డా. జోస్యుల కష్ణబాబుగారి సిద్ధాంత వ్యాసం ఇది. సాహిత్యం మీద వల్లమాలిన మక్కువతో ఏదో చెయ్యాలన్న తపనతో ఒక జిజ్ఞాసువు ప్రారంభించిన పని. ఎత్తిపోతల పథకాల వాళ్ళ వల్ల కొంత పరువు కోల్పోయింది కానీ పిహెచ్.డి.కోసం చేసే పరిశోధన అంత తేలిక పని కాదు. ఎంతో అన్వేషణ, మరెంతో తవ్వకం, చాలా నైపుణ్యం, శ్రద్ధా గట్రా అవసరమవుతాయి.
పరిశోధన ఒక భవనం లాంటిది, కష్టపడి కట్టుకు రావాలి. చిత్రమేమిటంటే కట్టుబడి పూర్తయ్యాక ఉండదు కానీ తయారయ్యే పర్యంతం పరిశోధకుడు యావచ్ఛక్తీ వెచ్చించి దాని భారాన్ని మోస్తూనే ఉంటాడు. కాబట్టి తీసుకునే పరిశోధనాంశానికి ఏదో ఒకరకమైన ప్రాధాన్యం ఉండాలి. లేకపోతే అవన్నీ నిరర్థకాలయిపోతాయి.
కృష్ణబాబు గారి ఈ పరిశోధనకు ఏవిధమైన ప్రాధాన్యం ఉందో చూద్దాం. ఒకప్పుడు తెలుగువాళ్ళ వినోదకాలాన్ని ఆక్రమించిన కళల్లో నాటకానిది పెద్దపీట. అతి ప్రముఖంగా తెలుగు రంగస్థలాన్ని ఏలిన నాటకాల్లో హరిశ్చంద్ర నాటకం ఒకటి. దానితో సమస్థాయివిగా పేర్కొనదగ్గ నాటకాలు బహుశా గయోపాఖ్యానం, తిరుపతి కవుల పాండవ నాటకాలు మాత్రమేనేమో!
గురజాడ అప్పారావు గారు ఒకచోట హరిశ్చంద్ర నాటకాన్ని ప్రస్తావిస్తూ ‘హరిశ్చంద్ర కథ దాన్ని కల్పించిన నాటి జాతి హృదయానికి ప్రతిబింబం’ అన్నారు. సత్యాచరణ, సత్యవాక్కు జాతి నిర్దేశించుకున్న నైతిక విలువలని ఆయన ఆంతర్యం. ఇది ఉపరితల దృష్టి కాదు. సాహిత్యపు మూలాలను తవ్వి చూసే చూపు. జాతి తన స్వభావాన్ని ఆవిష్కరించే సాహిత్యాన్నే తలదాలుస్తుందని, కాలానికి నిలిచే రచనల లోతు మనం జాగ్రత్తగా ఆలోచించి నిర్ధారించుకోవలసి ఉందని ఈ వాక్యం సూచిస్తుంది.
కవులు కథను మార్చి రాసెయ్యడం, ప్రజలు దాన్నే అసలుగా భావించి ఆదరించడం ఆశ్చర్యం. అబద్ధాల హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడయిపోయాడు రచయితల చేతిలో. ఈ వెసులుబాటు పౌరాణిక ఇతివృత్తాలకు మాత్రమే ఉంటుంది. ప్రజలు పురాణాలను నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు.
హరిశ్చంద్రుడు వేద హరిశ్చంద్రుడిగానే ఉండిపోయినట్టయితే ఎప్పుడో రూపుమాసి పోయి ఉండేవాడు. సత్యహరిశ్చంద్రుడవడం వల్లనే నిలిచాడు. ప్రజలకు ధీరశాంతుడంటే వల్లమాలిన ఇష్టం అని, కరుణ రసప్రధానాలైన రచనలు వాళ్ళని బాగా ఆకట్టుకుంటాయని అర్థం. ఇది హరిశ్చంద్రుడి కథకీ, తెలుగుజాతి హృదయానికీ మధ్య ఉన్న లంకె. అంతగా జనాదరణ పాత్రమైన ఆ నాటకాన్ని తన పరిశోధనకు విషయంగా ఎన్నుకున్నారు కృష్ణబాబు గారు.
పరిశోధనాంశానికీ, పరిశోధకుడికీ మధ్య ఆనుకూల్యం అవసరం. అది లోపిస్తే పరిశోధన అమనస్కంగా సాగుతుంది. కృష్ణబాబు గారు తనకి నచ్చిన అంశాన్నే స్వీకరించారు. ఆయన సాత్త్వికులు. కరుణ రసాస్వాదనకు ఉన్ముఖంగా ఉండే మనస్సు ఆయనది. పద్య ప్రియులు. సాంప్రదాయిక వస్తువిశేషాల మీద సతార్కికమైన గౌరవం ఉన్న వ్యక్తి. అందుచేత హరిశ్చంద్ర నాటకం ఆయనను బాగా ఆకర్షించి ఉంటుంది.
