పండుగ బానే జరిగింది!

Jan 20,2025 11:38 #Poetry

ఫర్వాలేదు
గాలిపటాలు రివ్వున ఎగిరాయి
మాంజాలు గొంతు కోస్తున్నా.
గెలిచినా, ఓడినా,
కూరొండుకుంటారని తెలియని
పుంజులు పౌరుషానికి పోయాయి
ప్రాభవాలు కోల్పోయినా,
భారీగానే ఊరేగాయి ప్రభలు.
పిండి వంటలు నోరూరించారు,
చాకిరీ చేసిన ఇంటామెకు
కృతజక్షతలు చెప్పకుండానే …
మగాళ్లు గళాసులతోనూ,
ఆడాళ్లు రీల్స్‌తోనూ సందడి చేశారు.
ఇంటి బయట ముసలాళ్లతో
సెల్ఫీ మాత్రం ఎవ్వళ్లూ మర్చిపోలేదు
ఆడంబరాలను ఆత్మీయతగా,
కలవని వరుసలను కుదుర్చుకోడాన్నే ప్రేమగా,
ఆస్తుల లెక్కలను అనురాగంగా,
మార్చుకోవడానికి ఏ యాప్‌ యూజ్‌ చేశారో
ఎవరూ మరొకరికి చెప్పలేదు!
బిగుతైన దుస్తుల నడుమ గొబ్బెమ్మలు,
తుళుకులీనే డ్యాన్స్‌ల్లో సంక్రాంతి లక్ష్ములు
కనుమనాటి మందు, ముక్కల్లా
జత కలిసిపోయారు.
చీరలు తెరలు కట్టిన
పాత ఇంటి మండువా లోగిళ్లలో …
ఎడ్ల పందేలు జోరుగా సాగడం
బహిరంగ రహస్యమే!
తెల్లవారుజాము చుక్కల ముగ్గుల్లో
ఎకసెక్కాలు ఎవరినీ గాయపర్చనందుకు
నైటీలేమీ నివ్వెరపోలేదు.
మొత్తం మీద పెద్ద పండుగ బాగా జరిగింది
ఎవరు, ఎక్కడ, ఎంత పోగొట్టుకున్నారో
మైక్‌ సౌండ్లలో ఎవరికీ వినిపించలేదు.
పగలే దుస్తుల్లేకుండా డాన్సాడిన
సుందరాంగులు తర్వాతెవరికీ అగుపియ్యలేదు.
మొదట డబ్బులొచ్చిన
గుండాటలోని మోసమేమిటో,
కొమ్ములు తిరిగినోళ్లకీ అవగతం కాలేదు.
హరిదాసులు, గంగిరెద్దులు స్మాల్‌ బ్రేక్‌లో
చేసిన ఎంటర్నయిన్మెంట్‌,
పెద్దగా చిల్లర రాల్చలేదు.
డిజిటల్‌ తెరలపై కాసినో వెలుగుల్లో
ఒక్క బక్క రైతూ కనిపించనందుకు
మేథావులు సైతం విచారించిన దాఖలాల్లేవు.
సరళీకరణ, కార్పొరేటీకరణల మధ్య
సంస్క ృతీ, సంప్రదాయం
నలిగిపోతున్నందుకు రహస్యంగానైనా
స్వామీజీలు నొచ్చుకున్నట్టు లేదు.
అందుకే, పెద్ద పండుగ భలే జరిగింది!

– దేశరాజు

➡️