యానాదుల జీవన చిత్రం ‘పాయి దరువులు’

Aug 26,2024 05:00 #aksharam

యువ రచయిత కె.వి మేఘనాథ్‌ రెడ్డి రాసిన మొదటి నవల ‘పాయి దరువులు’. ఇప్పటికే మేఘనాధ్‌ ఒక కవిత్వ సంపుటిని, మరో కథల సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకం చదివిన వారెవరైనా నవలా ప్రక్రియలో ఇదే వారి మొట్టమొదటి పుస్తకమంటే నమ్మకపోవచ్చు. తెలుగు సాహిత్యంలో ఆదివాసీ గిరిజనుల సంస్క ృతి, సాంప్రదాయాలు, జీవనశైలిపై గత రెండు, మూడు దశాబ్ద కాలంలో చెప్పుకోదగ్గ సాహిత్య రచన రాలేదు. ఆ లోటును తీర్చడానికి కె.వి మేఘనాథ్‌ రెడ్డి ఈ నవల ద్వారా ఎంతో కొంత ప్రయత్నం చేశారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
పాయి దరువులు అనేది యానాదుల బతుకు చిత్రం. యానాదుల జీవన శైలిని, వారి సంప్రదాయాలను మాత్రమే కాకుండా వారి మనసు లోతులను, వారి కష్టాల వైశాల్యాన్ని, వారి గుండెల్లో ఘనీభవించిన కన్నీటి బరువును ఈ నవల ఆవిష్కరించింది. ప్రతీకారం, పోరాటం నేపథ్యంలో స్త్రీ ప్రధాన పాత్రగా వచ్చిన నవలలు చాలా తక్కువే. చంద్రుడికో నూలుపోగు అన్నట్టు, ఆ నేపథ్యంలో లేక లేక వచ్చిన నవల ఇది.
స్త్రీ ఎప్పుడూ పురుషుడి ముందు పలుచనే. అందునా నాగరికత ఎరుగని ఆదివాసీ గిరిజన స్త్రీల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకమే! సరిగ్గా అదే పాత్రను తన నవలలో ప్రధాన పాత్రగా ఎంచుకున్నారు రచయిత. అనాదిగా తమ యానాది కుటుంబాలపై, మరీ ముఖ్యంగా యానాది స్త్రీలపై పెత్తందారులు చేసే పెత్తనాన్ని, దాష్టీకాన్ని, అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని ఒక ఒంటరి స్త్రీ ఎలా ఎదుర్కొన్నది? అన్నదే ఈ పాయి దరువులు.
కథ మొత్తం చిన్నమ్మి అనే హుషారైన గిరిజన పిల్ల చుట్టూ తిరుగుతుంది. ఆమె ఊసులు, చేష్టలు, మాటలు పాఠకుడిని మురిపిస్తాయి. ఆమె ప్రేమ పాఠకుడిని మైమరిపిస్తుంది. ఆమె పాటలతో పాఠకుడు గొంతు కలుపుతాడు. ఆమె చిందులతోకాలు కదుపుతాడు. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి మరోవైపు అన్నట్టు తరతరాలుగా యానాదులు ఎదుర్కొంటున్న అణచివేత, వారికి జరుగుతున్న అన్యాయం, శిధిలమైపోతున్న యానాది స్త్రీల మానప్రాణాలు పాఠకుడిని ఆవేదనకు గురిచేస్తాయి. ఆ అడవి బిడ్డలకు అడవితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది ఈ నవల. తల్లిని బిడ్డను, వేరుచేసి వేడుక చూసే దుర్మార్గుల చేష్టలకు గొడ్డలిపెట్టు ఈ నవల.