ఆ నాటకం ఎందుకిన్ని ప్రదర్శనలకు నోచుకుంది? అందులో జాతిమమైకం కావడానికి మూలమైన విషయం ఏమిటి? ఎందుకిందరు రచయితలు దాని మీద మక్కువ పడ్డారు? ఏ ఇతర ఇతివృత్తమూ ఇందరు రచయితలకు గ్రహణయోగ్యం కాలేదెందుకు? ఇవి ఆలోచనీయాంశాలే. వీటిని ఆలోచించి సవిస్తరంగా ఈ వ్యాసాన్ని రూపొందించారు కృష్ణబాబు గారు. ఈ పరి శోధనలో ప్రత్యేకంగా ప్రశంసించదగ్గ విషయాలు కొన్ని ఉన్నాయి.
1. సేకరణ : రామకథ తర్వాత ఇన్ని ప్రక్రియల్లో వచ్చిన ఇతివృత్తం హరిశ్చంద్ర కథేనన్నారు కృష్ణబాబు. 50కి పైగా నాటక రచనలున్నాయని తేల్చారు. తెలుగులో ఇన్ని హరిశ్చంద్ర నాటకాలున్నాయని కృష్ణబాబు గారు సేకరించి చూపించేదాకా చాలామందికి తెలియదు. అవి సంఖ్యలో తక్కువగా ఏమీ లేవు. చాలా కష్టపడి అముద్రిత నాటకాలను కూడా సంపాదించారు. పుస్తకాల కోసం అనేక గ్రంథాయాలను సందర్శించారు. రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం, కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్తు గ్రంథాలయం, వేటపాలెం సారస్వత నికేతనం చూసారు. మద్రాసు కన్నె మరా లైబ్రరీ, ఓరియంటల్ మాన్యుస్క్రిప్టు లైబ్రరీల పుస్తకాలను కూడా తిరగేసారు. తనకు ముందు ఈ అంశంమీద కృషి చేసిన ప్రముఖుల్ని కూడా కలుసుకుని విషయ సేకరణ చెయ్యడం, అనుమాన నివృత్తి చేసుకోవడం, మరో విశేషం. తెలుగు నాటకరంగం అనగానే గుర్తుకు వచ్చే పరిశోధకుడు పి.ఎస్.ఆర్. అప్పారావు గారు. ఆయనను కలిసి మాట్లాడారు. అలాగే మద్రాసు వెళ్ళి, తెలుగులో హరిశ్చంద్రో పాఖ్యానాల మీద పరిశోధన చేసిన వాసా ప్రభావతి గారిని సంప్రదించారు. నాటకాల విషయంలో పరిశోధకులకు కూడా తెలియని విషయాలు కొన్ని నటులకు, నటశిక్షకులకు తెలుస్తాయి. కృష్ణబాబు గారు ఒక నటుడిని ఇంటర్వ్యూ చేసి రాబట్టిన విషయాల్ని అనుబంధంలో ఇచ్చారు. హరిశ్చంద్ర నాటకం ప్రధానంగా పద్యనాటకం కావడం చేత నటులకు పద్యాల్లో తర్ఫీదునిచ్చే హార్మోనిస్టులకి కొన్ని అరుదైన విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రసిద్ధ హార్మోనిస్టు గుడిమెట్ల గంగరాజు గారిని కూడా కలిసి విషయ సేకరణ చేసారు. అంతవరకూ ఎవరికీ తెలియని నాటకం ‘ముఖ పత్రాదులు లేని నాటకం’ ఆయనవల్ల దొరికిందట. ఇవన్నీ కృష్ణబాబు గారి శ్రద్ధకి సూచికలు. అందువల్ల సేకరణ విషయంలో ఆయనకి నూటికి నూరుశాతం మార్కులు.
2. విశ్లేషణ : సాధారణంగా పరిశోధకులు తాము విశ్లేషిస్తున్న రచనల్లోని లోపాలను ప్రస్తావించరు. ఆ పనిచెయ్యరు సరిగదా అర్హతకు మించి ప్రశంసలు కుమ్మరిస్తారు. కృష్ణబాబు గారు ఆ పాపాలకి పాల్పడలేదు. ఒక నాటకం రసహీనంగా ఉందని చెప్పడానికిగాని, ఫలానా కల్పన వల్ల ఒనగూడిన ప్రయోజనం ఏమీ లేదని వివరించడానికిగాని, కొండొకచో ‘ఈ కవిగారి పాండిత్యం, శబ్దాలంకార ప్రియత్వం, అనౌచిత్యం ఈ మూడూ ఈ పద్యంలో పోటీ పడ్డాయి.’ అనడానికి గాని సంకోచించలేదు. తెలుగు పరిశోధనలలో విమర్శ పాలు చాలా హెచ్చుగా ఉంటోంది. కానీ విమర్శ పేరుతో అతి ప్రశంసమాత్రమే ప్రత్యక్షమౌతోంది. విమర్శ అన్నప్పుడు గుణదోష విచారణలు రెండూ ఉండాలని ఈ పరిశోధకుడికి తెలుసు. ఏయే నాటకాలు బాగున్నాయో ఏవి తేలిపోయాయో స్పష్టంగా చెప్పారు. ఎవరెవరి చేతుల్లో హరిశ్చంద్ర నాటకం ఏయే మార్పులకు గురయిందో వివరంగా తెలియచేసారు.
