తిరోగమనం

Oct 7,2024 05:10 #kavithalu, #retreat, #sahityam

అతడు అపసవ్య దిశలో పయనిస్తున్నాడు
కళ్ళకు గంతలు కట్టుకొని
కబోదిలా పయనం సాగిస్తున్నాడు
సతిని సంకనేసుకొని
శ్మశానంలో నిట్టనిలువునా
కాల్చేద్దాం పదండని
కాలయముడవుతున్నాడు!

ఏం చేద్దాం, మనం?

కత్తికి కంకణం కట్టి
కామందు రాబందులా
కోడిపిల్లని తన్నుకుపోయే గద్దలా
మగువను మాతంగిని చేసి
మరలా మన రుణం తీర్చుకుందామంటావా!
క్షద్రపూజల చేతబడి, చిల్లంగి, బాణామతిని నెత్తుకొని
అమాయకులను అంతం చేద్దామా!?

అతడు కాలాన్ని మరిచి వెనక్కి నడుస్తున్నాడు
ఏం చేద్దాం, మనం?
కన్న బిడ్డలను కన్నిరకానికి
అప్పజెప్పి కాలయముడి
కబంధ హస్తాలకు అప్పగిద్దామంటావా?
అతడు పాదాలు వెనక్కి తిప్పి
పిశాచిలా నడుస్తున్నాడు
ఏం చేద్దాం, మనం?

పాలుగారే పసిబిడ్డలకు పెళ్ళి పేరున
పాడెకట్టి బంగారు భవిష్యత్‌ను
చితి మంటల్లో దగ్ధం చేద్దామా?
కులాన్ని, మతాన్ని భుజాలకెత్తుకొని
మనుధర్మాన్ని ముందుంచుకొని
మరలా వెనక్కి నడుద్దామంటారా!
ఆకులు అలములు మొలలకు కట్టుకొని
దుంపలు, గడ్డలు తిని
మళ్లీ రాతి గుహల్లో జీవిద్దామంటావా?
నిప్పును ఉప్పును పాతరేసి
అజ్ఞాన అంధకారపు బంధురాల్లోకి
మళ్లీ వెనక్కి నడుద్దామంటావా?
యంత్రాలు పక్కనబెట్టి మంత్రాలను వల్లిస్తూ
బిళ్ళగోచితో మళ్లీ వెనక్కి వెనక్కి నడుద్దామంటావా?

– ఎజ్రాశాస్త్రి
80962 25974

➡️