ఆరు నాటికలు .. ఆరు ఇతివృత్తాలు

Feb 3,2025 05:14 #natikala potilu, #page, #sahityam

నాటకాల్ని పరిషత్తులే బతికిస్తున్నాయనేది ఓ బలమైన వాదన. వాస్తవానికి పరిషత్తులే నాటకాన్ని నీరుగారుస్తున్నాయనే అభిప్రాయం కూడా గట్టిగానే వినిపిస్తుంటుంది. ‘బహుమతుల ఎంపికకు అత్యధికులు అంగీకరించే శాస్త్రీయ.. నిర్దిష్ట ప్రమాణాలేవీ’ అనేది దీర్ఘకాలంగా వినిపిస్తున్న ఆక్షేపణే. అందుకేనేమో ఈసారి ‘తపస్వి…’ నిర్వాహకులు ‘ఉత్సవాలే’ నిర్వహించారు. అయితే పరిషత్తుల్లో ప్రదర్శించేంత ‘సీరియస్నెస్‌’ ఉత్సవాల్లో కానరాదు వంటి అభిప్రాయం పూర్తి అసంబద్ధంగా కొట్టిపారేయలేమనిపించింది- ఒకటి రెండు ప్రదర్శనలు చూశాక. ఎంతో ఉత్సాహంతో వచ్చిన కళాకారులు కొంత నిరుత్సాహం వ్యక్తంచేశారు. జనవరి 27, 28 29 తేదీల్లో విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో- తపస్వి కల్చరల్‌ ఆర్ట్స్‌, ఆంధ్ర నాటక కళా సమితి, కొడాలి బ్రదర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో.. తెలుగు రాష్ట్రాల స్థాయిలో- రోజుకు రెండు చొప్పున ఆరు వైవిధ్య ఇతివత్తాల నాటికలను ప్రదర్శింపజేశారు. చాలావరకు మంచి నాటికలనే ఎంపిక చేశారని నిర్వాహకులను పలువురు అభినందించారు.

మూల్యం : అన్ని రంగాల్లో పురోగమిస్తున్న స్త్రీ- వివాహమైనంత మాత్రాన తన దేహం మీద సర్వహక్కుల్నీ ఎలా, ఎందుకు ఒదులుకోవాలి అని తీవ్రంగా, నిశితంగా నిరసించి.. న్యాయస్థానాన్ని నిలదీసి మరీ సాధించుకున్న స్త్రీమూర్తి స్ఫూర్తిదాయక ఉదంతం ఇతివృత్తంగా సాగిన నాటిక ‘మూల్యం’. లింగ అసమానతనూ దుర్విచక్షణనూ, హక్కుల హననాన్నీ నాటిక సహేతుకంగా, శక్తిమంతంగా ఎండగట్టింది. ‘ఆడ పుట్టుక మీద వివక్ష.. భర్తకు అనంత అధికారమిచ్చిన పెళ్లి.. అర్ధంపర్ధం లేని నిబంధనలతో చట్టాలు చేసిన ప్రభుత్వం… వీరంతా హంతకులే! నా శరీరంలోని అవయవాల మీద హక్కు ముమ్మాటికీ నాదే.. ముమ్మాటికీ నాదేనని నిరూపించుకోవడానికి నేను ఎంత ‘మూల్యం’ చెల్లించుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా? అమూల్యమైన మా నాన్న ప్రాణాలు- నాన్నా’ అంటూ జ్యోతిరాణి భీశెట్టి కూలబడిన పతాక సన్నివేశం ప్రేక్షకుల్ని స్థాణువులన్జేసింది. నాటిక రచనల పోటీల్లో (ఈ నాటిక సహా) పలుమార్లు ప్రథమ బహుమతి అందుకున్న సింహప్రసాద్‌ రచనను డా. వెంకట్‌ గోవాడ సమర్ధ దర్శకత్వంలో గోవాడ క్రియేషన్స్‌, హైదరాబాద్‌ బందం ప్రశంసనీయంగా ప్రదర్శించింది.

