మానవత్వపు కథా పరిమళం

Apr 1,2024 04:32 #jeevana

‘ప్రతి కథకు ఒక బాధ్యత ఉంటుంది. అది సామాజిక ప్రయోజననానికి దోహదకారి కావాలి. నలుగుర్ని ఉత్తేజపరచాలి. పది మందికి కర్తవ్య బోధ చేయాలి.’ అని కొద్దిమంది రచయితలు మాత్రమే ఆలోచిస్తారు. ఆ కొద్దిమంది కోవకు చెందినవారే ఈతకోట సుబ్బారావు. తన గుండెను పిండేసే సంఘటనను చూసినప్పుడు దాన్ని నలుగురికీ తెలియజేయాలని ఆయన తపన పడ్డాడు. ఆ తపనలోంచి పుట్టుకొచ్చిన కథల సంపుటే ఆయన తాజాగా వెలువరించిన ‘పోడుగాలి’. ఒక మాస్టర్‌ చెఫ్‌ వండితే, ఆ వంట ఎంత అద్భుతంగా వస్తుందో- అలానే ఒక సాహిత్యాభిమాని అయిన జర్నలిస్టు సృజించిన కథ కూడా అంతే బాగుంటుంది. దానికి చక్కని ఉదాహరణే ఈతకోట సుబ్బారావు. పోడుగాలి కథాసంపుటిలో మొత్తం 21 కథలున్నాయి. అన్నీ దిగువ మధ్యతరగతి జీవితాలకు అక్షర రూపాలే!
అంతిమయాత్రలో కూతురి అంచనాలను తారుమారు చేసిన ఓ తండ్రి కథే ‘మాటల మనిషి’. అతనో గుమస్తా. ఊళ్ళో విషయాలన్నీ తన భుజాలపై వేసుకుంటాడుగానీ సొంత పనుల కోసం అంతగా తపించిపోడు. కూతుర్లిద్దరూ దేశం కాని దేశంలో హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. అతని భార్య కాలం చేసింది. ఊళ్ళో ఒక్కడే ఉంటున్నాడు. ఊళ్ళో నాన్న ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఉంటాడని, తండ్రిని ఎలాగైనా తన వద్దకు తీసుకొచ్చేయ్యాలని నిర్ణయించుకుంటుంది. అంతలోనే ఒకరోజు అర్ధరాత్రి ఆమెకు ఫోన్‌ వస్తోంది. తండ్రి చనిపోయాడని సమాచారం. ఎవరో దయగలవాళ్ళు ఓ పూలమాల వేసి దీపం పెట్టి ఉంటారు. అది గాలికి మిణుకుమిణుకుమంటూ రెపరెపలాడుతూ ఉంటుంది. ఇద్దరం సంతానం ఉండి కూడా తండ్రిని అనాథలా ఉంచేశాం అని బాధపడుతూ, విదేశం నుంచి వస్తుంది. ఆమె అంచనాలు, అనుమానాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఒక సాధారణ గుమాస్తాకి ఇంతటి జనాదరణ, ప్రేమాభిమానాలు ఎక్కడివని ఆశ్చర్యపోతుంది.
‘బంగారు తల్లీ! మాటే మనిషిని ఆవిష్కరిస్తుందిరా. మనం ఉన్నా లేకున్నా మనల్ని తలుచుకునేలా చేసేది మన మాట తీరే కదా! కష్టాలలో ఉన్నవారు సహాయం కన్నా ముందుగా ఆశించేది ఆప్యాయంగా పలికే రెండు మాటలు, ఓదార్పుగా చెప్పే నాలుగు పలుకులు, ధైర్యం చెప్పే ఓ మనిషి.. మనల్ని పరిపూర్ణ వ్యక్తిగా సమాజంలో నిలిపేది మన మాట తీరే..’ అని తండ్రి పైనుంచి చెప్పినట్లు ఆమె భావిస్తుంది. ఈ ఒక్క సంభాషణలోనే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని రచయిత సూటిగా చెప్పాడు. మనిషికి కావాల్సిన ఆభరణం ఏమిటో స్పష్టీకరించాడు. తెలిసిన విషయమే అయినా దాన్ని ఈరోజుల్లో పాటించని వారికి ఈ కథ ఓ కనువిప్పు.
