మాండలికాల మధ్య వేయిన్నొక్క పాయలుగా
విడివడి నేనున్నా
అంతరించిపోతున్న అక్షరమాలలో
అభ్యుదయమై గగ్గోలు పెడుతున్నా
గాయపడినపుడు బాధతో అరిచే
అమ్మ అనే మాట ఏ గట్టుదో ఏ పుట్టదో అని
కర్బన వయస్సు మాపన పరీక్షల్లో మునిగి తేలుతున్నా…
విరిగి పడి ఉన్న వాళ్ళం
నిటారుగా లేచి నిల్చోడానికి..
మనమంతా ముందుగా మనుషులమనే
ఊతకర్ర వాక్యాలను వెతుక్కుంటూ
నిలదొక్కుకోలేక నిట్టనిలువుగా కూలిపోతున్నా…
అక్షరాలను పుక్కిట పట్టీ పట్టీ ఊపిరి తీయలేక
నీవూ నేనుల మధ్య నాది నాదనే పదాలతో నేలరాలుతున్నా…
ప్రాంతమేదైనా భావమర్థమయినపుడు
గుండె లోతు ఆర్ద్రతను కంటికెత్తుకునే
అక్షర కృతులను ముంచాలనే
తుపానులు తీరాలు దాటుతున్నపుడు…
నేలకొరుగుతున్న వ్రాతల చరితలనూ
తలచుకొంటూ… నెత్తికెత్తున్న ఏ కిరీటమైనా
కీర్తిశేషులైన అందరి మహనీయుల పుణ్య వచనాల ఫలితమని మరచామా అని కన్నీరు పెడుతున్నా…
నేనెక్కడ అంటే ఏమని చెప్పేది
విడగొట్టబడిన సంధుల్లో ఆదేశమైన ఆవేశాన్ని!
– సుమన ప్రణవ్