రోజొకటి వస్తోంది..!

Feb 12,2024 08:49 #sahityam

పంచభూతాలూ

నిన్ను వ్యతిరేకిస్తాయి

ఊపిరి సలపని వాతావరణం

నిన్ను చుట్టు ముడుతుంది

నీ తప్పులన్నీ నీకు తెలిసొచ్చే

రోజొకటి వస్తోంది

 

ఘడియ ఘడియకూ

నువ్వు కదిలినా కదలక పోయినా

కాలం ఆగదు

క్షణాల బతుకు ముళ్ళు

తిరుగుతూనే వుంటది

అన్నీ రోజులూ నీవి కావు

నిన్ను మడత బెట్టి కడిగేసే రోజొకటి వస్తది

 

వందిమాగధులంతా చెల్లా చెదరై పోతారు

ఉన్న పళంగా

అతికిచ్చుకున్న బలమంతా

పురాతన గోడలా కుప్ప కూలుతుంది

ద్ణుఖం రాల్చిన మట్టి దిబ్బల మధ్య

నీ అసలు అస్తిత్వ ఆనవాళ్లను

తడుముకునే రోజొకటి వస్తోంది!

 

చరిత్ర పటల్ని తిరగేసి చూడు

విర్రవీగే వెర్రి నియంతలంతా

కాలగర్భంలో కలిసి పోయారు

ఏదీ శాశ్వతం కాదు..

శిఖరంపై ఉన్నాననీ

చిటికెలు మిటకరియ్యకు

పాతాళంలో పడిపోయే రోజొకటి వస్తోంది!

 

అసామాన్య ఆవులింతలు తీయకు

నిద్రమత్తు వొదిలి

నిజాలు తేటతెల్లమైపోతాయి

అప్పుడు…

దేహమూ మనసూ

బోధివృక్షం ముందు మోకరిల్లుతోంది

చేతులు కాలిపోయి వుంటాయి

పత్ర హరితాలెవ్వీ కానరావు

నిరంతర ఆత్మఘోష లోంచి

నీ మనిషితనం గుర్తొచ్చే

రోజొకటి తప్పక గుర్తొస్తుంది..!

– డా.కటుకోఝ్వల రమేష్‌ 99490 83327

➡️