ఇప్పుడు
తెలుగు గుండెలన్నీ
దిగులు గండ్లు పడిన దృశ్యాలు
లోపలంతా
వరద సుడుల బీభత్సం
నరాల నాళాలు మూసుకు పోయి
దుఃఖపు పొంగు
ఎగజిమ్మే దృశ్యాలు.
పంటలు చెట్లు
వంతెనలు రైలుకట్టలు
ముక్కలు చెక్కలై
ఆకాశం కొండ చెరియలుగా
విరిగి ధ్వంస రచన వేసిన దృశ్యాలు
ఊళ్ళు బీళ్ళు
నదులు ఏళ్ళు
సముద్రాలుగా వేషం కట్టిన
కన్నీటి దృశ్యాలు
గుడిసె బతుకులన్నీ
ప్రవాహ పాయల్లో
ఉత్త చేతులతో ఎదురీదే
చావు బతుకుల దృశ్యాలు.
చెరువులన్నీ
జల సర్పాలై ఊళ్ళను
మింగేసిన దృశ్యాలు
ఇప్పుడు
బతుకులన్నీ బురద నీటిలో
పూచిన కన్నీటి పుష్పాలు!
– మణీందర్
9948326270