ఊరవతల ఒంటరి గోడ
నవ్వు ముఖాలతోనే కనిపిస్తుందెప్పుడూను
గోడవెనక చీకటిలా నవ్వు వెనక కల్మషం ఎవరికీ కనబడదు
.ఆ ముఖం ఎప్పుడూ ఒకటే అయ్యుండదు
ఎప్పుడేముఖంతో నవ్వుతుందో దానికీ తెలీదు,
నవ్వే ముఖాల్ని ఆకలిడొక్కల పశువులు
పీక్కుతింటున్నప్పుడల్లా ఎంత సంతోషిస్తుందో..
మరో నవ్వు ముఖం వచ్చి వాలుతుంది
దాని సంతోషాన్ని చెరిపేస్తూ
ఏ ముఖాన్ని ఎందుకు అతికించుకోవాలో
దానికి తెలీదు
ఏ ముఖం ఎప్పుడు జారిపోతుందో అదీ తెలీదు
నవ్వే ముఖాల వెనక ఎన్ని చీకటి కోరలున్నాయో తెలిసినా
ఏమీ చేయలేని అశక్తత దానిది!
ఇప్పటికెన్ని ముఖాల్ని తగిలించుకుందో
ఆ ముఖాల్ని తగిలించుకున్నందుకు ఎంత కృంగిపోయిందో
గోడ జన్మ ఎత్తినందుకు
లోలోన కుమిలిపోతుందే గానీ బయటపడదు
ఆ నవ్వుల్లో ఎన్నెన్ని బుసలుకొట్టే నాగులో
ఆ చూపుల్లో ఎన్నెన్ని విషపు బాణాలో
ఎన్ని నవ్వు ముఖాల్ని తగిలించుకున్నా
నవ్వు రాదు బండ బారిపోయిన మొండిగోడకి
దాని పెదాల మీంచి నవ్వెప్పుడో రాలిపోయింది
రేకుతో గీకేసిన సున్నం పొడిలా …
చీకటికి వెల్లవేసి వెన్నెలని భ్రమింపజేసే
ఐంద్ర జాలికులకు గోడ ఒక ప్రచార సాధనం!
ఇంద్ర ధనుస్సుల్ని గోడ మీద అతికించి
దానినొక వెలియాలిలా నిలబెడతారు నవ్వుల సొంతదారులు
పాపం గోడ !
తెల్లగా వెన్నెల్లా నవ్వాలనే దాని కోరిక ఎప్పటికీ నెరవేరదు
ఏదోవొక ముఖం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది
మరకమరకల విషహాసాలతో …
తనను కూల్చివేసే ఒక పెను తుపాను కోసం
నిలువెత్తు మౌన విషాదంలా ఎదురుచూస్తుందిప్పుడు
విషపు నవ్వుల ముఖాల్ని మోస్తూ ….
– లాంగుల్యా