కొందరు వ్యక్తులు తమ పని తాము చేసుకుంటూ పోతారు. అనేక రంగాల్లో తమ సేవలను అందిస్తూనే తామరాకు మీది నీటి బిందువులాగా నిలుస్తారు. అటువంటి అరుదైన వ్యక్తి, కీర్తి పురస్కారాలు, గౌరవ సత్కారాలు వంటివాటికి అతీతంగా నిలిచి విద్య, వైద్యం, సేవ, బాల సాహిత్యం వంటి రంగాల్లో మానవతా దృక్పథంతో ముందు వరుసలో నిలిచి పనిచేస్తున్న వేలాది మంది పిల్లల దేవమ్మ, ‘తెలుగు థెరిసా’ నన్నపనేని మంగాదేవి. ‘చేతన’ ద్వారా వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తూనే గత మూడు దశాబ్దాలుగా బాలలు, బాల సాహిత్య వికాసం కోసం పనిచేస్తున్న వారికి ‘నన్నపనేని మంగాదేవి బాల సాహిత్య పురస్కారం’ అందిస్తున్నారు. ఇప్పటివరకూ వసుంధర, మహీధర నళినీ మోహన్, చందమామ విశ్వనాథరెడ్డి, బుజ్జాయి, ముంజులూరి కృష్ణకుమారి, వాసిరెడ్డి రమేశ్ బాబు, చొక్కాపు, దాసరి వెంకట రమణ, చంద్రలత, మంచిపుస్తకం సంస్థ, బాలి, కందేపి రాణీప్రసాద్, సమ్మెట ఉమాదేవి మొదలుకుని ఈ వ్యాసకర్త వరకు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. నోబెల్ డేగా ప్రసిద్ధి చెందిన డిసెంబర్ 10న గుంటూరు శ్రీ వెంకటేశ్వర బాల కుటీరంలో జరిగే ఈ పురస్కార ప్రదానం మంగాదేవితో కలిసి సేవారంగంలో పనిచేసిన ప్రభావతి గారి యాదిలో జరుగుతుంది.
2024 సంవత్సరానికి ఈ సాహిత్య పురస్కారాన్ని బాల సాహితీవేత్త, ఉపాధ్యాయుడు, కవి, సంపాదకులు డా.ఎం. హరికిషన్ అందుకోనున్నారు. హరికిషన్ మూడు దశాబ్దాలుగా కథా సాహిత్య సృజన, ఇరవై మూడేండ్లుగా బాల సాహిత్య సృజన చేస్తున్నారు. బాల సాహిత్యంలో సంప్రదాయ జానపద కథలతో పాటు ఒత్తులు లేని గేయాలు, కథల వంటి ప్రయోగాలను కూడా చేశారు. తన ప్రాంతపు వారసత్వ సాహిత్య సంపద మీద మక్కువతో దానిని రేపటి తరానికి అందించేందుకు విలక్షణ మౌఖిక సాహిత్యాన్ని సేకరించి సంకలనాలుగా అందించాడు. తరగతి గదిని తన సాహిత్య సంప్రదాయాల ఆటస్థలంగా మార్చుకున్న ఈయన … అందుకోసం ప్రతి క్షణాన్ని వినియోగించుకుని అందరికంటే భిన్నంగా నడిచి, సోషల్ మీడియా గ్రూపులు, అంతర్జాల సమూహాలను తన వేదికగా చేసుకున్నాడు. రచయితగా ఎంతగా తనదైన శైలిలో రాశాడో రాయలసీమ బిడ్డగా తన నేల నుంచి వెలుగు చూసిన సాహిత్యాన్ని వివిధ సంకలనాలుగా తెచ్చాడు. రాయలసీమ హాస్య కథలు, వ్యంగ్య కథలు, ఉపాధ్యాయ, రచయిత్రుల కథలతో పాటు ఆ నేల జీవికకు చిత్రిక పట్టే ‘కరువు కథలు’ సంకలనాలుగా తన సంపాదకత్వంలో ప్రచురించాడు. కొండారెడ్డి బురుజు, కర్నూలు జిల్లా చరిత్రతో పాటు అక్కడి మహనీయుల గురించి రాశాడు. ఇంతవరకూ వెలువరించిన 72 రచనలు ఆయన ప్రతిభకు, ప్రయత్నానికి అపూర్వ నిదర్శనాలు.
