సృజనాత్మకత వేరు. ఊహలకూ ఆలోచనలకూ రెక్కలు తొడిగి మెప్పించాలి. పరిశోధన అలా కాదు. ఒక పరిధిలోనే పయనించాలి. వాస్తవాన్నే చెప్పాలి. కల్పన కుదరదు. అందుకే పరిశోధన ఎంతో బాధ్యతతో కూడుకుని ఉన్నదని అందరికీ తెలుసు. ప్రామాణికతల్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. విస్తృత అధ్యయనం, తులనాత్మకత దృష్టి అవసరం అవుతుంది. అనేక గ్రంథాలు నిశితంగా పరిశీలనా దృష్టితో చదవాల్సి ఉంటుంది. ఈ పుస్తకం అట్లాంటి శ్రమకు ఫలితంగా భావించొచ్చు. మాన్యులు పి.విష్ణుమూర్తి గారికి ఇట్లాంటి పరిశోధన కొత్త కాదు. జర్నలిజాన్ని నిరంతర వ్యాపకం చేసుకుని లబ్ధప్రతిష్టులయ్యారు. ఆయన తాజాగా వెలువరించిన పరిశోధనాత్మక గ్రంథం ‘అమరజ్యోతి డా. అంబేడ్కర్’.
పి.విష్ణుమూర్తి గతంలో అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని, ఎవరి రిజర్వేషన్లు వారే అనుభవించాలనే భావంతో ‘దళిత క్రైస్తవులు- ఎస్సీ రిజర్వేషన్లు’ పుస్తకం రాశారు. రాజ్యాంగ మూలసూత్రాల పట్ల అవగాహన కలిగించడానికి ‘మనం- మన రాజ్యాంగం’ అనే గ్రంథం వెలువరించారు. అది అనేకమంది విద్యార్థులకు కరదీపికగా మారింది. ఇపుడు డా.అంబేడ్కర్ సమున్నత మేధో సంపన్నతతో, అచంచల ఆత్మవిశ్వాసంతో సముజ్వల పాత్ర పోషించిన వైనాన్ని సోదాహరణంగా ఎంతో శ్రమించి వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. విష్ణుమూర్తి భారతీయ దళిత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, న్యూఢిిల్లీ హౌదాలో తెలుగు, తమిళం, మలయాళం కవులను, కళాకారులెందరికో అంబేడ్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డులతో సత్కరించారు. సమాజ మార్పుకు జర్నలిజమే ఆయుధమని నమ్మిన జీవనవిధానం అయనది. ముప్పై ఏళ్ళుగా వారం వారం వార్తా వ్యాఖ్యలతో ప్రజాపత్రిక ‘జనమిత్ర’ను నిరాటంకంగా నడుపుతున్నవారు.
‘అమరజ్యోతి డా. అంబేడ్కర్’.పుస్తకంలో- రాసిందానికి ప్రామాణికత సంతరించేందుకు ప్రముఖుల, మేధావుల వ్యాఖ్యానాలను, సూత్రీకరణలనూ, ఉటంకింపులను అవసరమైన సందర్భంలో జోడించారు. డా.అంబేడ్కర్ ఏ భావజాలానికి ప్రేరేపితులు అయ్యారో చెప్పడానికి చాతుర్వర్ణాలు- అస్పృశ్యులు పుట్టుక చారిత్రక పరిణామం ఆది భారతీయుల అస్తిత్వ మూలాలు వివరించారు. హిందూమత ప్రాతిపదిక, హిందూ సమాజ నిర్మాణం, ద్రావిడ సంబంధం, బ్రాహ్మణ ఆధిపత్యం, కులం స్వాభావిక స్థితి, అస్పృశ్యత మూలాలు … వీటన్నింటి గురించి కూలంకషంగా చర్చించారు.
దేశంలో స్వాతంత్య్రానికి ముందు జరిగిన కుల సంస్కరణ ఉద్యమాల వివరాలు ఇచ్చారు. కేరళలో నాయర్ ఉద్యమం, మహారాష్ట్రలో సత్యశోధక ఉద్యమం, డిప్రెస్డ్ క్లాసు మూవ్‌మెంటు, తమిళనాడు దక్షిణ రాష్ట్రాల్లో జస్టిస్ పార్టీ ఉద్యమం, సెల్ఫ్ రెస్పెక్టు ఉద్యమాలు… ఇంకా మరెన్నో వివక్ష వ్యతిరేక ఉద్యమాల గురించి పొందుపరచారు. అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. వేల సంవత్సరాల అస్పృశ్యత వల్లే హిందువుల్లోని అనైక్యత ఏర్పడి, భారతదేశం విదేశీయుల వశమైందని సోదాహరణంగా వెల్లడించారు. బెంగాల్‌లో సతీసహగమనం దురాచారంపై తిరుగుబాటు చేసిన రాజారామ్‌మోహనరారు, ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక రుగ్మతలపై పోరాడిన కందుకూరి వీరేశలింగం, అస్పృశ్యత బ్రాహ్మణ భావజాలాన్ని మహారాష్ట్రలో పూనా కేంద్రంగా అలుపెరుగని పోరు సలిపిన మహాత్మా జ్యోతిరావు పూలే, పంజాబ్‌లో గురునానక్ శిష్యుడు గురు రవిదాస్, పశ్చిమ భారతదేశంలో వివక్ష తొలగించడానికి ఆత్మారామ్ గోవింద రనడే, ఆర్య సమాజ్ ద్వారా విగ్రహారాధనపై తిరుగుబాటు చేసిన దయానంద సరస్వతి, తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం నడిపిన పెరియార్, కేరళలో అసాంఘిక చట్టాల రద్దు కోసం పోరాడిన ఆయ్యన్ కాళి, అస్పృశ్యుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ… వీరందరి స్ఫూర్తిదాయకమైన ఆచరణాత్మక సంస్కరణల్ని సవివరంగా విశదీకరించారు. ఆయా ప్రాంతాల్లోని సామాజిక సంస్కరణలను వెల్లడించారు.