సాటి మనిషి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని కొంతమంది బలవంతులు ఆడుతున్న వింత నాటకంలో బలహీనులు ఎలా బలైపోతున్నారో చెప్పే కథే ‘కొండ పరియ’. కొండల్లో ఏ దిక్కున వెళితే, ఏ పంట దొరుకుతుందో బాగా తెలిసిన వ్యక్తి పోరిగాడు. ఏ జంతువు ఎదురైనా తప్పించుకు వచ్చేవాడనే పేరుంది. అతని భార్య కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. వాళ్లకి ఒక కొడుకు. పట్నంలో హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు. వారం వారం వెళ్లి చూసొస్తున్నారు కూడా. వాళ్లకి అంత సాయం చేసింది ఆ గూడెం దేవుడిగా భావించే సుబ్బారెడ్డి. అతడి వల్లే తన బిడ్డ చదువుకుంటున్నాడని అందరికీ చెప్పుకునే తిరిగేవాళ్ళు పోరిగాడు, అతడి భార్య. అలాంటివాళ్లు ఒక రోజు సెలవులకు ఇంటికొచ్చిన కొడుకుతో పులిపంజాకు బలైపోయారు. జనం వారి ఇంటి చుట్టూ చేరి, వాళ్ళ శరీరాల్ని చూస్తూ బాధ పడ్డారు. పోలీసులచ్చి మూడు శవాలకు పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ వార్త మీడియాలో పెద్ద దుమారాన్ని లేపింది. అధికారులు నివేదికలు తయారు చేయడంలో నిమగమై ఉన్నారు. ఈ సంఘటనలో నిజానిజాలేమిటో తెలుసుకోవాలనుకుంటే కొండపరియ కథను చదవాల్సిందే! ప్రముఖ కథకులు ఎమ్వీ రామిరెడ్డి ఈ పుస్తకం బ్లర్బ్‌లో చెప్పినట్లు ఫ్యూడల్‌ వ్యవస్థలో మానవజాతి పులిపంజాకు ఎలా బలైపోతుందో కళ్ళకు కట్టిన కథ ఇది.
అనేకమంది అమ్మాయిలను తన వలలో వేసుకున్న వంచకుడి ప్రేమ చెరసాలలో చిక్కుకున్న ఒక యువతీ ఎలా బయటపడగలిగిందో చెప్పిన కథ ‘చేతి కర్ర’. పెళ్ళయ్యాకైనా చదువుకోవాలని చూసే సరోజకు కూతురు రూపంలో ఎటువంటి అవకాశం దొరికిందో చెప్పే కథ ‘మిణుగురు’. ఒక వేశ్యలో తల్లిని, గురువును చూసుకున్న శివరాం కథ ‘మా..!’. మనలో ఉన్న భావోద్వేగాల్ని తడిమే కథ ‘ఫోటో’. … ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కథలోనూ సామాజిక రుగ్మతనో, మానవత్వాన్నో, మూలాల్నో వెలికి తీసే ప్రయత్నాలే చేశారు రచయిత. ఇవన్నీ చదువుతుంటే ఆయన ఎంతటి మానసిక క్షోభకు గురై, వీటిని కథలుగా మలిచారోననిపిస్తుంది.
ఈ కథాసంపుటిలోని ఒక్కొక్క కథను చదువుతుంటే మన మనసుపై ఎవరో కొరడాతో కొట్టినట్లు ఉంటుంది. చూసీ చూడనట్లుండే మన వైఖరిని ప్రశ్నించినట్లుంది. నీ వంతుగా నీవేం చేస్తున్నావో చెప్పమని అడిగినట్లుంటుంది. వీటిని కథల్లా చదివి ఊరుకుందామంటే మనల్ని ఓ పట్టాన కుదురుగా ఉండనివ్వవు.. మధ్య తరగతి జీవితాల ప్రదర్శనలివి.
ఈతకోట సుబ్బారావు కథకుడిగా, కవిగా, స్థానిక చరిత్ర అభిమానిగా (నెల్లూరు), పాత్రికేయునిగా, సంపాదకునిగా నాలుగు దశాబ్దాల పాటు సాహితీ రంగంలో తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సంపాదకునిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 16 పుస్తకాలను వెలువరించారు. అందులో ఏడు చరిత్రకు సంబంధించినవి, మరో ఏడు కవిత్వానికి సంబంధించినవి. పదకొండేళ్ళ క్రితం ఆయన ‘కాశీబుగ్గ’ అనే కథాసంపుటిని వెలువరించారు. అది ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పోడుగాలి కూడా అంతే ఆదరణను పొందాలని ఆశిద్దాం. ఈ సంపుటికి ఎమ్వీ రామిరెడ్డి రాసిన అట్ట వెనుక మాట రచయిత అంతరంగాన్ని, ఈ సంపుటి ఉద్దేశ్యాన్ని తెలియజేస్తోంది. బంగారు బ్రహ్మం రూపొందించిన ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది. ఈ కథాసంపుటి ప్రతులకు (వెల.రూ.200, పేజీలు : 180) రచయితని 94405 29785 నెంబర్లో సంప్రదించొచ్చు.
– దొండపాటి కృష్ణ
90523 26864

➡️