ృతిక కళా, సంగీత ప్రదర్శనలు నిర్వహించిన పండుగ వాతావరణం సృష్టించినంత మాత్రానా ఇది పండుగ కాదు. ఇది ఆందోళన. దేశం గురించి ప్రతి పౌరుడూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని పాడుతూ, మాట్లాడుతూ సాగిన ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక. ఎవరిచ్చారు ఈ ప్రణాళిక అని అనవచ్చు. ఎవరికి వారు వారి వారి మస్తిష్కంలో జొప్పించిన ప్రగతిశీల భావోద్రేకం. వర్తమాన ప్రపంచంలో మనం అనుసరించాల్సిన భావోద్రేక ప్రణాళిక. దేశం సర్వనాశనమయ్యేందుకు కారణమెవరో ఈ పండుగ తేల్చి చెప్పగలిగింది. దేశవ్యాప్తంగా ప్రగతిశీల సాహిత్యకారులను ఒకచోట చేర్చగలిగింది. నిర్వాహకులు ఫలానా భావజాలం, ఫలానా కార్పొరేట్‌, ఫలానా కులం, ఫలానా మతం అని అథమ స్థాయిలో ఆలోచించే సాహిత్య కారుకూతలు కూసే వాళ్ళనోళ్ళు మూయించగలిగారు. అందరికీ అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు. వాళ్ళేం ప్రముఖులు కాదు కదా వాళ్ళనెందుకు ఆహ్వానించారు? వీళ్ళనెందుకు వక్తలుగా పిలిచారు అనే చర్చలు ఇప్పుడు తెలుగు కవులు చేస్తున్నారు. అదిప్పుడు అనవసర చర్చ. కారణమేమంటే నిర్వాహకులు కన్నడీగులు. ద్రవిడభాషా కవులతో వాళ్ళకున్న పరిచయాల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆహ్వానించి వుండవచ్చు. కానీ వాళ్ళు చేసిన గొప్ప పని మాత్రం ఈ దేశంలో ఉన్మాద శక్తులెలా దేశ ప్రజల మధ్య కులం పేరుతో మతం పేరుతో ఎలా చీల్చి గత ఆంగ్లేయుల పాలన మాదిరి విభజించు పాలించు సిద్ధాంతాన్ని వర్తమాన కాలంలో అమలు చేస్తున్నారో చెప్పగలిగారు. అది కూడా వాళ్ళే చేయలేదు. మనకే వేదికలిచ్చి మిమ్మల్ని మీరు చర్చంచుకోండన్నారు. ఆ వేదికలకు మంటప, మథన, అంగల వంటి పేర్లు పెట్టి, సభలను నిర్వహించారు.
ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన కన్నడ తమిళ, మలయాళ, తెలుగు భాషలకు చెందిన కవులు, రచయితలు, అనువాదకులు ఏ భాషకాభాష, ఏ సమయానికి ఆ సభ క్రమశిక్షణగా నిబద్దతగా సాగాయి.
ఈ నెల 9, 10, 11వ తేదీల్లో జరిగిన బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌-2024 సోల్‌ ఆఫ్‌ సౌత్‌ పేరుతో బెంగళూరు నగరంలోని కోరుమంగల్‌ ప్రాంతంలోని సెయింట్‌ జాన్స్‌ ఆడిటోరియం వేదికయ్యింది. ఈ సభలకు ఆంగ్లం వారథిగా మారింది. రొటీన్‌గా జరిగే సాహిత్య కార్యక్రమాల్లాగా కాకుండా భిన్నంగా కొనసాగడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ సాహిత్య పండుగ వ్యవహరంపై సామాజిక మాధ్యమాలోనూ, పత్రికల్లోనూ చర్చలు మొదలయ్యాయి.

అసలు ఉద్దేశ్యం ఏమిటి?
మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో చర్చకు ఎక్కువ అవకాశం ఇచ్చారు. ప్రారంభ సెషన్‌లో కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ సాహిత్యాల్లో పేరెన్నికగల రచయితలు మాట్లాడారు. వారికి నిర్ధేశించిన అంశాలపై చర్చావేదిక తరహాలో ప్రసంగించారు. తెలుగు నుంచి ప్రముఖ రచయిత్రి ఓల్గా ‘తెలుగు అనువాదాలు – కొత్త వొరవడి’ అన్న అంశంపై ఆంగ్లంలో ప్రసంగించారు. తెలుగు అనువాదాల్లోని సంక్లిష్టతల్ని పరిశోధనాత్మకంగా వివరించారు. ఇతరత్రా కవులు వారి వారి భాషల్లో ఇచ్చిన అంశాలపై లోతుగానే చర్చించారు. ప్రగతిశీల రచయితలు పెరుమాళ్‌ మురుగన్‌, వసుధేంద్ర, జయమోహన్‌, సచ్చిదానందన్‌, సుప్రసిద్ధ సినీదర్శకులు గిరీష్‌ కాసరవెళ్లి తదితరులు హాజరయ్యారు. వీరంతా తమ ప్రసంగాల్లో ఉమ్మడి శత్రువును సృజనకారుల ముందు బాహాటంగా నిలబెట్టగలిగారు.

