కథలంటే పైపైని వున్నాయనుకున్నావేమో, అవి కల్పించడానికి చాలా గొప్ప ప్రతిభ వుండాలి. వాటి విలువ తెలుసుకోడానికి ఎంతో పరిజ్ఞానం వుండాలి. అవి చెప్పడానికి ఎంతో నేర్పు వుండాలి. అవి వినడానికి ఎంతో రుచి వుండాలి. అవి బోధపరుచుకోడానికి ఎంతో బుద్ధి సూక్ష్మత వుండాలి. కథలు కళ్ళకి వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి. మనస్సుకి ఉత్సాహమూ, ఉల్లాసమూ కలిగిస్తాయి.
– శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
తెలుగు కథాసాహిత్యంలో కథక చక్రవర్తిగా పేరొందిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు అతికొద్ది పదాల్లో కథా ప్రక్రియ గురించి చెప్పిన నిర్వచనం గొప్పగా అనిపిస్తుంది. కథ రాయడం వెనుక వుండాల్సిన రచయిత ప్రతిభనీ, కథ చదివిన పాఠకుడు పొందే ప్రయోజనాన్నీ ఈ మాటలు వ్యక్తం చేసాయి. జీవితాన్ని, సమాజాన్ని విస్తృతంగా అధ్యయనం చెయ్యడం, ముఖ్యంగా మనుషుల వ్యక్తిత్వాల్ని నిశితంగా, లోతుగా పరిశీలించడం ప్రతి కథకుడికీ అవసరం. ఆ అధ్యయనంలోంచి కథావస్తువును ఎన్నుకుని దాన్ని ఒక మంచి కథగా మలచడం కథారచయితలకు ఒక సవాలు. చూసింది చూసినట్లు చెప్పడం కథ కాదు. చూసిన సంఘటనకు, అంశానికి ‘కళ’ను జోడించినప్పుడు చదువుతున్న పాఠకుడిలో ఆసక్తి కలుగుతుంది. ఒక వాస్తవిక సంఘటనను లేదా రచయిత ఎన్నుకున్న అంశాన్ని మంచికథగా మలచడానికి కథా ప్రక్రియ పట్ల అవగాహన ఎంతో ఉపయోగపడుతుంది. తెలుగులో కథా ప్రక్రియ ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో శిల్ప ప్రయోగాలు తెలుగు కథపై జరిగాయి. ఎందరో కథకులు ఎన్నో గొప్ప కథలు రాసి తెలుగు కథను కీర్తి శిఖరాలకు చేర్చారు.
సమాజం మారుతుంది. ఎప్పటికప్పుడు మానవ జీవితం కొత్త వన్నెలు దిద్దుకుంటుంది. సామాజిక వ్యవస్థకీ, వ్యక్తికీ నిరంతరం ఘర్షణ తప్పదు. ఘర్షణలోంచే అభివృద్ధి, శాంతి సాధ్యమవుతాయి. మానవ సంస్కారం పెరిగే కొలదీ ఉత్తమ సమాజం సాధ్యమవుతుంది. ఉత్తమ మానవ సంస్కారానికి కథలు ఎంతో దోహదం చేస్తాయి. పాఠకుల మెదళ్ళకు చేరిన కథా వస్తువులు అనేక రూపాల్లో వ్యక్తం అయి మానవ సంస్కారంగా, సమాజ సంస్క ృతిగా నిలదొక్కుకుని ఉన్నత మానవ సంబంధాలను నిర్మిస్తాయి.
కథ గురించి పైన చెప్పుకున్న అంశాలు శింగమాల సుబ్రహ్మణ్యం గారి ‘వెలుగుపూలు’ కథలలో మనకు కన్పిస్తాయి. ఈ కథా సంపుటిలో 16 కథలున్నాయి. ఈ కథలు మనకు ఒక కొత్త అనుభవాన్ని అందిస్తాయి. ఈ సంపుటిలోని ‘పర్యావరణ స్పృహ’ కథ ఈ కథలలో పైచేయిగా కనబడుతుంది. ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే ‘కెమికల్’ కంపెనీల కాలుష్యం, సహజ వనరుల కోసం సముద్ర తీరప్రాంతాలను ఆక్రమించుకుంటున్న వ్యాపార సంస్క ృతిపై శక్తివంతమైన నిరసన వీరి కథల్లో చూస్తాం. ప్రకృతి పట్ల అమితమైన ప్రేమ ఈ కథల నిండా పరుచుకుని మనల్ని ఆకర్షిస్తుంది.
