పండగలా పి.ఎస్‌. పరిషత్‌!

Apr 14,2025 05:10 #natikala potilu, #sahityam

దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య (పి.ఎస్‌.) పేరిట పల్నాడు జిల్లా యడ్లపాడులో ఏప్రిల్‌ 4, 5, 6 తేదీల్లో 22వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు పండగ వాతావరణంలో జరిగాయి. కళాకారుల్నీ, అధిక సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల్నీ ఎంతగానో ఆదరించిన నిర్వాహకులు ప్రశంసార్హులు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు సైతం ఆద్యంతం పాల్గొనేలా చూడటం మరీ అభినందనీయం. భిన్న ఇతివృత్తాల నాటికల్ని ఎంపిక చేయడం విశేషం.
నాన్నా నేనొచ్చేస్తా! : పిల్లల్ని బాధ్యతలు తెలియకుండా, అతి గారాబంగా పెంచడం వల్ల సంసారాలు విచ్ఛిన్నమవుతున్న తీరును కళ్లక్కట్టి పండించారు అమృత లహరి థియేటర్స్‌, గుంటూరు కళాకారులు. రచన తాళాబత్తుల వెంకటేశ్వరరావు. అమృత లహరి దర్శకత్వంలో ప్రదర్శన, దర్శకత్వం, నటి (అమృతవర్షిణి) సహా మొత్తం ఐదు ప్రథమ బహుమతులు సాధించారు.
నా శత్రువు : అరచేతిలో అందుబాటులోకొచ్చిన ఫేస్‌బుక్‌, ఇన్ట్రాగ్రామ్‌ ఇత్యాది అధునాతన సాంకేతిక సదుపాయాలతోనే జీవితం అనుకునే వారికి కనువిప్పు యువభేరి థియేటర్స్‌, హైదరా బాద్‌ వారి నాటిక. వడ్డాది సత్యనారాయణ దర్శకత్వం. అక్కల తామేశ్వరయ్య రచన. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన ఇందులో వ్యక్తిగత బహుమతి గెల్చుకున్న జ్యోతి నటన హైలైట్‌.
జనరల్‌ బోగీలు : పి టి మాధవ్‌ రచన, గోపరాజు విజరు దర్శకత్వంలో శ్రీ సాయి ఆర్ట్స్‌, కొలకలూరు కళాకారులు తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతి సాధించారు. మరో రెండు వ్యక్తిగత బహుమతులు దక్కాయి. సాధారణ బోగీల సంఖ్య గణనీయంగా పెంచాలని, ఆ బోగీల ప్రయాణికుల వివరాలు కూడా రైల్వే వద్ద ఉండి తీరాలనే డిమాండ్‌పై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడి సుదీర్ఘ పోరాటం ఆధారంగా రూపొందిన నాటిక ఇది. కంటెంట్‌ కన్విన్సింగ్‌గా ఉన్నా ప్రధానంగా డైలాగుల మీద నడిచే నాటిక. ప్రారంభంలోని దృశ్యం తప్ప మిగతా అంతా పోలీస్‌ స్టేషన్లో వాద ప్రతివాదాలే!
