గగనతలం మెరిసిపోతోంది
మిరుమిట్ల కాంతులతో….
భూతలం మారుమోగుతోంది
పేలుళ్ల సవ్వడులతో….
నిరుడు రాజేసిన దీపాలింకా
వెలుగుతూనే ఉన్నాయి…
ఆ ఆకాశ కాంతులు
తిమిరంతో సమరం నెరపే
వెలుగు జువ్వలు కాదు!
నివాసాల్ని నిశీధులుగా మార్చేస్తున్న
విద్వేష విహంగ ఉద్గారాలు..
ఆ నిర్విరామ సవ్వళ్ళు
హర్షధ్వాన బాణాసంచాలు కావు.
ప్రళయ గర్జనతో
విలయాలు సృష్టిస్తున్న
విస్ఫోటన దాడులు.
ఆ వెలుగు దీపాలు
చమురు ఒత్తుల్తో కాదు
ఉన్మాద ఊచకోతలకి
పారే నెత్తురులో కాలుతున్న చితులు.
ఇప్పుడు నరకాసురులు
కోరే నరబలి ఆకలితో కాదు
వేళ్లూనిన మతోన్మాదం
పేట్రేగుతున్న ఆధిపత్యం
కమ్ముకొస్తున్న సామ్రాజ్యవాదం
జనజీవనాన్ని వణికిస్తున్న
కుహనా అసుర ఆలోచనల్ని వధించేసి
అభాగ్యుల ముఖాల్లో
నవ్య కాంతులు వెలిగించాలి.
ఖండఖండాన అశాంతులు రేపుతున్న
అసుర దీపావళికి తెర దించే
అసలు దీపావళి రావాలి!
– చిలుకూరి శ్రీనివాసరావు,
సెల్ : 8985945506