ప్రకాష్‌రాజ్‌ ఏం చెప్పాడు!
‘భాషె బేరెయాదరూ భావ వొందే’ భాష వేరైనా అనుభూతి వొక్కటే – అనే శీర్షికలో ప్రసిద్ధ నటుడు ప్రకాష్‌రాజ్‌ పాల్గొని, 43 నిమిషాలు మాట్లాడారు. ఆ ప్రసంగం విన్నాక ఆయన మీద ఉన్న గౌరవం రెట్టింపు అయ్యింది. అందులో ముఖ్యమైన అంశాలు కొన్ని :
1. అసమానత్వం, కుల వ్యవస్థ వంటివి మనం కట్టుకున్న అదృశ్య గోడలు. అవి సామరస్య జీవనానికి అడ్డంకులు. అలాంటి గోడలను కూల్చివేసి వంతెనలు నిర్మించాలి.
2. ఇక్కడి పేదలు విదేశీ అతిథులకు కనపడకూడదని దేశంలోనే ప్రహరీగోడకు ఇరువైపులా గోడ కట్టిన ఘటన మన కళ్ల ముందే ఉంది. మరోవైపు కనిపించని గోడలు చాలా ఉన్నాయి. యుద్ధం, అసమానత వంటి గోడలు కట్టడం మన స్వీయ గాయాలు. గోడ వేర్పాటుకు చిహ్నమైతే, వంతెన అనుసంధానానికి చిహ్నం. నిర్మించాలనుకుంటే వారథిని మనమే కట్టుకుందాం.
3. బెంగళూరులో సమస్యలు ఉండవచ్చు కానీ పిల్లలకు కన్నడం నేర్పాలంటే రాజకీయ సంకల్పం కావాలి.
4. ఎన్నో భాషలు వచ్చినా సెంటిమెంట్‌ ఒకటే. లిపి, పదాలు వేరైనప్పటికీ, భాష మనిషి యొక్క అనుభూతిని కలిగి ఉంటుంది. అసమానత, అన్యాయాల ప్రపంచాన్ని మార్చడానికి మనమందరం భాషలు వేరైనా భావం ఒక్కటే! కాబట్టి ఐక్యమవ్వాలి.
5. కువెంపు రచించిన ‘విశ్వ మానవన సందేశం’ విప్లవం విశ్వవ్యాప్తం కావడమే! హద్దులు దాటి మానవీయ విలువలను పెంపొందించాలి. మన మధ్య నిర్దిష్ట రాజకీయ భావజాలం లేకపోవొచ్చు కానీ, సామాజిక సామరస్యం మాత్రం ఉంది.
6. భాషను పోరాటానికి ఆయుధంగా ఉపయోగించకూడదు. భాషను వారథిగా ఉపయోగించడం ద్వారా మన గుర్తింపును మనం కాపాడుకోవచ్చు. నేను ఇప్పుడు బహుళ భాషలు మాట్లాడగలను. నా కన్నడ మూలమే కారణం. చిన్న పిల్లలకు కన్నడ నేర్పడం అంటే వ్యాకరణాన్ని బోధించడం మాత్రమే కాదు.
7. దేశం సంక్లిష్టతల్ని ఎదుర్కొంటుంది. సమస్యల్ని ఎదుర్కొంటుంది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు అధికారంలో ఉన్నాయి. దేశంలో ఒకరకంగా మనుగడే ప్రశ్నార్ధకంగా మారిన స్థితిలో మనమున్నాం. మనకు కావాల్సింది యుద్ధాలు కాదు.. మనకు కావాల్సింది శాంతి.. సామాన్యులకు స్థితివంతమైన స్వేచ్ఛా జీవితం. ఇవన్నీ లేకపోతే మాట్లాడొద్దా మనం? రండి మాట్లాడండి.. రండి పాడండి..
కన్నడ కవి కువెంపు, మహాకవి శ్రీశ్రీ, బసవేశ్వరుడు, తమిళ, మలయాళ కవుల కవితలతో పాటు పాలస్తీనా కవుల కవితలనూ ప్రకాశ్‌ రాజ్‌ తన ప్రసంగంలో వినిపించారు. నటుడిగా మనకు కనిపించే ప్రకాశ్‌రాజ్‌ గొప్ప మేధావిగా దేశం నలుమూలల నుంచి వచ్చిన సాహిత్యకారుల నడుమ ఆవిష్కరింపబడ్డారు.

