శతాబ్ద కాలం దాటినా తెలుగు కథా సాహిత్యంలో చాలా వెలితులు కనిపిస్తూనే ఉన్నాయి. తెలుగు నేల మీద జీవనం సాగిస్తున్న 34 ఆదివాసీ తెగలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇవి రోజురోజుకు తమ ఉనికిని కోల్పోతున్నాయి. గిరిజనులను అడవుల నుంచి గెంటివేసి ఆ నేల కింద ఉన్న విలువైన ఖనిజ సంపదలను బహుళ జాతి కంపెనీలు ఆక్రమించుకుంటున్నాయి. ఇదంతా ‘అభివృద్ధి’ ముసుగులో జరుగుతున్న అరాచకం. ఇలాంటి పరిస్థితిలో నలిగిపోతున్న ఆదివాసుల జీవితాలను కథలుగా మలచిన రచయితలు లేకపోలేదు. అయితే, అవి చాలా తక్కువ. కొన్ని వృత్తి జీవితాలైతే కథాసాహిత్యంలోకి రాలేలేదు. ఆ వెలితిని పూడుస్తూ, ఎరుకుల జీవితాలపై పలమనేరు బాలాజీ ఒక కథాసంపుటిని తీసుకొచ్చారు.
నిరంతర అభద్రతా భావంతో జీవనం చేస్తున్న సంచార తెగల్లో ఎరుకల ఒకటి. వారు శాశ్వత నివాసం, ఆధార్, ఓటరు కార్డులు, జనన మరణ ధవీకరణ పత్రాలు, ఉపాధి కార్డులు పొందటమే పెద్ద సమస్యగా మారిపోతోంది. వాటి కోసం వారు నిరంతరం పాలకవర్గాలతో ఘర్షణ పడుతూనే ఉన్నారు. అలాంటి ఎరుకల తెగ నుంచి వచ్చిన రచయిత బాలాజీ. ఊరుపేరును ఇంటి పేరుగా చేసుకొని పలమనేరు బాలాజీ పేరుతో తన సాహిత్య ప్రస్థానం సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూసిన జీవితాలనూ, అనుభవించిన దుఃఖాలనూ, బాధలనూ, ఆకాంక్షలనూ, ఆరాటాలనూ, పోరాటాలనూ కథలుగా మలిచారు. తెలుగు సాహిత్యంలోనే తొలి ఎరుకల కథా సంపుటి ‘ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు’ను వెలువరించారు. ఈ సంపుటిలోని 18 కథల్లో భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి. ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం పోరాడే పాత్రలు కనిపిస్తాయి.
ఎన్నో మలుపులు, ఎన్నో చిత్రవిచిత్రాలు, మరెన్నో విషాదాలూ.. ఈ కథల నిండా కనిపిస్తాయి. ”పదకొండు నెలల జీతగాడి కథ”లో రచయిత తండ్రి అటవీశాఖలో గార్డు. ”అటవీశాఖ ఉద్యోగి కుటుంబమే అయినా, మేం సిగ్గుపడకుండా కట్టెలు కొనేవాళ్ళం. మేము కట్టెలు కొనటాన్ని డిపార్టుమెంటులో మా నాయన ముందే చాలామంది ఎగతాళి చేసేవారు”. ఇది ఎరుకల తెగలో ఉన్న నిజాయితీకి గుర్తుగా కనిపిస్తుంది. తన తండ్రి కట్టిన పాత పెంకుటిల్లు స్థానంలో కొత్త ఇల్లు కట్టేటప్పుడు, ఆ పాత ఇంటి తలుపులు, కిటికీలు, పెంకులు అమ్మిన డబ్బుతోనే కొత్త ఇంటికి పునాది నిర్మించారు. ”ఇంటికి పునాదులు పైకి ఎప్పుడూ ఎవరికీ కనబడవు కానీ అవి చాలా బలంగా ఉంటాయి. అవి బలంగా ఉంటాయి కాబట్టే మనం ఎదుగుతాం” అని