భారత స్వాతంత్య్ర చరిత్రలో రౌండు టేబుల్ సమావేశాలు ఎంతో ప్రాముఖ్యత వహించిన విషయం తెలిసిందే. డా.అంబేడ్కర్ మొదటి ప్రసంగ పాఠంలో అణగారిన వర్గాలకు రాజకీయ అధికారాలు ఎందుకు అవసరమో తెలియజేసి అంటరాని వారి బతుకుల్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. రెండవ ప్రసంగంలో ఉద్యోగరంగంలో అంటరాని వారు ప్రవేశం కోసం ఒక ప్రత్యేక ప్రతిపత్తి తీసుకురావడానికి దృష్టి సారించాలని నొక్కి చెప్పారు. మూడవ ప్రసంగంలో అల్ప సంఖ్యాకుల్లో అణచివేతకు గురైన తరగతి వారి సంరక్షణ ఆవశ్యకత గురించి మాట్లాడారు. డా.అంబేడ్కర్ ప్రసంగాలు ఒక వాస్తవికతనూ అందరి ముందు పెట్టినట్లయింది. ఒక ప్రాతినిధ్యాన్ని ప్రతిఫలించి భవిష్యత్తుకు బాటలు వేసింది. ప్రపంచ చరిత్ర తెలిసిన అంబేడ్కర్‌పైకి చిన్న విషయంగా కనిపించే ప్రతి సామాజిక కోణాన్ని లోతుగా విశ్లేషించి బట్టబయలు చేశారు. పరిష్కారాలు సూచించారు.
అణచివేతకు గురైన వర్గాల ప్రతినిధిగా డా.అంబేడ్కర్ వయోజన ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసి మద్దతు ప్రకటించారు. ఓటు హక్కు కల్పిస్తే అధికారం ఇచ్చినట్లుగా భావించి బడుగు జీవితాలు మెరుగవుతాయని చెప్పారు. ఏ ప్రసంగం చేసినా నియమబద్ధంగా నిబద్ధతతో తన వారి ప్రయోజనాల కోసం చేసిన ప్రతిపాదనలే తప్ప బెదిరించడానికి కాదని వివరణ ఇచ్చారు. ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించబడటంలో గాంధీ వాదన తిరస్కరించబడి డా. అంబేడ్కర్ ప్రతిభ మెరవడాన్ని గమనించగలం. తర్వాతి కాలంలో అంబేడ్కర్ బౌద్ధం స్వీకరణ పూర్వపరాల్ని కూడా సంయమనంతో వివరించారు విష్ణుమూర్తి. బుద్ధుడు చూపిన మార్గం ప్రేమ, న్యాయం, సద్భావం సాధించగలవని అంబేడ్కర్ భావించారనే విషయం అవగతమౌతుంది.
ఒక సామాజిక రుగ్మతను రూపుమాపడానికి చట్టం చేస్తే సరిపోదు. చట్టాన్ని గౌరవించడం సామాజికామోదం పొందడం కార్యరూపంలోకి రావడం ముఖ్యం. కులం పేరిట వివక్ష చూపించడం మనిషి చేయదగ్గది కాదు. వివక్షకు తావు లేని సమానత్వ సమాజం కోసం అంబేడ్కర్ కలగన్నారు. ఆ కలల ప్రస్థానమేమిటో ఈ పుస్తకం చెబుతుంది. డా. అంబేడ్కర్ మీద నేను రాసిన ఒక కవిత ఇలా ముగుస్తుంది : ”స్వాభిమాన సంకేతం నీవు / నేల మీద నీ కాంతులు / సామాజిక భావ విప్లవాన్ని ప్రసరించాయి / ఉన్నత శిఖరాగ్రాన / చిరునగవుల వెలుగు నీవు / ఇరుకు మనస్సులకు / విశ్వరూపం చూపించావు / దేశం నడకలకు / హద్దులు గీసిన ప్రవక్తవు నీవు / ఆత్మ గౌరవ పోరాటం నీవు/ దీనజనుల జ్ఞాన ప్రతీకవు నీవు / నిన్ను మించిన దైవం లేదనే / జాతి జనుల కీర్తి పతాకం నీవు / అంబేడ్కర్…అంబేడ్కర్ / నిత్య చైతన్యాల మార్గదర్శివి నీవు.”
ఈ గ్రంథం రాయడానికి విష్ణుమూర్తి అవిశ్రాంతంగా అధ్యయనం చేశారు. మొదటి పేజీ నుంచీ ఆ విషయం తేటతెల్ల మౌతుంది. రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ పాత్రను శ్రమకోర్చి మన ముందుంచారు. ప్రసంగాల్ని జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యే రీతిలో అనువదించి అందించారు. అనిర్వచనీయ చింతనాపరుడైన డా.అంబేడ్కర్ మూర్తిమత్వాన్నీ మేధావితనాన్నీ అంకితభావాన్నీ విపులంగా తెలియజేసినందుకు విష్ణుమూర్తి ఎంతయినా అభినందనీయులు.
– దాట్ల దేవదానం రాజు,
94401 05987