ఆదర్శనేత ఉద్దరాజు రామం

Mar 17,2025 04:58 #book review, #cpm leader

యువకుడిగా స్వాతంత్య్రోద్యమంలో అడుగుపెట్టి కమ్యూనిస్టుగా పరిణామం చెంది రాజకీయాలకే వన్నెతెచ్చిన ఆదర్శనేత ఉద్దరాజు రామం. పశ్చిమ గోదావరి జిల్లాలో కాళీపట్నం జమిందారీకి వ్యతిరేకంగా రైతులను సమీకరించి, తిరుగుబాటు చేసి జమిందారీ వ్యవస్థ రద్దుకు శ్రీకారం చుట్టారు. నవయవ్వనంలోనే కఠిన నిర్బంధాలను ఎదుర్కొని సమరశీలంగా పోరాటాలు సాగించిన యోధుడాయన. సుందరయ్యతో పరిచయం ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. జిల్లాలో ఏర్పడిన మొదటి కమ్యూనిస్టు పార్టీ శాఖ సభ్యుడు. మిగతా వారు తరువాత తప్పుకున్నా తుదిశ్వాస వరకు ఆయన పార్టీలో కొనసాగారు. ఆయన జిల్లాస్థాయి నుంచి అఖిల భారత కిసాన్‌సభ అధ్యక్షుడి వరకు ఆనేక బాధ్యతలు జయప్రదంగా నిర్వహించారు. నమ్మిన ఆశయాలను జీవన విధానంగా మల్చుకొని త్రికరణశుద్ధిగా అమలుచేసిన అసాధారణ వ్యక్తిత్వం ఆయనది. జీవితంలో ఎదురైన ఆటుపోట్లు, పరీక్షలను ఎదుర్కొని కమ్యూనిస్టుగా 100 శాతం మార్కులు సాధించిన ఘనత ఆయనది.
ఆయన మాటల మనిషి కాదు; చేతల మనిషి. ఏ పనినైనా చేసి చూపించే మనస్తత్వం. ఆయనలోని ఈ సద్గుణమే యువతరానికి స్ఫూర్తినిచ్చింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆనేకమంది కమ్యూనిస్టు యోధులను తయారుచేసి ఎర్రజెండాను సమున్నతంగా నిలిపారు. అతివాద, మితవాద చీలికల అనంతరం జిల్లాలో బలహీనపడ్డ సిపిఐఎంలోకి కొత్తతరం నాయకత్వాన్ని చైతన్యపూర్వకంగా తీసుకువచ్చి అభివృద్ధి చేసి వారికి ఎర్రజెండాను అప్పగించారు. ఆయన సంపాదించుకున్న ఆస్తి కమ్యూనిస్టు ఆదర్శం. దానినే వారసత్వంగా తన తరువాతి తరాలకు అందించారు.
కామ్రేడ్‌ ఉద్దరాజు రామం గారితో నా తొలి పరిచయం విజయవాడ మార్కి ్సస్టు కార్యాలయంలో జరిగింది. 1984లో రాష్ట్ర యువజన రంగం బాధ్యతల్లోకి మారి నెల్లూరు నుంచి విజయవాడ వచ్చాను. అప్పటివరకు రామం గారి పేరు వినడం తప్ప ప్రత్యక్షంగా తెలియదు. మార్క్సిస్టు కార్యాలయంలో ఆయన్ను తొలిసారి చూసినప్పుడు ఆయన నిరాడంబరత, మాటతీరు, మర్యాదతో కూడిన పలకరింపు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. గాంధీ మహాత్ముడు ఎలా ఉంటారో మన తరానికి తెలియదు. కానీ రామం గారిని చూసినప్పుడు గాంధీగారిని చూసినట్టే ఉంటుంది. రైతు సమస్యలపై ఆయనకున్న అవగాహన అపారం. ఆయనతో మాట్లాడిన సందర్భాల్లో వచ్చిన పరిజ్ఞానం ఆ తరువాత నేను రైతు సంఘ బాధ్యతల్లోకి మారినప్పుడు ఉపయోగపడింది. ముఖ్యంగా గోదావరి డెల్టాలో ఉండే నిర్దిష్టమైన సమస్యలు ఆయనకు చాలా లోతుగా తెలుసు. పార్లమెంటు సభ్యుడిగా హిందీలో ఆయన చేసిన ప్రసంగం నెహ్రూ లాంటి వారిని సైతం ఆకర్షించింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో యువ నాయకత్వం అభివృద్ధికోసం ఆయన తపించేవారు. యువజన, విద్యార్థి రంగాల ద్వారా వచ్చిన క్యాడర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన దృష్టిలో అభివృద్ధి కాగలరనుకున్న కార్యకర్తల గురించి అప్పుడప్పుడు నాతో కూడా ప్రస్తావించేవారు. నాకున్న అభిప్రాయాలను కూడా ఆయనతో పంచుకునేవాడిని. ఈనాడు పార్టీలో నాయకత్వ స్థానాల్లో ఉన్న కామ్రేడ్‌ మంతెన సీతారాం, బి.