దుఃఖిత స్థలి

Feb 3,2025 04:06 #Kavitha, #sahityam

భక్తి ముసుగులో వ్యక్తి భద్రతకు తూట్లు
కబోది కవ్వింపుల వ్యవస్థ
తరతరాలుగా ఇదే అవస్థ
చరిత్ర నేర్పిన పాఠాలు
చెవికెక్కని నిర్వాహ గణం
ప్రాణాలే మూల్యంగా గుణపాఠం!

అక్కడ అమృత స్నానాలు
అసువుల గీతాలు పాడాయి
ప్రయాగ్‌ రాజ్‌
దు:ఖిత స్థలిగా బావురుమంది

మౌని అమావాస్య
బతుకు చీకట్లను చిమ్మింది
త్రివేణి సంగమం
ఆధ్యాత్మిక గమనం వీడి
ఆర్తనాదాల ఆగమనం అయ్యింది
కిక్కిరిసిన జన తొక్కిసలాట
కుంభమేళ సంబురాన్ని మింగింది
విషాద శ్లోకమై శోకమై నిలిచింది!

శూన్యమైన ఏర్పాట్ల నడుమ
చెత్తడబ్బాలు సైతం వెక్కిరించాయి
దైవ చింతన సామూహికంగా కన్నీరొలికింది..!

– డా.కటుకోఝ్వల రమేష్‌
99490 83327

➡️