కవిత్వం చిరంజీవి

Mar 17,2025 00:22 #Literature, #Poetry

కవిత్వం మనిషంత ప్రాచీనం
ఆదికవులంటూ ఎవరూ లేరు, ఆదిమ కవులు తప్ప.
కవిత్వం మానవానుభవ కళారూపం
అది భారతి దయాకాదు,
దైవ ప్రసాదమూ కాదు.
కవులు సానబట్టిన వజ్రం కవిత్వం.
కవిత్వం మారుతుంది
మనిషి లాగా, జగతి లాగా.
కవిత్వం మనం స్నేహం
అవసరమైతే మన పాలిటి కరవాలం
రెండువైపులా పదునున్న కత్తి కవిత్వం
మనల్ని నిద్దుర లేపుతుందీ, నిద్రపుచ్చుతుంది కూడా.
రాజులను పొగిడింది
జమీందారులను కీర్తించింది
ప్రజలకు జేకొట్టింది.
కవిత్వం కాలజ్ఞాని
సమయస్ఫూర్తి
కవిత్వానికి తెలిసిన కళ.
వాణి నా రాణి అన్న వారిని
కాల సముద్రంలో కలిపేసింది
కవిత్వం పెంపుడు చిలుక కాదు
పలుకమన్నట్లు పలకడానికి.
కవిత్వం పెంపుడు జంతువు కాదు
ఆడమన్నట్లు ఆడడానికి.
కవిత్వం ఆత్మగౌరవ కళ .
దానికి ఆకాశంలో తలలూపే కొమ్మలే కాదు
నేలలోని తల్లివేరు కూడా తెలుసు
కవిత్వాన్ని మనిషి భిక్షాపాత్రను చేశాడు
రక్షాకవచం చేసుకున్నాడు
అందమైన అల్లిక చేశాడు
ఆగ్రహజ్వాలిక చేశాడు
ఉద్యమ గీతిక చేశాడు
ఉబుసుపోక బొమ్మనూ చేశాడు.
కవిత్వం ఒక అమీబా.
తిలక్‌ చెప్పినట్లు కవిత్వం
ఒక ఆల్కెమీ.
అది కవికే తెలుసు.
కవిత్వం పుట్టుకే గాని
మరణం లేని చిరంజీవి
మనిషి నుంచి మనిషికోసం పుట్టిన అమృతభాండం.
అది చిరంజీవి!
(ఈనెల 21 ప్రపంచ కవిత్వదినోత్సవం సందర్భంగా
ప్రపంచ కవులకు శుభాకాంక్షలతో)

– రాచపాళెం
94402 22117

➡️