ఈ సంపుటిలోని తొలి కథ ‘ఓ కడలి కథ’ చదివిన ఏ పాఠకుడూ ‘సముద్రం’ అందాన్ని ఆస్వాదించకుండా వుండలేడు. ఈ కథలో రచయిత చాలా పరవశంతో తన గ్రామంలోని సముద్రతీరాన్ని వర్ణిస్తాడు. మానవ జీవితాలకీ, సముద్రానికీ వున్న అనుబంధాన్ని రచయిత సహజరీతిలో వివరిస్తూ పాఠకుడిని కట్టిపడేస్తాడు. ‘సముద్ర గర్భం నుండి బయటకు విసిరివేయబడిన గవ్వలు, శంఖాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినారు. కొన్ని శిథిలమౌకుండా చాలా అందంగా కనిపిస్తున్నారు. యుద్ధంలో కాళ్ళు చేతులు తెగిపోయి మరణించిన సైనికుల్లాగా కొన్ని పడున్నారు. అవి జీవంతో ఉన్నప్పుడే వాటికి సముద్రుడు తన సామ్రాజ్యంలో స్థానం కల్పిస్తాడు. ప్రాణం పోయిన మరుక్షణం వాటిని బహిష్కరిస్తాడేమో!” , ”చిన్నగా ఉండే ఎఱ్ఱటి ఎండ్రకాయలు కలుగుల్లో నుండి బయటికొచ్చి సందడి చేస్తున్నారు. ఎఱ్ఱటి దుస్తులు ధరించిన సైనిక పటాలాలు నాకు గౌరవ వందనం సమర్పిస్తున్నట్టుగా ఉంది.”
ఇటువంటి తన్మయ వర్ణనలు ‘ఓ కడలి కథ’ కథలో అనేకం ఉన్నాయి. సముద్రాన్నీ, సముద్రంతో పెనవేసుకున్న జీవరాశుల్నీ, సముద్రతీరంతో అనుబంధం పెంచుకున్న మానవ సమూహాల్నీ పలవరించి పలవరించి పాఠకుడిని తనతో పాటు కథ చివరికి తీసుకెళతాడు రచయిత. కథ చివరిలో అప్పటిదాకా పాఠకుడు ఆస్వాదించిన సముద్ర సౌందర్యం విధ్వంసం అయ్యే దృశ్యాన్ని చూపించి ఆలోచనలో పడేస్తాడు రచయిత. ఈ సంపుటిలోని ప్రతి కథనూ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పాఠకుడి ముందుంచారు రచయిత.
‘శిథిలగీతం’ కథ కల్లుగీత కార్మికుడి కుటుంబానికి చెందిన హృదయ విదారక జీవిత దృశ్యం. ఒక పక్క శిథిలమవుతున్న ‘కల్లుగీత వృత్తి’లో తాటిచెట్టుపైన గుండెపోటుతో మరణిస్తాడు కొడుకు. మరో పక్క ఉన్న కొద్దిపాటి పొలాన్ని రియల్ ఎస్టేట్ మాయా జూదంలో పెట్టి అప్పులపాలయి తాగుడికి బానిసవుతాడు మనవడు. తన కళ్ళ ముందు రెండు తరాల విధ్వంసాన్ని చూసిన వృద్ధుడి జీవిత కథ పాఠకుడికి కన్నీళ్ళు తెప్పిస్తుంది. ముందుచూపును ప్రదర్శించలేని ప్రభుత్వ విధానాల ఫలితంగా జీవికకు సరైన ప్రత్యామ్నాయం లేక నాశనమవుతున్న జీవితాలను కళ్ళకు కట్టిస్తుంది ఈ కథ. సరైన ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలే ఈ పరిణామాలకు బాధ్యత వహించాలని ఇటువంటి కథలు హెచ్చరిస్తాయి. ఇంకా ఈ సంపుటిలో నిరుద్యోగం, మద్యం ప్రభావంతో జీవితాలు నాశనం కావడం, సముద్రతీర గ్రామాలు ఎదుర్కొనే తుఫాను బాధలు, కులవివక్ష, మూఢ నమ్మకాలు, పెత్తందారీ వర్గాల ఆధిపత్య భావజాలాలు వంటి కథాంశాలు పాఠకులను ఆలోచింపజేస్తాయి.
