బొజ్జా తారకం సతీమణి విజయ భారతి కన్నుమూత

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి, ప్రముఖ రచయిత్రి బి విజయభారతి (83) శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వయో భారంతో పలు అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. కుంధన్‌బాగ్‌లోని తన కుమారుడు, ఐఎఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జా నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయభారతికి ఒక అమ్మాయి కూడా ఉన్నారు. అభిమానుల సందర్శనార్థం
విజయభారతి భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంటి వద్దే ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో ఆమె ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. విజయ భారతి తూర్పు గోదావరి జిల్లా రాజోలులో 1941లో జన్మించారు. ఈమె తండ్రి ప్రముఖ రచయిత బోయి భీమన్న. తల్లి నాగరత్నమ్మ. విజయభారతి కోఠీలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. దక్షిణ దేశీయాంద్ర వాజ్మయం-సాంఘిక పరిస్థితులు అనే అంశపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో డాక్టరేట్‌ పొందిన మొట్టమొదటి దళిత మహిళ విజయభారతే! తెలుగు అకాడమీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రాచీన సాహిత్యకోశం, ఆధునిక సాహిత్యకోశం విజయభారతి సంపాదకత్వంలోనే అకాడమి ముద్రించింది. 1968లో విజయభారతికి ప్రముఖ హేతువావి, పౌరహక్కుల నేత బొజ్జా తారకంతో వివాహం జరిగింది. కుల వ్యవస్థ స్వరూప స్వభావాల గురించి పురాణాలు, ఇతిహాసాలు ఆధారంగా విశ్లేఫణలు చేస్తూ, ఆమె చేసిన పలు రచనలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌లపై కూడా ఆమె పలు రచనలు చేశారు. ఆమె రాసిన షట్చక్రవర్తులు అనే పుస్తక సంకలాని 2003లో కెనడాలోని డాక్టర్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ మిషనరీస్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అవార్డులు వచ్చాయి. విజయ భారతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీతో పాటు పలువరు సంతాపం ప్రకటించారు.

తెలంగాణ సిఎం ప్రభృతుల సంతాపం
విజయభారతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత, కీర్తిశేషులు బోయి భీమన్న కుమార్తె అయిన ఆమె… తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించడంతో పాటుగా ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. రాహుల్‌ బొజ్జా, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

సిపిఎం ప్రగాఢ సానుభూతి
విజయభారతి మృతి పట్ల సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. బోయి భీమన్న కుమార్తెగా, మానవ హక్కుల కోసం నిరంతరం శ్రమించిన న్యాయవాది బొజ్జా తారకం సతీమణిగానే కాకుండా రచయితగా ప్రజల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఆమె ఏర్పరచుకున్నారని పేర్కొంది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. విజయభారతి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

సామాజిక ఉద్యమాలకు తీరని లోటు : కెవిపిఎస్‌
విజయభారతి మృతి సామాజిక ఉద్యమాలకు తీరని లోటని కెవిపిఎస్‌ పేర్కొంది. దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధికి పరితపించిన ఆమె… మహాత్మా జ్యోతీరావు ఫూలే, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్రలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని తెలిపింది. సామాజిక అంశాలపై ఎన్నో రచనలను చేశారని పేర్కొంది. ఈ మేరకు కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

మతతత్వంపై పలు రచనలు : సాహితీ స్రవంతి
విజయభారతి మృతి ప్రజాసాహిత్యానికి తీరని లోటని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కెంగార మోహన్‌, సత్యరంజన్‌ పేర్కొన్నారు. మతతత్వం, సామాజిక అంశాలు, చరిత్ర అంశాల్లో పలు రచనలు చేశారని తెలిపారు. విజయభారతి మృతి పట్ల ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి, ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి సంతాపం ప్రకటించారు. సామాజిక కార్యకర్త, రచయిత కత్తి పద్మారావు, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మన్‌ మల్లెపల్లి లక్ష్మయ్య, పలువురు రచయితలు, మేధావులు, నాయకులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

Tribute – డాక్టర్‌ విజయభారతికి ఏపీ దళిత మహాసభ ఘన నివాళి

➡️