రచయిత తన తల్లిదండ్రుల పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత ఈ కథలో కనిపిస్తుంది. ”బలవంతంగా నా చేత యాపిల్ తినిపించిన నాన్నా… నువ్వెప్పుడైనా ఒక్క పండైనా తిన్నావా తండ్రీ” అన్న చివరి వాక్యం కథకు మరింత పుష్టిని చేకూర్చించింది. ‘ఎరికిలోల్లకి వూరి మధ్యలో, అదీ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళే రోడ్డులో స్థలం కేటాయించడమే గొప్ప అని, ముందు ముందు ఆ స్థలానికి విలువ పెరుగుతుందని’ ఆ స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి పడిన కష్టం, ఆ తరువాత ఏకలవ్య కాలనీగా ఎలా పరిణామం చెందిందో ఈ కథల్లో చూడవచ్చు. ఎక్కడెక్కడో విసిరేసినట్లు వుండే వాళ్ళు, రకరకాల పనులు చేసే వాళ్ళు, అడవిలో కట్టెలు తెచ్చి అమ్ముకునే వాళ్ళు, తేనె, మూలికలు, ఆకుపసర్లు అమ్ముకునే వాళ్ళు, పందులు, బాతులు మేపే వాళ్ళు, వెదురుపని చేసే వాళ్ళు, యెర్రమన్ను, ముగ్గుపిండి అమ్మేవాళ్ళు … ఇట్లా రకరకాలుగా జీవనం సాగించే మనుషులంతా ఒక చోట చేరి నిర్మించుకున్నదే ఏకలవ్య కాలనీ.
ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాను, ప్రకాశం జిల్లాను వేరే చేసే ఊరు స్టువర్టుపురం. ఎక్కడ దొంగతనాలు జరిగినా ముందు ఎరుకల వాడినే అనుమానించి పోలీసులు లాక్కెళ్లేవారు. వారిపైన తప్పుడు కేసులు మోపి బాగా కొట్టేవారు. ఆ స్టువర్టుపురం అనే ఊరు మీ కోసమే పుట్టిందంట అని అవమానించేవారు. ”అయ్యా ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిందని మొత్తం కులాన్ని తప్పు పడితే యెట్లా. గతాన్ని సాకుగా చూపి మొత్తం మా కులాన్నే తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు.” అంటూ ఆవేదన చెందిన దయనీయ స్థితిని ‘మా తప్పు ఏంది సామి?’ కథలో చూపించారు రచయిత. ”నమ్మినోల్లకి ప్రాణం అయినా ఇస్తారు కానీ, ఎరికిలోల్లు ఎవురికీ నమ్మకద్రోహం చెయ్యరు. ఏరికిలోల్ల ఇండ్లల్లో పుట్టుక పుట్టినాక ఒక తెగింపు ఉండల్ల బతికేదానికి” అనే ధైర్యం కలిగిన పాత్ర కాంతమ్మది. ”అమాయకపు మనుషుల్ని కాపాడితేనే, దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడు. ఈ లోకంలో అమ్మా, నాయన లేనోళ్లకి చుట్టూరా ఎంతమంది జనం వున్నా అనాథలకిందే” అని ఆమె చాటిన మానవత్వాన్ని ‘అమరజీవి మా కాంతమ్మత్త!’ కథలో దర్శించవొచ్చు. ”ఏదైనా సాధించాలి అనుకుంటే ముందు భయాన్ని నరికేయ్యల్ల. నువ్వు ఏదైనా కలగంటే ముందు నువ్వు దేనికీ భయపడొద్దు”. అని మునిరత్నం నోట ‘దేనికీ భయపడొద్దు’ అనే కథలో వివరించారు.
