కుడి కన్ను గుడ్డిదేం కాదు!
దానికి అంతా తెలుసు
ద్వేషం రంగు పూయందే
దేశభక్తి మొలకెత్తదని!
అవసరం వచ్చినప్పుడు
భయపెట్టో బామాలో
దాని కౌగిలి విస్తరిస్తుంది!
పట్టు సడిలినప్పుడల్లా
ఏదో కొత్త ఎత్తుగడ
జమిలి దాని ఆలోచనలో భాగమే!
భిన్నత్వాన్ని ప్రేమించని వాడు
ఏకత్వాన్ని ఆశించరాదు
సహనమే సర్వ రక్ష!
ఒకవైపు ఒకే చెట్టు
వేయి పూలు పూస్తుంటే
ప్రపంచమే నివ్వెరపోతున్నది!
ఒకటిగా ఉండటం వేరు
ఒకేలా ఉండమనడంలో
ఏదో కనిపించని కుట్ర!
మనం ఋతువులను నియంత్రించనట్లే
వైవిధ్యాన్ని కాదనలేము
ఎవడొస్తాడో రాని
దేశం సరిహద్దులు తాకని
అన్ని గొంతుకలు ఒక్కటైతవి!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261