‘మామా!… నేను ధర్మ విధ్వంసకుణ్ణా?’ కథ భారతంలోని ఘటోత్కచుడి పాత్ర అంత్ణసంఘర్షణను ఇతివృత్తంగా చేసుకుని రాసింది. ఈ కథాంశం భిన్నంగా ఉండి కథలోని ఘటోత్కచుడి ఆవేదనతో పాఠకుడు బాగా కనెక్ట్ అవుతాడు. సుబ్రహ్మణ్యం గారికి సమకాలీన సామాజిక అంశాల పట్లే గాక పురాణాల పట్ల కూడా నిశితమైన పరిశీలన, అవగాహన, అధ్యయనం ఉన్న విషయం మనకు ఈ కథ పట్టిస్తుంది.
సంఘర్షణను గురించి ఆలోచించేటప్పుడు దాని పరిష్కారాన్ని గురించి కూడా ఆలోచించాలి. కథలోని సంఘర్షణకు రచయిత పరిష్కారాన్ని చూపించాలా, అక్కరలేదా అన్న చర్చ అన్ని భాషల్లోనూ ఎంతో కాలంగా సాగుతూనే ఉంది. తప్పకుండా పరిష్కారాన్ని చూపించాలి అని కానీ, లేదా చూపించకూడదు అని కానీ వాదించటం మొరటువాదాలు. పరిష్కారం కథలో నుంచే సహజంగా రూపొందాలి. పరిష్కారాన్ని బలవంతంగా కథ మీద రుద్దటం శిల్పపరంగా బాధ్యతా రాహిత్యం మాత్రమే. అంతేకాకుండా అన్ని కథలకూ పరిష్కారాన్ని చూపించటం సాధ్యం కాదు.
– వల్లంపాటి వెంకటసుబ్బయ్య
వల్లంపాటి గారు చెప్పినట్టు ‘వెలుగుపూలు’ కథలు సరిగ్గా ఆ దృష్టిని కలిగిఉన్న కథలు. ఎంతో సంయమనంగానూ, అవసరమైనప్పుడు తగిన ఆవేశంగానూ ఆయా కథల్లోని పాత్రలను సహజరీతిలో చిత్రించారు. మధ్య మధ్యలో నెల్లూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల మాండలిక పదాలు పలకరిస్తూ పాఠకుడికి ఆహ్లాదం కలిగిస్తాయి.
ఈ సంపుటికి శీర్షికగా పెట్టిన ‘వెలుగుపూలు’ దీపావళి పండగనాడు పేల్చే టపాసుల కాలుష్యంపై రాసిన కథ. పిల్లలకు ఈ టపాసుల పండుగంటే అమితమైన ఇష్టం. కాలుష్యాన్ని నివారిస్తూ పిల్లవాడి కోరిక తీర్చడానికి ఈ కథలోని తండ్రి ఏం చేసాడో తెలుసుకోవాలంటే ‘వెలుగుపూలు’ కథను చదవాల్సిందే. ఈ సంపుటిలోని కథలన్నీ మంచి ఆలోచనలను వెలిగించే కాంతిదీపాలు. రచయితకి ఇది తొలి కథాసంపుటి. ఈ కథలన్నీ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమై, పాఠకుల ఆదరణ పొందినవే! మరిన్ని ఆలోచింపజేసే ఇతివృత్తాలతో ఎన్నో కథలు ఈ రచయిత నుంచి రావాలని ఆశిద్దాం.
(11.8.2024 ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 5వ బ్లాక్, రూం నెంబరు 223లో ఆవిష్కరణ జరుగుతుంది.)
– వొరప్రసాద్, 94900 99059