బలరాం లాంటి నాయకులకు ఉద్యమ పునాది వేసిన వారు రామం గారు.. ఆ తరువాత కా|| అల్లూరి, ఆర్‌ఎస్‌ లాంటి వారు వారిని ప్రోత్సహించి వివిధ బాధ్యతల్లో పెట్టారు.
ఆయన జీవిత చరమాంకంలో జ్ఞాపకశక్తిని కోల్పోయినప్పటికీ ఆయన నోటివెంట ఎప్పుడూ పార్టీ, ఉద్యమాలు, కార్యకర్తలు అంటూ వస్తుండేవి. కొందరు గుర్తు రాకపోయినా గుర్తుకు తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసేవారు. ఒక జూనియర్‌ కామ్రేడ్‌గా ఆయనతో గడిపిన ఆ కొద్దిపాటి సాహచర్యం ఎప్పటికీ గుర్తుండిపోయే స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకం. ఈ సందర్భంగా కా|| మాణిక్యాంబ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె రామం గారి సతీమణిగానే కాదు; పార్టీ కామ్రేడ్స్‌ను ఒక తల్లిలాగా ఆదరించేవారు. వీరనారి కూడా. పోరాటాల్లో పాల్గొని నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కుల సాంప్రదాయ కట్టుబాట్లను ధిక్కరించి ఘోషా పద్ధతికి స్వస్తి చెప్పి సామాన్య మహిళలతో కలిసిపోయిన ఆదర్శ మహిళ. ఎప్పుడూ పార్టీ పాటలు, జాతీయోద్యమ గీతాలు ఆలపిస్తుండేవారు. ఆమెతో కొద్ది క్షణాలు గడిపినా నిరుత్సాహంతో వెనకడుగు వేసేవారు కూడా ఉత్సాహం తెచ్చుకొని చురుగ్గా కదులుతారు. అలాంటి వ్యక్తిత్వం ఆమెది. ఆమెను అలా తీర్చిదిద్దిన ఘనత కూడా రామం గారిదే. వారిరువురూ ఆదర్శ దంపతులే కాదు. ఆదర్శ కమ్యూనిస్టులు కూడా. తమ కుటుంబాలను కూడా అలాగే తీర్చిదిద్దారు. ఆయన మరణానంతరం రామం గారి జ్ఞాపకార్థం రైతుసంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్‌ అల్లూరు సత్యనారాయణ చైర్మన్‌గా, నేను కార్యదర్శిగా ట్రస్టు ఏర్పాటు చేసి వ్యవసాయ సమస్యలపై అధ్యయనం, పుస్తకాల ముద్రణ, స్మారక ఉపన్యాసాల నిర్వహణ వంటివి చేస్తుండేవాళ్ళం. ఆ ట్రస్టు బాధ్యులు మారినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
కామ్రేడ్‌ రామం గారి జీవితం, పోరాట అనుభవాలను ఈ పుస్తక రూపంలో తీసుకువస్తున్నందుకు వారి కుమారులు బాపిరాజు గారిని, సహకరించిన యు.రామకృష్ణ, దండమూడి భానుప్రసాద్‌ గారిని అభినందిస్తున్నాను. కొత్త తరానికి రామం గారి జీవిత చరిత్ర స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

(‘ఉద్యమాల శిఖరం ఉద్ధంరాజు రామం’ పుస్తకానికి ముందుమాట)
– వి.శ్రీనివాసరావు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

➡️