కొట్టు! గట్టిగా కొట్టు!
గురిపెట్టి కొట్టు!
నేను వద్దని మొత్తుకుంటే మాత్రం
నువ్వు కొట్టడం ఆపుతున్నావా!
నా జాతి అంతమే నీ ఆకాంక్ష కదా
సరే… అలాగే కొట్టు! ఇంకా కొట్టు!
నీ చేతులు కందేలా కొట్టు!
నీ రక్తపోటు హెచ్చేలా కొట్టు!
కొట్టడానికి నీ ఒక్కడి సత్తువ సరిపోక
నీ అనుంగు మిత్రుడి అండతో కొడుతున్నావ్
అతనికున్న వీటో హక్కుతో కొడుతున్నావ్
కానీ, నువ్వు విసిరి కొట్టే ఉగ్ర బాంబుకు
ఉన్నపాటున కుప్పకూలటానికి
నేను చలనంలేని భవంతిని కాదు!
నువ్వు ఎంత గట్టిగా కొడితే
అంత గట్టిగా పైకి లేచి
నరాల నిండా నెత్తుటి చైతన్యపు
గాలి తరంగాల్ని వెంటబెట్టుకొని
చెక్కుచెదరని స్థైర్యంతో
నిద్రపోతున్న దిక్కుల గుండెల మీద గుద్ది మరీ
మేల్కొలపగల పాలస్తీనా
పాలబుగ్గల తోలుబంతిని!
కళ్ళు మిరుమిట్లు గొలిపే
వెయ్యి విద్యుత్ కిరణాల గునపాలతో
నీ కుటిల పన్నాగాల అద్దాల సౌధాన్ని
బద్దలు కొట్టగల సూర్య కాంతిని!
కండ కావరంతో పొటమరించిన
నీ అహంకారపు ఆక్రమణవాద కళ్ళ గంతల్ని
తునాతునకలు చేయగల విశ్వ శాంతిని!
భవనాల్ని బద్దలు కొట్టి
బతుకుల్ని ధ్వంసం చేసినంత సులభం కాదు
నా కాలి కింద నేలను గుంజుకోవటం …
ఇవాళ ఈ క్షణం నీది కావచ్చు
నీకు ఇబ్బడి ముబ్బడిగా
ఆయుధాలు అందిస్తున్న బేహార్లది కూడా కావచ్చు
కానీ…
ఈ గడ్డమీద గడ్డ కడుతున్న
నా నెత్తుటి మడుగుల సాక్షిగా
రేపటి ఎర్రని చిగురు వసంతం మాత్రం నాదే!
– పతివాడ నాస్తిక్
94417 24167