పిడికెడు బువ్వ పేగుల్ని నింపుతుంది
గింజ గింజలో ఒక స్వేదపు చుక్క
నిక్షిప్తమై పదిలంగా వుంటుంది
మన్నులో మట్టి మనిషి ఆనవాళ్లు
చిగురించే మొక్కగా పరిణమిస్తుంది
అన్నం ముట్టిన ప్రతి చేయి
జై కిసాన్ అంటూ గాల్లో లేస్తుంది.
రెక్కలిరుసుకున్న కష్ట ఫలితం
మెతుకై పిడికిల్లోకి చేరుతుంది
కాళ్ళొంచిన కర్మఫలం
దళారి చేతుల్లో విరచబడుతుంది
అరువు దరువై వీపున మోగుతుంటే
కరువు రక్కసి కోరలు చాస్తుంది
ఎరువు ధర శిఖరాగ్రాన కూర్చున్నాక
మొలకెత్తిన విత్తు మోసు
గుండెలవిసేలా రోదిస్తుంది.
భరోసా భుజం తట్టినట్లే వుంటాది
కుప్పకొచ్చిన కాయ సాగిలపడినాక
రేటు మొహం ముడుచుకుంటాది
గుత్తులుగా కాసిన పంట చివర్లో
ఇంటి గుత్తకు కూడా చాలకపోతాది
ఆర్థిక స్థితి తిరగబడి ఎగబడినాక
మట్టి మనిషికి మన్నే గతైతాది.
దున్నకానికి ఖర్చు భారం
మెడకు చుట్టిన తాడై పోయాక
గిట్టుబాటు ఉసురు తీస్తుంది
ఎన్ని ప్రణాళికలు కాగితాలపై
అక్షరాలుగా ఒలికిపోయినా
నమ్మకం నీటి మీద బుడగైపోతాది
విత్తు విత్తినప్పుడు రేటు కొండంత
కాయ రాశికి రాగానే గులకరాయంత
తాను నష్టపోతూనే మెతుకులు పంచే
మట్టి మనిషికి ప్రణమిల్లాలి.
– నరెద్దుల రాజారెడ్డి,
సెల్ : 9666016636