ఎవరి కథల్ని వారు రాసుకోవడం, ఎవరి కష్టాల్ని వారు చెప్పుకోవడం కాస్త సులభమైన పని. కానీ ఇతరుల జీవితాల గురించి రాయాలన్నా, ఇతరుల మనసుల్లోకి దూరి వారి కష్టాలను చెప్పాలన్నా అది కత్తిమీద సామే. కానీ మేఘనాథ రెడ్డి ఈ నవల ద్వారా యానాదుల జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్టు కనిపిస్తుంది. యానాదుల కష్టనష్టాలను, వారి జీవితాల్లోని ఆటుపోట్లను చాలా చాకచక్యంగా ఈ కథలో చెప్పగలిగారు. బహుశా యానాదులతో మమేకమవడం, వారితో చిక్కటి స్నేహాన్ని కలిగి ఉండడం వల్ల ఇది సాధ్యపడి ఉండవచ్చు. కేవలం సంభాషణలు మాత్రమే కాకుండా కథ మొత్తం చిత్తూరు జిల్లా, ఆ ప్రాంత చుట్టుపక్కల నివసించే యానాదుల యాసలో, వారి మాండలికంలోనే ఉంటుంది. అయినప్పటికీ నవల చకచకా చదివిస్తుంది. కొత్త పాఠకుడయినా సరే, ఓ ఐదారు పేజీలు శ్రద్ధగా చదివితే చాలు, ఇక అక్కడి నుంచి పాఠకుడి వేలు పట్టుకొని మరీ, కథ మొత్తాన్ని చదివిస్తారు రచయిత.
నవల చదివేటప్పుడు ప్రతి పేజీలోనూ రచయిత కష్టం, యానాదుల జీవితాలపై రచయిత చేసిన పరిశోధన మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. బొల్లి మేక ఈనేటప్పుడు పాఠకుడు ప్రసవ వేదనను అనుభవిస్తాడు. ఆ క్రమంలోనే లింగాలోడితో అనుబంధాన్ని పెంచుకుంటాడు. స్నేహం చేస్తాడు. పాపులమ్మలో తన అమ్మనో, అవ్వనో చూసుకుంటాడు. చిన్నమ్మి, ఆనందుడి ప్రేమకు తడిసి ముద్దవుతాడు. నారప్ప డప్పు కొడుతోంటే హుషారుగా అడుగులేస్తాడు. కథలో లీనమై చివరి వరకూ ఆపకుండా చదువుతాడు. నవల పూర్తయిన వెంటనే పాఠకుడి గుండె బరువెక్కుతుంది. కథను మరి కాస్త పొడిగించి ఉంటే బాగుండునని అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చిన్నమ్మి, ఆనందుడి మధ్య గల ప్రణయ ఘట్టాలను, చిన్నమ్మి లింగాలోడి మధ్య గల అనుబంధాన్ని మరింత విపులంగా వర్ణించగల అవకాశం ఉన్నా రచయిత ఆ పనికి పూనుకోలేదు. బహుశా ఆ కారణంగానేమో కథ మరింత చిక్కగా, చక్కగా తయారైంది. స్త్రీ ప్రధాన పాత్రగా వచ్చిన కేశవ రెడ్డి నవల మునెమ్మలో నాయిక ఎంత బలమైనదో, మేఘనాథ రెడ్డి రాసిన పాయి దరువులో నాయిక చిన్నమ్మి కూడా అంతే బలమైనది.
తెలుగు సాహిత్యంలో నాణ్యమైన యువ రచయితలు లేరేమోనన్న దిగులు అవసరం లేదు. ఇప్పుడిప్పుడే యువకులు తమ కలాలను చేత పట్టుకుంటున్నారు. సాహిత్యం అనే కళకు తమదైన రంగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను పెంచుకుంటూ మేలిమి కథలను తయారు చేస్తున్నారు. ఆ కోవలోని రచయితలలో మేఘనాథ్‌ రెడ్డి మొదటి వరుసలో నిలబడతాడు. మున్ముందు అతను మరిన్ని గొప్ప రచనలు చేయాలని, తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేయాలని కోరుకుందాం. రూ.120 వెల ఉన్న పాయి దరువులు నవల కాపీ కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ : 63003 18230.
– పేట యుగంధర్‌
94925 71731

➡️