చిగురు మేఘం : జబ్బునపడ్డ గ్రామీణ భారతానికి వైద్యులు తరలాల్సిన అవశ్యకతను వక్కాణించారు- ప్రధాన పాత్రలో వ్యక్తిగత బహుమతి కూడా గెల్చుకున్న రచయిత కావూరి సత్యనారాయణ. ఏపూరి హరిబాబు దర్శకత్వంలో అమరావతి ఆర్ట్స్‌, గుంటూరు కళాకారులు ప్రదర్శించారు.
బ్రహ్మస్వరూపం : ”ధర్మ శబ్దాలు వినిపించాల్సిన చోట కర్మ శబ్దాలు వినిపించింది. ధర్మం ఎప్పుడూ న్యాయాన్నే గెలిపిస్తుంది” అంటారు- ప్రధాన పాత్ర పోషించిన దర్శకుడు టి.వి.పురుషోత్తం ద్వారా రచయిత స్నిగ్ధ. హాయిగా సాగే కుటుంబంలో అనుకోకుండా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఎంత అల్లకల్లోలం సృష్టించిందో హృద్యంగా చూపారు మైత్రి కళానిలయం, విజయవాడ కళాకారులు.
విడాకులు కావాలి : అతి స్వల్ప విషయాల మీద నిత్యం కొట్లాడుకునే వృద్ధ దంపతులు విడాకులే శరణ్యమనుకుంటారు.
ఇంట్లోనే అనుకోకుండా జరిగిన ఓ చిన్న ప్రమాదంతో ఒకరి తోడు మరొకరికి అనివార్యమైన స్థితిలో.. విడాకుల్ని తూచ్‌ కొట్టడం ఈ హాస్య నాటిక ముగింపు. వల్లూరు శివప్రసాద్‌ రచన. ప్రధాన పాత్ర పోషించి, వ్యక్తిగత బహుమతి కూడా సాధించిన గంగోత్రి సాయి దర్శకత్వంలో అరవింద్‌ ఆర్ట్స్‌, తాడేపల్లి కళాకారులు ప్రదర్శించారు. ఇల్లాలి పాత్రకూ ఉత్తమ సహాయ నటి బహుమతి దక్కింది.
కిడ్నాప్‌ : తల్లిదండ్రుల, పెద్దల ప్రాధాన్యాన్ని బిడ్డలకు నాటకీయంగా తెలియజేసి, కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశారు- స్వీయ దర్శకత్వంలో రచయిత చెరుకూరి సాంబశివరావు. ప్రధాన పాత్రలో ఆయన అభినయం మరింత సహజంగా, పాత్రోచితంగా ఉంటే బాగుం డేదని పించింది. ఉత్తమ బాల నటుడు, విలన్‌ పాత్ర ధారి సహాయ నటుడు బహుమతులు అందుకున్నారు.
ఋతువు లేని కాలం : అగస్త్య రచనను వై.బి.చౌదరి దర్శకత్వంలో కళానికేతన్‌, వీరన్నపాలెం కళాకారులు ప్రదర్శించారు.
గురితప్పిన వేట : పి.మృత్యుంజయరావు రచనను వైఎస్‌ కృష్ణేశ్వరరావు దర్శకత్వంలో రసఝరి, పొన్నూరు కళాకారులు- అంతంత మాత్రంగా ప్రదర్శించారు.
ప్రత్యేక ప్రదర్శనగా స్థానిక కళాకారులు.. నిర్వాహకులు మానవత, యడ్లపాడు పేరిట ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ నాటికను జరుగుల రామారావు దర్శకత్వంలో ప్రదర్శించారు.

