ఆ వేదిక జనోల్లాసంతో బాటు జనచైతన్యాన్ని ప్రసరించే దీపికగా వెలుగొందింది. ఒకప్పుడు అది జనచైతన్యపు కాంతుల్ని విరజిమ్మిన ప్రధాన మాధ్యమంగా తెలుగునాట ప్రేక్షకులను అలరించింది. స్వాతంత్రోద్యమం వంటి ఎన్నో ఉద్యమాల వెలుగుల్ని నాటకాల రూపంలో అది ప్రసారం చేసింది. ఎందరో ప్రసిద్ధ నటీనటులు తమ ప్రతిభాపాటవాలతో దానికి కొండంత గౌరవాన్ని కల్పించారు. ఒకప్పుడు వైభవంగా వెలిగిపోయి జనజీవననాడిగా అలరించిన ఆ రంగస్థలం నేడు ప్రపంచీరకణ మాటున ప్రచండగాలులై వీచే మాధ్యమాల ధాటికి తట్టుకోలేక సతమతమైపోతోంది. ఇప్పుడు కొన్ని నాటక సంస్థల ఆదరణ వెలుగుతో మాత్రమే రంగస్థలం తన వెలుగును ఇంకా పూర్తిగా కోల్పోకుండా మిణుకుమిణుకుమంటోంది. మూడు దశాబ్దాల పాటు ఆకాశవాణిలో వివిధ హౌదాల్లో పనిచేసి, ఎందరో కళాకారుల జీవితాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో నిరంతరం నాటకరంగాన్ని అక్కున చేర్చుకొని అది మరింత వెలుగుతో నిండిపోవాలని తపిస్తూ ఆ రంగంలోని సాధకబాధకాలను అక్షరాలరూపంలో కూర్చిన అక్షర శ్రామికుల్లో ఆకుల మల్లేశ్వరరావు ఒకరు. దాదాపు పదేళ్లపాటు రంగస్థల యవనిక మీద జాలువారిన అనేక ప్రదర్శనలతో మమేకమై, వాటిలోని అనేక పార్శ్వాలను స్పృశిస్తూ, వాటిలోని మంచిచెడులను పరామర్శిస్తూ, వర్తమాన నాటక రంగంలోని ఎన్నో విశేషాలతో తాజాగా ఈయన వెలువరించిన వ్యాస సంకలనం ‘రంగవీక్షణం’.
ఈ సంకలనంలోని వ్యాసాల వెనుక ఈ రచయిత పదేళ్ల శ్రమ, తపన దాగివున్నాయి. 1988 నుంచి 2016 వరకు ఆకాశవాణిలో శ్రవ్య నాటికలు వివిధ రచయితల చేత రాయించి ప్రసారం చేయించిన ఈ రచయితకు ఆ నాటక రంగంలోని పలు పార్శ్వాల పట్ల, రంగస్థల పరిణామాల పట్ల ఎంతో అవగాహన వుంది. అనేక ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విస్తారమైన అనుభవమూ వుంది. వీటితోపాటు ఈ రచయిత రంగస్థలం పట్ల పెంచుకున్న యాభై ఏళ్ల అభిమానం కలగలిసి ఈ పుస్తకాన్ని ఒక నాటకరంగ దర్శినిగా తీర్చిదిద్దాయని చెప్పవచ్చు. ఈ సంకలనంలోని ఎక్కువభాగం వ్యాసాలు ఆయా ప్రదర్శనల సమీక్షల రూపంలోనూ, కొన్ని బళ్లారి రాఘవ వంటి మహానటుల స్ఫూర్తిదాయక ప్రసంగాలు, జీవనచిత్రాల రూపంలోనూ వున్నాయి. ఇంకొన్ని ఆధునిక ప్రదర్శనల్లోని ప్రయోగాలకు ప్రాధాన్యతనిచ్చాయి. ఆయా ప్రదర్శనల్లోని ఎన్నో పార్శ్వాలను ఈ వ్యాసాల్లో రచయిత స్పృశించడం వల్ల ఆ వ్యాసాలను చదివిన తరువాత అవి ఆ నాటకాలపైనా, ఆ నాటకాల్లోని పాత్రధారులపైనా మనకు ప్రేమనూ, అవగాహననూ కలిగిస్తాయి. రంగస్థలం పట్ల అభిమానాన్నీ పుట్టిస్తాయి. ఒకప్పుడు ఒక జాతరలా జరిగిన పలు నాటకోత్సవాలకు సంబంధించిన అనేక విషయాలను చెబుతాయి. ఆణిముత్యాలనదగ్గ వీరనారి ఝాన్సీబాయి, సరూ, చీకటిపువ్వు, రైతేరాజు వంటి పలు నాటికల్లోని ఆర్తిని మన హదయాలకు తాకిస్తాయి. రంగస్థలంలో ఆనాటినుంచి ఈనాటి వరకూ జరిగిన అనేక పరిణామాలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు తాను న్యాయనిర్ణేతగా పాల్గొన్న ఎన్నో నాటక ప్రదర్శనలకు సంబంధించి సమీక్షలను, కొన్ని ప్రదర్శనల నివేదికలను రూపొందించడంలో ఈ రచయిత పడ్డ శ్రమ ప్రశంసించదగ్గది. కన్యావరశుల్కం, చలం మైదానం వంటి వైవిధ్యభరితమైన నాటక ప్రదర్శనల్లోని ఆత్మలను ఈ వ్యాసాలు పట్టుకున్నాయి. రాజమండ్రిలో ఒకే వేదికపై 900 మంది 150 నిమిషాల నిడివితో ఇచ్చిన ‘బారక్ పూర్ సే లాల్’ అనే రంగస్థల ప్రదర్శన, హైద్రాబాదులో రెండు రోజుల్లో నాలుగు పూటల్లో రోజుకు 11 వంతున చోటు చేసుకున్న 22 ఏక వ్యక్తి రంగస్థల ప్రదర్శనలు, నిశుంభిరామ్ అనే నటుడు ఏకబిగిన ఇచ్చిన 27 ప్రదర్శనలు వంటి