ఎవరెవరు హాజరయ్యారు?
ఈ సభలకు తెలుగు రాష్ట్రాల నుంచి సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‌ మృణాళిని, కుప్పిలి పద్మ, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌, కథారచయితలు వేంపల్లి షరీఫ్‌, మహమ్మద్‌ ఖదీర్‌బాబు, ప్రముఖ దళిత స్త్రీవాద కవులు జూపాక సుభద్ర, ఎంఎం వినోదిని, ఎండ్లూరి మానస, చల్లపల్లి స్వరూపరాణి, ప్రముఖ అనువాద రచయితలు కాత్యాయినీ, అవినేని భాస్కర్‌, పూర్ణిమ తమ్మిరెడ్డి, దూర్జటి వెంకట శుభశ్రీ, కెఎన్‌ మల్లీశ్వరి, పి.జ్యోతి, అక్కినేని కుటుంబరావు, గోగు శ్యామల, మల్లిపురం జగదీశ్‌, రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌, వివిన మూర్తి, పుస్తక ప్రచురణ సంస్థ ఛాయా నుంచి ఎడిటర్‌ అరుణాంక్‌ లత తదితరులు హాజరయ్యారు. అనేక అనేకమంది తెలుగు కవులూ రచయితలూ ఈ సభల్లో పాల్గొని, ప్రసంగాలను విన్నారు. వివిధ ప్రాంతాల రచయితలతో ముచ్చటించారు.

తెలుగు సాహిత్యంలో ఏం చర్చించారు?
మూడు రోజులూ ఉదయం 9 నుంచి ప్రారంభమైన సభలు, రాత్రి 8 వరకు సాగాయి. ద్రావిడభాషల్లో అనేక అంశాలపై ఆయా భాషా సాహిత్య ప్రముఖులతో చర్చలు జరిపారు. తెలుగు సాహిత్యం విషయానికొస్తే – తెలుగు అనువాదాలు-కొత్త ఒరవడి, స్త్రీవాదం నుండి దళితస్త్రీవాదం వైపు, తెలుగులో స్త్రీల ఆత్మకథలు, సమకాలీన తెలుగు నవల, తెలుగు కథా ప్రపంచం, తెలుగు సబాల్టర్‌ స్వరాలు … చర్చకు వచ్చిన అంశాలు. ఇవి కాకుండా అక్షర, పుస్తక, చిన్నారలోక అంటూ ఏర్పాటు చేసిన ఉప వేదికలు ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక సంరంభం

సాహిత్యాన్ని అభినయకళగా రూపొందించి ప్రదర్శించే సంస్కృతి కన్నడనాట బసవేశ్వరుడి కాలం నుంచీ కొనసాగుతున్నదే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక దాని మరింత విస్తృతమైంది. బుక్‌ బ్రహ్మ సాహిత్యోత్సవంలోనూ సాహిత్య అభినయ ప్రదర్శన అందరినీ అబ్బురపరిచింది. కావ్యాభినయ (పోయెట్రీ ఇన్‌ యాక్షన్‌), కన్నడ కావ్యకణజ, మార్నింగ్‌ మెలోడీ, సమతె మత్తు, మమతెయ సోల్లుగళు(వర్డ్స్‌ ఆఫ్‌ ఈక్వాలిటీ అండ్‌ ఎన్‌డీయర్‌మెంట్‌) శాస్త్రీయ గాయన, హిందూస్తానీ సంగీత, భాషెబేరాదరూ భావవొందే, కావ్యాభివ్యక్తి, పంచవటి యక్షగాన తదితరాలన్నీ సుప్రసిద్ధులతో ప్రదిర్శింపజేశారు. వీటిలోనూ ప్రగతిశీల ప్రదర్శనలుండటం గమనార్హం.

అసంతృప్తి ఏంటంటే …
కన్నడనాట ప్రముఖ పబ్లిషర్స్‌ పుస్తకాలు వివిధ స్టాళ్ళల్లో ప్రదర్శనకు పెట్టారు. తమిళ, మలయాళ, ఆంగ్ల సాహిత్యాల పేరెన్నిగల స్టాళ్ళు ఉన్నాయి. తెలుగు పబ్లిషర్స్‌ స్టాళ్ళు లేకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఎన్‌బిటి పుస్తక ప్రదర్శన స్టాల్‌లో కొన్ని తెలుగు పుస్తకాలు కలసి ఉండటం, ఓల్గా ఒక మూలన తన పుస్తకాలను ప్రదర్శనకు ఉంచడం మినహా తెలుగు పుస్తకాల ప్రదర్శన కనిపించలేదు. ఇదే విషయాన్ని ఈ సభలకు అతిథిగా హాజరైన తెలుగులో ప్రముఖ పబ్లిషర్‌ సంపాదక మిత్రుడినడిగితే ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన వ్యవహరమని కొట్టిపడేశారు.

ఈ వొరవడి కొనసాగాలి!
మనం ప్రమాదంలో ఉన్నామనే సంకేతం ఈ సభలు తెలియజేశాయి. కర్యవ్యాన్ని గుర్తు చేశాయి. ఇలాంటి సభలు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న పనే అయినా.. నిర్దిష్ట ప్రణాళికలతో విజయవంతం చేయొచ్చు. ఈ సభలను కార్పొరేట్‌ స్థాయి అని, ఈ సంస్కృతికి వ్యతిరేకమని చెప్పిన కొందరు కవిమిత్రులు కూడా వీటిని వీక్షించి ఇలాంటివి చేయాల్సిందే అని అభిప్రాయపడ్డారు. తెలుగు నాట ఆ కృషి కార్యరూపం దాల్చాలి. దేశమంతా విస్తరించాలి.

– కెంగార మోహన్‌, 94933 75447

➡️