ఎరుకల కపాలి మంచి వంట మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతడి చేతి వంట కోసం జనం క్యూ కట్టేవాళ్ళు. అలాంటి మనిషి తాగుడు బానిసై వృత్తిని కోల్పోతాడు. కానీ ఆత్మగౌరవాన్ని విడిచిపెట్టడు. ”ఎరికిలోడనే చెప్తా. చెప్తే ఏమి పోతాది అన్నా. నిజమే చెప్తాను. ఇస్తే పని ఇస్తాడు, లేదంటే లేదు. సారాయి మానేస్తే మా కులంలో కూడా రత్నాల్లాంటోల్లు దండిగా వుండారులే అన్నా. అయినా కులం వల్ల ఎవురూ ఎప్పుడూ సెడిపోలేదు” అని తమ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని ప్రకటించాడు ‘కబాబ్ కపాలి’. క్రిష్ణప్ప పందులు వ్యాపారం చేస్తుండేవాడు. అమ్మడం, కొనడంలో మంచి నేర్పరి. భార్య రాధమ్మ పిల్లల్ని కాన్వెంట్‌లో చదివించాలని పట్టు పడ్డడంతో ఎరుకల కాలనీ విడిచి పట్నం వెళ్ళాడు. అక్కడ పందుల వ్యాపారం చేస్తుంటే భార్య … ”మీ నాయినేం చేస్తాడని పిలకాయల్ని ఎవరైనా అడిగితే వాళ్ళేం చెప్పుకోవాల్నో చెప్పు. నువ్వీ పని చేస్తావుంటే మన పిలకాయల్ని ఎవరైనా దగ్గరకు చేరస్తారా? నలుగుర్లో మనకైనా వాళ్ళకైనా ఏం మర్యాదుంటుంది” అని అనేసరికి క్రిష్ణప్ప బిడ్డల కోసం ఆ వృత్తిని మానుకుంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి మగపిల్లలిద్దరినీ ప్రయోజకులను చేస్తారు. ఆరోగ్యం క్షీణించి రాధమ్మ కొడుకుల ఇంటికి వెళ్తే ‘మనం ఎరుకలోల్లం అని ఈ పక్క ఎవరికీ తెలియదు. నువ్వొచ్చి మమ్మల్ని అగుడు చెయ్యొద్దు’ అని తల్లిని అవమానిస్తారు. ”ఆ ఇద్దరు మొగపిల్లల్ని సాకే బదులు గమ్మునా నలుగు పందుల్ని పెంచింటే బావుండేది” అని క్రిష్ణప్ప నోట రచయిత పలికించిన మాటలు తమ కులం గురించి చెప్పుకోవడానికి సంకోచించే ప్రతి వారికీ సూదిమొనల్లా గుచ్చుతాయి.పెత్తందారీ బానిస సంకెళ్ళు నుంచి బయటపడి తమ కాళ్ళ మీద తాము బతకాలని పోరాడిన నీలమ్మను ‘వెదుర్లు’ కథలో, మంజులను ‘గురి’ కథలో చూడవచ్చు. సాటి కులపోల్ల కోసం జైలుకు వెళ్లి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఒక గిరిజన ఉపాధ్యాయుడి కథ ‘ఉడుకోడు’. ఎరుకల నరసింహం ఆధిపత్య కులాల వారికీ ఎదురొడ్డి పోరాడి తమ జాతి ఉన్నతికి కృషి చేసినవాడు. ”ఎరికిలోడు సేద్యం ఒక్కటే నేర్చుకుంటే సాలదు మామా, పోరాటం చెయ్యడం నేర్చుకోవల్ల, బతకాలంటే కరువుతోనే కాదు, మొండి మేఘాలతోనే కాదు, మొండి మనుషులతో, పెద్ద కులమోళ్ళతో పోరాటం చెయ్యడం నేర్చుకోవల్ల.” అని కుండబద్దలు కొట్టినట్లు తెగేసి చెప్పినవాడు ఉడుకోడు. ఇలా తమ మూలాల్లోకి వెళ్లి బాధ్యతలను, వెతలను కథలుగా మలిచిన పలమనేరు బాలాజీ అభినందనీయులు.
– సారిపల్లి నాగరాజు
80083 70326