27న గుంటూరులో సాహిత్య పురస్కార సభ

Sep 23,2024 04:53 #Awards, #Gurram Jashuva, #Literature

నేటి సమాజిక, ఆరిక రాజకీయ పరిణామాల నేపధ్యంలో గుర్రం జాషువా సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకవెళ్ళాల్సిన అవసరం వుంది. జాషువా 1895 సెప్టెంబర్‌ 28న ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని చాట్రగడ్డపాడులో జన్మించారు. నాటి సమాజిక పరిస్థితుల్లో కుల వివక్షకు గురై తన జీవితాంతం సామాజిక రుగ్మతులకు వ్యతిరేకంగా తన గళాన్ని, కలాన్ని ఎక్కుపెట్టారు. కుల, మత, ప్రాంతీయ తత్వాలు, కుల వివక్ష, అంటరానితనం, పేదరికం, మూఢచారాలు, అంధ విశ్వాసాలు, కర్మ సిద్ధాంతం, విగ్రహారాధన, మహిళలపై అకృత్యాలకు వ్యతిరేకంగా తన సాహిత్యాన్ని ప్రజలకు అందించి చైతన్యం చేశారు. జాషువా విజ్ఞాన కేంద్రం గత 10 ఏళ్ల నుంచి జాషువా జయంతి సందర్భంగా అనేక సమకాలీన అంశాలపై సదస్సులు, గోష్టులు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ సాహిత్యరంగంలో సేవలందించిన ప్రముఖులకు ఈ సందర్భంగా జాషువా సాహిత్య పురస్కారాన్ని అందిస్తుంది. 2014 నుంచి ఇప్పటివరకూ గోరటి వెంకన్న, సుద్దాల ఆశోక్‌ తేజ, చంద్రబోస్‌, నల్లి ధర్మారావు, పాపినేని శివశంకర్‌, కత్తి పద్మారావు, పిల్లి జయధీర్‌, పాటిబండ్ల ఆనందరావు, ఓల్గా, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తదితర ప్రముఖులకు జాషువా సాహిత్య పురస్కారాన్ని అందించడం జరిగింది. 2024 జాషువా సాహిత్య పురస్కార ప్రదాన సభ ఈ నెల 27న సాయంత్ర 4 గంటలకు గుంటూరులోని జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ప్రముఖ అభ్యుదయ కవి ఆచార్య గుమ్మా సాంబశివరావు; ‘పాడుదమాస్వేచ్ఛాగీతం’ రచయిత, సాహితీ వేత్త గంటేడ గౌరునాయుడుకు ఈ ఏడాది పురస్కారం ప్రదానం చేయాలని కమిటీ నిర్ణయించింది.
డా|| గుమ్మా సాంబశివరావు… గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో జన్మించి నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఎ విద్యను అభ్యసించారు. సర్వ ప్రథమునిగా ఉత్తీర్ణత సాధించి, బాలిశెట్టి వెంకట సుబ్బమ్మ మెమోరియల్‌ బంగారు పతకాన్ని అందు కున్నారు. ‘అన్నమాచార్య కీర్తనలలోని వర్ణనలు’ అనే అంశంపై డాక్టరేట్‌ చేశారు. విజయవాడ లయోలా కళాశాల అద్యాపకునిగా పనిచేశారు. వివిధ సామాజిక, సాంస్క ృతిక అంశాలపై 27 రచనలు చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలోనూ, వివిధ జాతీయ సదస్సుల్లోనూ వందలాది ప్రసంగాలు చేశారు. గంటేడ గౌరునాయుడు .. పార్వతీపురం మన్యం జిల్లాలో కొమరాడ మండలం దళాయి పేటలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేశారు. వీరు రాసిన ”పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతిపతాకం’ గేయం విస్తారమైన ప్రాచుర్యం పొందింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గీతాన్ని విద్యార్థులకు వారి సిలబస్‌లో చేర్చింది. ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరిస్తూ ఆయన వ్రాసిన కవితలు అంబేద్కర్‌ యూనివర్శిటీ పాఠ్యాంశాల్లో చేర్చారు. గౌరు నాయుడు అనేక కథలు, కవితలు, వ్యాసాలూ రాశారు. వివిధ సాహితీ సంస్థల ద్వారా 9 పురస్కారాలను అందుకున్నారు. వీరిద్దరికీ 2024 గుర్రం జాషువా సాహితీ పురస్కారం చేయడం జరుగుతుంది. శాసనమండలి సభ్యులు కె.ఎస్‌.లక్ష్మణరావు అధ్యక్షతన పురస్కార ప్రదాన సభలో మాజీ ఎమ్మెల్సీలు ఎం.వి.ఎస్‌.శర్మ, వి.బాలసుబ్రమణ్యం; సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ తదితరులు ప్రసంగిస్తారు. సాహితీమిత్రులు హాజరు కావాల్సిందిగా మనవి.

– పాశం రామారావు, మేనేజింగ్‌ ట్రస్టీ,
గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, గుంటూరు.
94900 98624

➡️