3. శైలి : పరిశోధన గ్రంథాల శైలిలో పఠనసుఖం ఉండదు. (ఇటీవలివి కావు. ఒక 30 ఏళ్ళ క్రితం గ్రంథాల సంగతి.) పాండిత్య క్లిష్టత ఒకటి అడ్డుతగులుతూ ఉంటుంది. ఈ సిద్ధాంత వ్యాసం 1995 నాటిదే అయినా ఇందులో ఆ ఇబ్బంది లేదు. చాలా సరళంగా విషయ ప్రధానంగా సాగింది రచన. ఇందుకు రచయితను మెచ్చుకోవాల్సిందే.
4. స్వీయ అనుదానం : ఎత్తి రాయడమే పరిశోధన అని ఎగతాళికి గురవుతున్న రోజుల్లో స్వీయ అనుదానం స్వీయాభిప్రాయం ఉన్న రచనలు ప్రశంసార్హాలు. ఈ రచనలోంచి కొన్ని ఉదాహరణలు చెబుతాను.
వేద హరిశ్చంద్ర కథలోనూ పురాణ హరిశ్చంద్ర కథలోనూ చాలా భేదం కనిపిస్తుంది. అది చాలామందికి తెలిసిన విషయమే. అవి ఒకదానినుంచి ఒకటి పరిణామం చెందిన రీతి మాత్రం తెలియదు. ఆ రెండు కథలకూ ముడివేసింది దేవీ భాగవతం అని తేల్చి చెప్పారు కృష్ణబాబు. 1889లోనే పాత్రోచితభాషతో కూడిన హరిశ్చంద్ర నాటకం వచ్చిందని గమనింపచేసారు.
”నృత్యరూపకాలు సాహిత్య దృష్టితో చూస్తే గొప్పగా అనిపించవు గాని ప్రదర్శన దృష్టితో చూస్తే ఇవే ప్రజాహృదయాన్ని బాగా కదిలిస్తాయి.” (పుట-311) అని వ్యాఖ్య ఒకటి చేసారు. ఇది చాలా మంచి గమనింపు. దృశ్య రూపం ఎదలోతులకు దిగిన రీతిలో అక్షరరూపం దిగదు. యక్షగాన రచనల వంటి హరిశ్చంద్ర రూపకాలకు కూడా తన పరిశోధనలో భాగం కల్పించడం ఒక విశేషం.
5. నిష్పక్షపాత వైఖరి : కృష్ణబాబు గారి గ్రంథంలో మరొక విశేషం పురాణవైర రచనల్ని కూడా సమానంగా ఆదరించడం. చలం, నార్ల రాసిన హరిశ్చంద్ర నాటకాలను పరిశీలించినప్పుడు తన వైముఖ్యం గాని, ఆనుకూల్యం గాని ఆ పరిశీలనల్ని ప్రభావితం చెయ్యకుండా రాయడాన్ని గమనించవచ్చు. ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే పక్షపాత వైఖరిని తప్పించుకోవడం చాలా కష్టం. ఉదాహరణకు నవలా సాహిత్యం మీద పరిశోధన చేసిన బి.వి. కుటుంబ రావు గారు ఎంతో శ్రమకోర్చి వందలాది నవలల్ని విశ్లేషించి పెద్ద సిద్ధాంత గ్రంథాన్ని తయారుచేసారు కానీ చలం వంటి కొందరు రచయితల నవలల్ని గురించి రాసినప్పుడు నిష్పాక్షికతను పాటించలేకపోయారు.
పాఠకులు ఈ గ్రంథాన్ని ఆదరించడానికి ఈ సుగుణాలు చాలవా? ఇప్పటికయినా తన పరిశోధక శ్రమను అచ్చులోపోసి ప్రకటిస్తున్నందుకు మిత్రులు కృష్ణబాబు గారికి అభినందనలు. ఈ పుస్తకంలో నాకు కూడా ఇలా ఒక పాత్ర కల్పించినందుకు ధన్యవాదాలు.
– రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
విశ్రాంత ప్రిన్సిపాల్
7799111456