మంగాదేవి పురస్కార గౌరవం అందుకోవడానికి మూలంగా నిలిచింది హరికిషన్ సృజించిన అపారమైన బాల సాహిత్య సంపద. తన రచలనకు జీవభాషలో పేర్లు పెట్టడం ఆయనకు బాగా తెలుసు. ‘నక్క బావ- పిల్లి బావ’, ‘చిలకముక్కు పూడిపాయె…’, ‘నలుగురు మూర్ఖులు’, ‘కిర్రు.. కిర్రు.. లొడ్డప్పా!’, ‘ఠింగురు బిళ్ళ’, ‘ఒకటి తిందునా.. రెండు తిందునా..’, ‘మాయమ్మ రాచ్చసి’, ‘నల్లకుక్క’, ‘దెబ్బకు ఏడుమంది’ వంటివి అందుకు ఉదాహరణలు. ఇంకా.. ‘చందమామ చెప్పిన కథలు, రాము టోపి, మోగాళ్ళ దేశం, పుచ్చకాయ తపస్సు, సముద్రంలో చిన్న చేప, బూర, పిల్లలు కాదు పిడుగులు, అమ్మో దయ్యం, పిల్లల హాస్య కథలు’ వంటి మరికొన్ని రచనలు హరికథలకు చిరునామాలు. ‘వంద రోజులు వంద కథలు’ పేరుతో దాదాపు వేయి రోజులుగా తానే స్వయంగా ఆయన కథలు చెబుతున్నాడు. వేలాదిమంది తెలుగు పిల్లలకు సోషల్ మీడియా ద్వారా వాటిని వినిపిస్తున్నాడు.
హరికిషన్ రచనలు పిల్లల వయస్సు, స్థాయిలకు అనుగుణంగా ఉంటాయి. పాఠశాల పూర్వదశ పిల్లల కోసం పెద్దలు చదివి వినిపించే గేయాలను ‘రేపటి వెలుగులు’గా వ్రాయగా, కర్నూలు బుక్ ట్రస్ట్ తెచ్చింది. ఈ పుస్తకంలోని గేయాలన్ని ఒత్తులు లేకుండా సాగడం విశేషం. ఇంకా ‘చిన్నారి గేయాలు’, ‘పిల్లల జానద గేయాలు’, ‘రేపటి వెలుగులు’, ‘తేనె చినుకులు’ వంటి బాల గేయాల సంపుటాలు, సంకలనాలు తెచ్చారు. పిల్లల మనసులకు నచ్చేవిధంగా రాయడం ఈ బడి పంతులుకు బాగా తెలుసు. హరికిషన్ రాసిన కథలు, నవలలు కూడా కొంత కొత్తగానే కనిపిస్తాయి. ‘మిన్ను’, ‘చిన్నూ-మిన్నూ’, ‘అందమైన అబద్దాలు – కమ్మని కథలు’, ‘యువరాణి లాస్య’ వంటి రచనలు అందుకు ఉదాహరణగా చూడొచ్చు.
హరికిషన్ తొలుత కథా రచయితగా వ్యాసంగాన్ని మొదలుపెట్టినప్పటికీ, తరువాత బాల సాహిత్యంలో విశేష కృషిచేసి తనదైన ముద్రను వేసుకున్నాడు. సంపాదకులుగా, రచయితగా, సేకర్తగా, నవల, కథ, గేయాలకర్తగా, స్టోరీటెల్లర్‌గా తన స్వీయశైలిని ‘హరి’కథ’ అన్న ముద్రతో నిలిచాడు. బాల సాహితీ రంగంలో ఇష్టంగా, అత్యంత ప్రేమగా రచనలు చేస్తున్న డా.హరికిషన్ కృషికి గతంలో ‘అజో-విభో’ గౌరవం దక్కింది. ఇప్పుడు బాల సాహిత్యంలో అత్యంత ఉన్నతమైన ‘మంగాదేవి పురస్కారం’ అందబోతోంది. డా.హరికిషన్‌తో కలిసి నడుస్తూనే ఆయన సాహితీ సృజనలో భాగమైన సహచరి డా.చంద్రమౌళినికి ఆయన ప్రతి విజయంలో భాగముందనడం అతిశయోక్తి కాదు.
-డా. ప్రత్తిపాక మోహన్