ప్రయోగాత్మక ప్రదర్శనల గురించి వివరించే వ్యాసాలు ఇందులో వున్నాయి. హాస్యం, వైజ్ఞానికం, మానవీయత, పర్యావరణం.. ఇలా మానవ జీవితంలోని పలు పార్శ్వాలను స్పృశించిన నాటకాల లోతుపాతుల్ని ఈ వ్యాసాలు చర్చించాయి. పలు నాటకాల్లోని సారాంశాల్నీ, ఆ నాటకాల తీరుతెన్నుల్నీ రచయిత మన ముందుంచేందుకు ప్రయత్నించడంతో ఆ నాటకాలను వీక్షిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇంకా ఈ వ్యాసాల్లో రాయలసీమకు చెందిన డాక్టర్ మూల మల్లికిర్జునరెడ్డి వంటి నాటక పరిశోధకులు, మిశ్రో వంటి నాటక రచయితల జీవనచిత్రాలు కనిపిస్తాయి. ప్రదర్శనలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారి నైపుణ్యానికి, వారు పాటించవలసిన నియమాలకు సంబంధించిన విషయాలను కూడా రచయిత చర్చించడం ముదావహం. బహుజనుల ఆత్మగౌరవం ఇనుమడించేలా బారతీయ సాంస్క ృతిక పురాణ నేపథ్యాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో పేర్కొంటూ డాక్టర్ దీర్ఘాశి విజయకుమార్ రూపొందించిన నూత రంగస్థలి నాటక కళ గురించిన వివరణ వుంది. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీచేయడంపై వెలువరించిన వ్యాసం సమకాలీన సామాజిక ప్రరిస్థితుల్ని ప్రతిబింబిస్తుంది. పలువురు కళాకారుల బతుకుల్లోని కల్లోలాన్ని ప్రత్యక్షంగా చూసిన ఈ రచయిత ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం ఆరోగ్యపథకాన్ని ప్రవేశపెట్టాలని ఆకాంక్షిస్తారు. ఎంతో శ్రమకోర్చి, వ్యయం కోర్చి నాటక పరిషత్తులు నిర్వహించే పోటీల్లో ఎలాంటి నాటకాలను ప్రదర్శించాలో పేర్కొంటూ ‘రచయితలు తమ కలంబలాన్ని వినియోగించవలసిన రీతిలో వినియోగించడం లేదు. తెల్ల కాగితాన్ని మంచి అక్షరాలతో నింపటం కోసం రచన చేపట్టాలి. కాగితాన్ని నలుపు (ఖరాబు) చేయడానికి కాదు. ఎవరికోసమో, వ్యక్తుల కోసమో, అవార్డుల కోసమో, కేవలం చప్పట్ల కోసమో కాకుండా నాటకప్రయోజనాన్ని విస్మరించకూడదు. సామాజిక బాధ్యతనుంచి తప్పుకోకూడదు’ అని ఈ రచయిత ప్రస్తుత నాటక రచయితల సామాజిక బాధ్యతను గుర్తుచేశారు. ఆ సంకలనం వెనుకవున్న రచయిత ప్రధాన లక్ష్యం ఇదే.
ఈ సంకలనంలో ప్రపంచ రంగస్థల దినోత్సవానికి సంబంధించి కార్లోస్ సెల్రాన్, హెలెన్ మిర్రేన్ వంటి పాశ్చాత్య ప్రముఖుల సందేశాలు అనువాదాల రూపంలో చోటుచేసుకున్నాయి. రంగస్థల ఆవిర్భావ వికాసాలకు సంబంధించిన వివరణ వుంది. కథా రచయిత, నవలారచయిత చింతకింది శ్రీనివాసరావు రచనల్ని పరామర్శిస్తూ రచయిత వెలువరించిన సమీక్షలు ఆయన రచనల పట్ల అవగాహనను కలిగిస్తాయి. పలు నాటక ప్రదర్శనలను సమీక్షించేటప్పుడు ఆ నాటకాల్లో నటించిన పాత్రధారుల వివరాలను కూడా ఇవ్వడంలో ఈ రచయిత పరిశోధనాత్మక దృష్టి అవగతమవుతుంది. ఎన్నో ఏళ్లుగా రంగస్థలానికి వన్నెలు దిద్దే ప్రముఖ నాటక సంస్థలకు ఈ వ్యాసాలు నీరాజనాలర్పించాయి. రంగస్థల ప్రదర్శనల పోటీలను నిర్వహించి ఆద్యంతం రక్తి కట్టించడం ఒక తతంగంలా బృహత్ ప్రణాళికతో కూడివుంటుంది. ఆ ప్రణాళికను రచయిత ఆకళింపు చేసుకున్న తీరును ఈ వ్యాసాలు తెలియజేస్తాయి. తెరమరుగవుతున్న తెలుగు నాటకం రూపురేఖల్ని కొంతవరకు దర్శింపజేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రంగస్థలంలోని చీకటి వెలుగుల్నీ, ఎందరో ఉద్దండ నటీనటుల అభినయ కౌశలాన్నీ ఈ వ్యాసాలు ఆవిష్కరించాయి. రంగస్థలాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమిది. 332 పేజీలున్న ఈ పుస్తకం వెల : రూ. 350. ప్రతులకు రచయితను 94400 07374 నెంబర్లో సంప్రదించొచ్చు.
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
9177732414