ప్రశ్న

May 13,2024 03:05 #aksharam

‘ప్రశ్న’ నీకెంత ధైర్యం
భూమిని చీల్చుకు పుట్టే విత్తనంలా
తూర్పున ఉదయించే సూర్యుడవై
బూడిద నుంచి మళ్లీ పైకెగిరే ఫినిక్స్‌లా
మనుషుల మనోఫలకాలపై ఉద్యమిస్తూనే ఉంటావు

నీ మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికి
దేశద్రోహి, తుక్డే తుక్డే గ్యాంగ్‌
అర్బన్‌ నక్సల్‌, చివరాఖరికి
పాకిస్తానీ, ఖలిస్తానీ అని కూడా అంటాం

నిన్ను బెదిరించడానికి
ముష్టిఘాతాలు, మూకదాడులు
కంకరలు, కత్తులు, కటారులు
తుపాకులు, తూటాలు పాలుపంచుకుంటాయి
నిన్ను నిలువరించడానికి
తాడా, పోటా, ఊపాలాంటి చట్టాలుంటాయి
తీహార్‌, ఎరవాడ, అండమాన్‌
అండర్‌ సెల్‌లు అందుబాటులో ఉంటాయి
నీకు సంకెళ్లు వేయడానికి
ఏడు పదుల వయసు అడ్డు కాదు
చక్రాల కుర్చీలు అన్న కనికరం రాదు
దీర్ఘకాల రోగులన్న దృష్టుండదు
మేధావి వర్గమున్న మనసే రాదు

ఆదిలో అణచాలన్న ఆలోచన మాది
ప్రజల దశ దిశ మార్చాలన్న దూరదృష్టి నీది
పాలక పక్షం మేము, ప్రజల పక్షం నీవు
అయినా..! ప్రశ్న నీకు
అదురు బెదురు అసలే లేవు
ప్రశ్నా, నీకెంత ధైర్యం
మనసును చీల్చుకొని మొలకెత్తుతూనే ఉంటావు!
– డా.ఎడ్ల కల్లేశ్‌
98668 65126

➡️