పోరాట చరిత్రల పరిశోధకుడు

1986 డిసెంబర్లో బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో తెలుగు ఎంఏ చేద్దామని వారణాసి వెళ్లాను. మొదటి మూడు నాలుగు నెలలు చాలా సాధారణంగా గడిచిపోయాయి. నాలుగు నెలల తరువాత ఒక తుపాన్లా వచ్చాడు. తన పేరు ముత్యం అని చెప్పుకున్నాడు. ‘అవునా సార్‌!’ అంటే, ‘సార్‌ ఏంటి? ముత్యం అని మాత్రమే పిలవండి’ అన్నాడు. అక్కడి నుంచి మొదలైంది ముత్యంతో నా సాహితీ యాత్ర. నిజానికి పాపినేని శివశంకర్‌, కడియాల రామ్మోహన్‌ రారు గార్ల దగ్గర ఇంటర్‌, డిగ్రీలలో పాఠాలు చదువుకున్నానే కానీ, వారి సాహిత్య కృషి గురించి పెద్దగా తెలియదు. వారిని ముత్యం నాకు పునః పరి చయం చేశాడు. చలం, గోపీచంద్‌, కోకు, బుచ్చిబాబు, రావిశాస్త్రి ఇత్యాదుల పుస్తకాలు రోజూ ఒకటి చొప్పున ఇచ్చి చదివించేవాడు. ఆ పుస్తకాల మీద చర్చలు పెట్టేవాడు. నేను సాహిత్యంలో ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి పూర్తిగా కారణం ముత్యమే. తాను పరిచయం అవ్వడానికి పూర్వం నేను యండమూరి రచనలు అంటే పడి చచ్చేవాడిని. అలాంటి నాకు బాలగోపాల్‌ వ్యాస సంపుటి ‘రూపం – సారం’ ఇచ్చి చదవమన్నాడు. బాలగోపాల్‌ స్యూడో సైంటిఫిక్‌ నవలల మీద రాసిన వ్యాసం నా దిశను మార్చింది. పుస్తకాల్లోని అంశాలను వివరించి చెప్పడం కంటే, ఆ పుస్తకాన్ని ఇచ్చి చదవమని చెప్పి ఆ తర్వాత దాని మీద చర్చ పెట్టేవాడు.
ప్రచురణ సౌకర్యాలు ఇన్ని లేని కాలంలో తెలుగు డిపార్ట్మెంట్లో మాత్రమే తెలుగు టైప్‌ రైటర్‌ ఉన్న బనారస్‌ హిందూ యూనివర్సిటీలో యువ మిత్రులతో కలిసి వెలుగు పత్రికను నడిపాడు ముత్యం. దాదాపు 7 సంచికలు వచ్చాయి. నేను శ్రీశ్రీ ప్రతిజ్ఞ కవిత మీద రాసిన వ్యాసాన్ని వెలుగు పత్రికలో ప్రచురించాడు. స్థానిక హిందీ మిత్రులను కూడా చాలా సులువుగా కలుపుకొని, సరదాగా జోకులు వేసుకుంటూ, సీరియస్‌ విషయాల దగ్గర సీరియస్‌గా ఉంటూ, ఏ విషయం పట్ల అయినా నిర్దిష్టమైన నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం అతని దగ్గర చూశాను. అతనికున్న అనేక ఆసక్తుల్లో ఫొటోగ్రఫీ ఒక ప్రత్యేక ఆసక్తి. 1500 ఎకరాలకు పైగా ఉన్నా యూనివర్సిటీలో మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఎవరూ అప్పటివరకు తీయని దృశ్యాలను ఎక్స్‌పోజ్‌ చేయాలని ఫొటోలు తీయడం అతని ప్రత్యేకత. సారనాథ్‌ వెళ్లినా దేవదరి, రాజ్‌ దరి వాటర్‌ ఫాల్స్‌కు వెళ్లినా, నేపాల్‌ వెళ్లినా ఏదో ఒక కొత్త కోణంలో ఫొటోలు తీసేవాడు.
యూనివర్సిటీలో మొదలైన మా స్నేహం పెళ్లిళ్లు అయిన తర్వాత కూడా కుటుంబాలతో సహా కొనసాగడం చాలా సంతోషకరమైన విషయం. రాయడంలో మెలకువలు మా గురువు పాపినేని గారి దగ్గర నేర్చుకున్నా, కవిత్వం రాయమని ప్రోత్సహించింది మాత్రం ముత్యమే. నా మొదటి కవితా సంపుటి ‘చెమట చిత్తడి నేల’ తన ప్రచురణ సంస్థ ‘దృష్టి’ ద్వారా తీసుకురావడమే కాక, ‘దృష్టి సారిస్తూ’ అంటూ నాలుగు ప్రోత్సాహక వాక్యాలు రాశాడు. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జీవితం, ప్రవహించే జ్ఞాపకం (గంటి రాజేశ్వరరావు జీవితం), పుల్లెల శ్యామసుందర్రావు జీవితం, సర్వదేవ పట్ల రామనాథం జీవితం, పిండిప్రోలు తదితర పుస్తకాల ప్రచురణలో నా పాత్ర కూడా ఉండడం సంతోషకరమైన విషయం.
శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం మీద పరిశోధన చేసే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి అనేక మందిని కలిసాడు. ఎన్నో గ్రామాలు సందర్శించాడు. వందలకొద్దీ పేజీల డాక్యుమెంట్లను సేకరించాడు. పదుల సంఖ్యలో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసాడు. పిహెచ్‌డి చెయ్యడానికి ఐదేళ్లకాలం పడితే మూడున్నరేళ్లకు పైగా క్షేత్ర పర్యటనలోనే ఉన్నాడంటే ఎంత విస్తృతంగా సమాచార సేకరణ చేశాడో అర్థం అవుతుంది. ముత్యం ఎంచుకున్న పరిశోధనా ప్రణాళిక కూడా సాధారణ పరిశోధనల కంటే భిన్నమైనది. సిద్ధాంత వ్యాసం రాసే పరిశోధకులు ఎక్కువమంది ఇతరుల పుస్తకాల నుంచి లేదా ప్రముఖుల ఇంటర్వ్యూల నుంచి ఎక్కువ ఉటంకింపులు పేర్కొంటూ పెద్దగా తమదైన విశ్లేషణలు చేయరు. కానీ, ముత్యం ఏ పుస్తకం రాసినా అలభ్య వివరాలను మన ముందు ఉంచుతూనే, అందులోని అనేక అంశాలను విశ్లేషణ పూర్వకంగా వివరిస్తాడు. శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యంలో వస్తువు గురించి వివరిస్తూ పాణిగ్రాహి మొదలుకొని ఏజెన్సీ ఉద్యమ కవుల పాటల్లో వస్తున్న వస్తువును వారు ఎంచుకున్న విధానాన్ని వివరిస్తాడు. పాణిగ్రాహి పాటల్లో ఎరుపు, కమ్యూనిస్టులం అనే పాటల్లో దృక్పథ ప్రకటన, ఈ పాలన మనకెందుకు, దేశభక్తులు, దొంగాటకం పాటల్లో పరిపాలనలోని అస్తవ్యస్తతలు; మేలుకో, తెలుసుకో లాంటి పాటల్లో ప్రభోదాత్మకత ఎలా ఉంటుందో వివరిస్తాడు. ఉద్యమస్ఫూర్తితో ఉద్యమం కోసం వెలువడిన ప్రతి వాక్యాన్ని తరచి తరచి చూసి విశ్లేషణ చేశాడు ముత్యం. శ్రీకాకుళం జిల్లా భూగోళిక పరిస్థితుల నుంచి మొదలుపెట్టి గిరిజన ప్రాంతాల జనజీవనం వరకు, ఉద్యమ నేపథ్యంలో సాహిత్య, సాంస్క ృతిక రంగాల్లో పరిణామ క్రమం, ఉద్యమ ఘటనల నేపథ్యంలో వెలువడ్డ రచనల విశ్లేషణ మొదలైన విధాలుగా పరిశోధనను విభజించుకొని అధ్యాయాలుగా రచన సాగించాడు. మందస రైతుల ప్రతిఘటన చరిత్రను ‘సునాముది జీవధార’ పేరుతో ఒక పుస్తకంగా వెలువరించాడు ముత్యం. దీనిని ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ముద్రించింది. ఇప్పటి తరానికి ఈ చరిత్రను అందించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ, 1967 ప్రాంతాల్లో శ్రీకాకుళం పోరాటానికి, 1940లలోనే బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా సాగిన మందస రైతుల పోరాట చరిత్ర ఎలా స్ఫూర్తిగా నిలిచిందో, రాజకీయ ప్రాధాన్యం ఉన్న పోరాటాల్లో సాహిత్యం తన పాత్రను ఎలా పోషించిందో తెలుసుకోవడానికి ఈ రచనలు ఉపయోగపడతాయి అంటాడు ముత్యం.
జీవిత చరిత్రలు సాధారణంగా పాఠకులకు స్ఫూర్తినిస్తాయి. అందునా ఉద్యమశీలురైన వారి జీవితాలు పాఠకుల్ని ఉద్వేగ పరుస్తాయి. ముత్యం నేను చిందుల ఎల్లమ్మను, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి, సుబ్బారావు పాణిగ్రాహి, గరిమెళ్ళ, సర్వదేవభట్ల రామనాథం, సోయం గంగులు, మేర మల్లేశం, మార్పు పద్మనాభం, గానుగుల తరుణాచారి, బెందాళం గవరయ్య, పుల్లెల శ్యామసుందర రావు లాంటి వారి జీవిత చరిత్రలను అక్షరీకరించి నేటి తరానికి అందించాడు. తెలంగాణ ప్రాంతమంతా పర్యటించి ఆయా ప్రాంతాల సామెతలు (శాస్త్రాలు) జానపద గీతాలు ఎన్నింటినో సేకరించాడు. సామెతలు కొన్ని పుస్తక రూపంలో వచ్చాయి కానీ, జానపద గీతాలు రావాల్సి ఉంది. తన స్వీయ చరిత్రను కొంతవరకు రాశాడు కానీ అసంపూర్తిగా మిగిలిపోయి ఉంది. ముత్యం లాంటి అరుదైన పరిశోధకుడ్ని కోల్పోవడం తెలుగు సాహిత్య పరిశోధనకు తీరని లోటు.

– బండ్ల మాధవరావు
88976 23332

➡️