గురి తప్పిన వేట : ఓ తాగుబోతు కోటీశ్వరుడి నుంచి డబ్బు సంపాదించే కుటిల బుద్ధితో- అతి వినయం నటించి.. ఆపదను సైతం మీద వేసుకుని మరీ… డ్రైవర్‌గా చేరాలనుకున్న ఓ నయవంచక యువకుడి వేట గురి తప్పిన వైనాన్ని రసఝరి, పొన్నూరు కళాకారులు ప్రదర్శించారు. మూలకథ : శ్రీసుధ మోదుగ, నాటకీకరణ: పిన్నమనేని మృత్యుంజయరావు.. దర్శకత్వం వై ఎస్‌ కృష్ణేశ్వరరావు. (తొలి ప్రదర్శనలో లేని) ముగింపు స్టిల్‌, దానికి ముందు హీరోయిన్‌ డాన్స్‌ బిట్స్‌ సందర్భోచితమనిపించలేదని పలువురు సీనియర్‌ కళాకారులు భావించారు. కారెక్టరైజేషన్‌లో మరింత సమంజసత్వాన్నీ పాత్రోచిత నటనలో మరింత పర్ఫెక్షన్నూ ఆశిస్తారు ప్రేక్షకులు. నెగిటివ్‌ రోల్‌లో భాగ్యరాజ్‌ పాత్రోచితంగా నటించారు.
మహాప్రస్థానం : పేదరికం కష్టాల నుంచి బయటపడేందుకు డబ్బు సంపాదనకై ఇతర దేశాలకు తరలిపోతున్న వారి ఈతిబాధల్ని, అత్యంత దయనీయ పరిస్థితుల్ని కళ్లక్కట్టే ప్రయత్నం చేశారు తపస్వి, విజయవాడ కళాకారులు. ‘మహా ప్రయాణం’, ‘భస్మీపటలం’ అర్ధాలకు నాటిక టైటిల్‌ ‘మహాప్రస్థానం’ సమన్వయం సాధించింది. చావుకీ ప్రయాణానికీ అర్ధం చెదిరిపోతోందంటారు రచయిత ఎం.సంజీవి. దర్శకత్వం పిళ్లా నటరాజ్‌.

ఓ కాశీవాసా, రావయ్యా : మానవత్వపు విలువలు మృగ్యమవుతున్న నేపథ్యంలో ఎవరి తలకి వాళ్లే కొరివి పెట్టుకునే ఓ రోజు వస్తుందేమోనని భయం వ్యక్తంచేస్తూ అలాంటి దౌర్భాగ్యం సంభవించకూడదని రచయిత పి.టి.మాధవ్‌ ప్రగాఢంగా అభిలషిస్తారు. ఏ ఒక్కడూ నలుగురిని దూరం చేసుకోకూడదు.. ఏ నలుగురు ఒక్కడినీ ఒంటరి చేయకూడదు అనే సందేశమిచ్చిన నాటికను కళాభినయ, విశాఖపట్నం బృందం కవి ప్రసాద్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టిపడేసింది.

ఇది అతని సంతకం : జీవితాంతం నిబద్ధతతో కూడిన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి- చరమాంకంలోనూ తమ దంపతులు ఆ ఆదర్శాలను కొనసాగించితీరాలని బలంగా చిత్రించుకుని.. పరిపూర్ణ జీవి ‘కృష్ణమూర్తి’ చేసిన సిగేచరే ‘ఇది అతని సంతకం’. ‘స్నిగ్ధ’ రచనను అభినయ ఆర్ట్స్‌, గుంటూరు వారు ఎన్‌.రవీంద్రరెడ్డి దర్శకత్వంలో మెచ్యూర్డ్‌గా ప్రదర్శించారు.

పేగు రాసిన శాసనం : పేగుబంధం పేరుతో పబ్బం గడుపుకునే స్వార్ధ సంతానానికి కనువిప్పు కలిగించేలా- అర్ధంపర్ధం లేని అసంబద్ధ ప్రేమలతోనే కొట్టుకుపోకుండా అమ్మానాన్నలు చిట్లిన తమ పేగులతోనే కొత్త శాసనం రాయాలంటారు రచయిత డా. చింతకింది శ్రీనివాసరావు. అయినవారే అసలు సంతానం.. సొంతవారయినా కానివారయితే అలాగే చూడాలని ప్రబోధించిన ‘పేగు రాసిన శాసనం’ నాటికను గంగోత్రి, పెదకాకాని కళాకారుల ప్రదర్శన ఈడిగ్గా సాగింది.

ఇంకెన్నాళ్లీ ఇబ్బంది?

హనుమంతరాయ గ్రంథాలయం మైక్‌ సిస్టమ్‌ తరచూ తీవ్ర ఇబ్బంది పెడుతోందని ప్రదర్శకులూ ప్రేక్షకులూ ఎంతగా వాపోతున్నా థియేటర్‌ యాజమాన్యానికి చీమకుట్టినట్టయినా ఉంటే ఒట్టు. తపస్వి నాటకోత్సవాల్లో సైతం కొన్ని నాటికలను మైక్‌ సిస్టమ్‌ ఇబ్బంది పెట్టింది. ఇటీవలే థియేటర్‌ను ఆధునీకరించారు. అయినా రీ సౌండ్‌తో మైక్‌ సిస్టమ్‌ తలనొప్పి కొనసాగుతోంది. ఇకనైనా కళాకారుల, కళాభిమానుల ఆవేదన గ్రంథాలయం పాలకవర్గం పట్టించుకోవాలి.

– జి.వి.రంగారెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు
99126 15747

➡️