బహుభాషా నాటకోత్సవాలు భేష్‌!

‘రీడర్స్‌ అకాడమీ’ ఆధ్వర్యంలో లీడర్‌ విశాఖ జాతీయ నాటకోత్సవాలు – 2025.. మార్చి 27, 28, 29 తేదీల్లో విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, మరో రెండు మూడు స్థానిక ప్రముఖ సంస్థల సౌజన్యంతో విజయవంతంగా నిర్వహించిన ఈ బహు భాషా నాటకోత్సవాలకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరవ్వడం నిర్వాహకుల కృషికి నిదర్శనం.

నాటకాల పరామర్శ

ఐటమ్‌ (గుజరాతీ) : ‘అస్తిత్వ ఆర్ట్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో (సాధారణ ప్రక్రియకు భిన్నంగా) నాటక ప్రదర్శన కొనసాగింది. మహిళ అంతరంగాన్ని, ఆయా సందర్భాల్లో ఆమె ఆలోచనల్ని, స్పందనలను ప్రదర్శించాలన్న అర్పితా ధాగత్‌ కాన్సెప్ట్‌పై మరో నలుగురు యువతులు తమ అభిప్రాయాలను, అవగాహనను వ్యక్తం చేస్తే.. డిజైన్‌ చేసిన ఆమె వాటిని క్రోడీకరించి.. దర్శకత్వం వహించారు. కోరస్‌ డ్రస్‌లో.. వీధినాటిక తరహాలో గంటంబావు సేపు ఐదుగురు యువతుల డైలాగులతోనే నాటకం సాగింది. స్టేజీ ముందు భాగంలో కొద్ది జాగాను వదలి, ఐదు చిన్న రూములు ఏర్పాటు చేసి.. ఒక్కో దానిలో ఒక్కొక్కరు అక్కడి నుంచి / బయటకు వచ్చి.. అటూ ఇటూ తిరుగుతూ డైలాగులు చెప్పి మళ్లీ చాంబర్లోకెళ్లి కర్టెన్‌ వేసుకునేవారు. స్త్రీ పట్ల సమాజం తేలిక భావం తీరును, దానిపై సంఘర్షణనూ ప్రదర్శించిన ప్రయోగాత్మక నాటిక ఇది.
ది సాల్ట్‌ ఆఫ్‌ లైఫ్‌ (హిందీ) : అరుణాచల్‌ ప్రదేశ్‌ గిరిజన జనజీవన దృశ్యాన్ని ఆవిష్కరించిన ఈ ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆసాంతం ఆకట్టుకుంది. తమ సంస్క ృతీ సంప్రదాయాల పరిరక్షణ ప్రాజెక్టుకు తమ ముఖ్యమంత్రి మంజూరు చేసిన రూ.ఆరున్నర కోట్లతో ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాల్లో 33 ప్రదర్శనలిచ్చినట్లు యువ దర్శకుడు రికెన్‌ ఎన్గొమ్లె తెలిపారు. స్టేజీ మీద వెనక భాగంలో పావు వంతు ఓ అడుగు ఎత్తులో మరో వేదిక.. దానికి ఇరు వైపులా ర్యాంపులూ.. ఇంతే! పాత్రధారులు మాత్రం పాత్రలో భాగంగా పరికరాల్ని కొద్దిమేరకు వాడుకున్నారు. కొద్దిపాటి డిమ్‌ లైటింగ్‌, స్పాట్స్‌తోనే.. సీన్ల మధ్య గ్యాప్‌ లేకుండా లైట్స్‌ ఆఫ్‌ ఆన్‌ తోనే చకచకా సమర్ధంగా నడిపారు. పురాతన వర్తక.. సాంస్క ృతిక మార్పిడులకు ఈ కథ ఓ ఉదాహరణగా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు.

ది టైగర్‌ మ్యాన్‌ (మలయాళీ) : కేరళ కాలికట్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి బందం- మలయాళం భాష రాని హెయ్సనమ్‌ తోంబా (మణిపురి) దర్శకత్వంలో ప్రదర్శించిన నాటకం సూపర్‌ సక్సెస్‌. అత్యధిక భాగం స్లోగా నడిచినా.. దాదాపు ప్రతి లైట్స్‌ ఆఫ్‌ అనంతరం ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నారు. సంగీత బేస్‌ శృతిని ఆసాంతం కొనసాగించగా తదనుగుణంగా నటీనటులు పాత్రల్లో ఒదిగిపోయారు. ఎప్పటికప్పుడు స్పాట్స్‌, లైట్‌ డిమ్‌ లైటింగ్‌ ప్రక్రియతో అద్భుతంగా పండించారు. ప్రతీకాత్మకంగా మానవ స్వభావాలను వెల్లడించే దృశ్య సాధనంగా ఈ ప్రదర్శన సాగింది.

వినూత్న రీతిలో న్యాయ నిర్ణయం

సాధారణంగా (ముగ్గురు) కళారంగ ప్రముఖుల ప్యానెల్‌ న్యాయనిర్ణయం చేస్తుంది. యడ్లపాడులో దీనికి భిన్నంగా 15 మంది సాధారణ ప్రేక్షకుల్ని న్యాయనిర్ణేతలుగా నిర్ణయించి.. ఆయా విభాగాలకు, నటవర్గానికి వారు ఇచ్చిన మార్కుల ఆధారంగా నిర్వాహకులు జడ్జ్మెంట్‌ ప్రకటించారు. పరిషత్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించిన ముత్తవరపు సురేష్‌ బాబు (దంపతులు), ముత్తవరపు రామారావు, జరుగుల శంకర్రావు, నూతలపాటి మన్మధరావు, పద్మారావు తదితరులతో కూడిన బృంద సమష్టి కృషిని అందరూ హర్షించారు.

– జి.వి.రంగారెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌
99126 15747

➡️